లోక్ సభకు రేవంత్...ఊహకే అందనట్టుగా

Thu May 23 2019 15:38:36 GMT+0530 (IST)

తెలంగాణ అసెంబ్లీకి ముందస్తుగా జరిగిన ఎన్నికల్లో బంపర్ విక్టరీ సాధించిన గులాబీ పార్టీ టీఆర్ఎస్... సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం ఊహించని ఫలితాలు వచ్చాయి. సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 17 సీట్లలో ఓ సీటును మజ్లిస్ కు ఇచ్చేస్తే.. మిగిలిన 16 సీట్లలోనూ గులాబీ జెండాలే ఎగరాలని కేసీఆర్ కలలు కన్నారు. అందుకోసం తనదైన వ్యూహాలను రచించారు. అయితే ీఆ వ్యూహాలన్ని బెడిసికొట్టాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బోల్తా పడ్డ హస్తం పార్టీ కాంగ్రెస్... సార్వత్రికంలో మాత్రం తెలంగాణలో సత్తా చాటిందనే చెప్పాలి.అసలు ఒక్క ఎంపీ సీటును కూడా గెలవలేదన్న విశ్లేషణలను పటాపంచలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఏకంగా 3 స్థానాల్లో విజయఢంకా మోగించింది. కాంగ్రెస్ గెలిచిన స్తానాలన్నీ కూడా కీలక స్ధానాలు కావడం కూడా గమనార్హమే. టీఆర్ఎస్ పై అలుపెరగని పోరు సాగిస్తున్న నేత రేవంత్ రెడ్డి.. మల్కాజిగిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి టీఆర్ఎస్ అభ్యర్థిని మట్టి కరిపించారు. ఈ సీటును గడచిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మల్లారెడ్డి గెలుపొందగా... ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్ లో చేరారు. అంటే ఆ సీటు గులాబీ పార్టీ సీటుగానే పరిగణించాలి.

అలాంటి చోట రేవంత్ రెడ్డి విజయం సాధించడం అంటే నిజంగానే టీఆర్ ఎస్ కు షాకింగనే చెప్పాలి. రేవంత్ విజయం ద్వారా మల్కాజిగిరీని తన ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్ పార్టీ మరో మూడు చోట్ల కూడా విజయం సాధించింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ నుంచ -కోమటిరెడ్డి వెంకటరెడ్ది భువనగిరి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా విజయం సాధించారు. మొత్తంగా ఏ ఒక్కరూ ఊహించని విధంగా టీఆర్ఎస్ కు షాకిచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏకంగా 3 ఎంపీ సీట్లను కైవసం చేసుకోవడం నిజంగానే ఆశ్చర్యమేనని చెప్పక తప్పదు.