అమెరికాలో దారుణం..నలుగురు తెలుగోళ్లు మృతి!

Sun Jun 16 2019 23:43:19 GMT+0530 (IST)

అగ్రరాజ్యం అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. ఐవోవా రాష్ట్రంలోని వెస్ట్ డెస్ మొయినిస్ లో నలుగురు తెలుగువారు అనుమానాస్పద రీతిలో మరణించటం ఇప్పుడు షాకింగ్ గా మారింది. అనుమానాస్పద స్థితిలో ఉన్న నాలుగు మృతదేహాల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతులు ఏపీకి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. అయితే.. వీరు ఏపీకి చెందిన ఏ ప్రాంతానికి చెందిన వారన్న విషయంపై స్పష్టత రాలేదు.దారుణ హత్యకు గురైన వారిని సుంకర చంద్రశేఖర్.. లావణ్య.. వారిద్దరి పిల్లలుగా గుర్తించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం చంద్రశేఖరే భార్య.. ఇద్దరు పిల్లల్ని చంపేసి.. అనంతరం తనను తాను చంపుకొని ఉంటారని భావిస్తున్నారు.

44 ఏళ్ల చంద్రశేఖర్.. అతని సతీమణి లావణ్య(41).. ఇద్దరు చిన్నారులు ఒకరి వయసు 15.. మరొకరు వయసు పదేళ్లుగా గుర్తించారు.

ఎందుకు చనిపోయారు?  ఎలా చనిపోయారన్న విషయంపై చాలా అనుమానాలు ఉన్నాయి. వీరి మరణానికి సంబంధించిన సమాచారాన్ని చంద్రశేఖర్ ఇంటి పక్క వ్యక్తి పోలీసులకు సమాచారం ఇవ్వటంతో ఈ దారుణం బయటకు వచ్చింది. మృతులంతా తుపాకీ కాల్పుల కారణంగానే మరణించారు.

ఎవరైనా  వీరందరిని చంపేశారా?  లేక.. చంద్రశేఖర్ భార్యను.. పిల్లల్ని చంపేసి.. తర్వాత తనను తాను కాల్చుకొని చనిపోయారా? అన్న దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై పోలీసులు ఇప్పటికే విచారణ షురూ చేశారు. స్థానికుల సమాచారం ప్రకారం చంద్రశేఖర్ మానసిక పరిస్థితి ఈ మధ్య కాలంలో సరిగా లేదని.. తీవ్రమైన ఒత్తిడితో ఉన్నట్లు అక్కడి వారు చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాల్ని వెల్లడించాల్సి ఉంది. అసలేం జరిగిందన్న వివరాలు బయటకు రావాల్సి ఉంది. స్థానికంగా ఈ హత్యలు సంచలనంగా మారాయి.