Begin typing your search above and press return to search.

సూపర్ మార్కెట్లకు జైలుశిక్ష వేసే రూల్ మనకొస్తే?

By:  Tupaki Desk   |   7 Feb 2016 10:30 PM GMT
సూపర్ మార్కెట్లకు జైలుశిక్ష వేసే రూల్ మనకొస్తే?
X
వ్యాపారమైనా.. మరొకటైనా ఎంతో శ్రమపడి తయారు చేసే ఆహారపదార్థాలు వృధా కాకూడదని.. అవసరమైతే పక్కన పడేస్తాం కానీ.. వాటిని మాత్రం ఎవరికి ఇవ్వమన్నట్లుగా వ్యవహరించే ధోరణి సర్వత్రా కనిపిస్తుంది. ఇంట్లో ఉన్న ఆహారపదార్థాలు తినరు.. కొంతకాలం కాగానే అవి పనికిరావని.. లేట్ అయ్యిందని పడేసేవాళ్లు చాలామందే ఉంటారు. ఇక.. షాపుల వారు.. సూపర్ మార్కెట్లు.. బడాబడా మాల్స్ లో అయితే.. ఫుడ్ మీద వృధా చాలా ఎక్కువగా ఉంటుంది. టైమ్ అయిపోయిందని పడేసే ఆహారపదార్థాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

అలాంటివాటికి చెక్ చెప్పేందుకు తాజాగా ఫ్రాన్స్ లో ఒక రూల్ తీసుకొచ్చారు. దీని ప్రకారం.. 400 చదరపు మీటర్లు.. అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న సూపర్ మార్కెట్లు.. బడా హైపర్ మార్కెట్లు తమ దగ్గరి ఆహారపదార్థాల్నివృధాగా పారేయటం నేరంగా తేలుస్తూ తాజాగా చట్టం తీసుకొచ్చారు. ఆహారపదార్థాల్ని వృధాగా పారేసేకన్నా.. ఫుడ్ బ్యాంకులకు కానీ.. ఛారటీ సంస్థలకు కానీ ఇవ్వాల్సి ఉంటుంది.

మా వస్తువులు మా ఇష్టం అన్నది లేకుండా ఆహారపదార్థాలు ఏవైనా కానీ వృధాగా పడేస్తే వారికి భారీగా జరిమానా విధించటమే కాదు.. రెండేళ్ల వరకూ జైలుశిక్ష వేసేలా ఫ్రాన్స్ లో తాజాగా చట్టం తీసుకొచ్చారు. ఆ దేశ సెనేట్ తాజాగా ఏకగ్రీవంగా ఈ బిల్లుకు ఆమోదం పలుకుతూ చట్టంగా మార్చింది. ఈ చట్టంతో పేదలకు మరింత ఆహారాన్ని అందించే అవకాశం ఉందని అక్కడి నేతలు ఆలోచిస్తున్నారు. ఇలాంటిదేదో మనకు తగ్గట్లు కాస్త మారిస్తే మంచిదేమో..?