బీజేపీ ఇమేజ్ కు భారీ డ్యామేజే!

Sun Jun 23 2019 12:43:30 GMT+0530 (IST)

ఏపీ రాజకీయంలో భారతీయ జనతా పార్టీ ఇమేజ్ పెరిగిందా? తగ్గిందా? అంటే నిస్సందేహంగా తగ్గిందనే అంటున్నారు విశ్లేషకులు. ఒకవైపు ఫిరాయింపుల నేతలను చూసుకుని భారతీయజనతా పార్టీ నేతలు తొడలు కొడుతున్నారు. ఇప్పటి వరకూ వచ్చిన వారు మాత్రమే కాకుండా ఇంకా వస్తారని వారు గర్వంగా చెప్పుకుంటూ ఉన్నారు. అయితే వచ్చే వాళ్లు అంతా తమ తమ వ్యక్తిగత స్వార్థాలను చూసుకుని - కేసుల భయాలతో వస్తున్నారనే తప్ప మరోటి కాదని సామాన్య ప్రజలకు కూడా తెలిసిపోతోంది.అందులోనూ ఇప్పటి వరకూ వెళ్లిన నలుగురిలో ఎవరికీ ప్రజా బలం లేదు. అంతా నామినేటెడ్ పదవులు పొందిన వారు. కనీసం ప్రజల నుంచి ఎంపీలుగా ఎన్నికైన వారు అయితే చెప్పుకోవడానికి కాస్త ఘనంగా ఉండేది. అది కూడా చెప్పుకోవడానికి మాత్రమే!

ఎంపీలు మారినంతమాత్రన ప్రజా బలం పెరిగిందని చెప్పడానికి లేదు. ఇది వరకూ అలాంటి రాజకీయాలు చాలానే జరిగాయి. ఇప్పుడు ఫిరాయించింది రాజ్యసభ సభ్యులు మాత్రమే. ఇలాంటి నేపథ్యంలో  వారి బలం బీజేపీకి ఎంత వరకూ ఉపయోగ పడుతుంది అనేది అర్థం చేసుకోవచ్చు.

ఇలాంటి నేపథ్యంలో రాజ్యసభ సభ్యుల చేరిక భారతీయ జనతా పార్టీకి ప్రజల్లో బలాన్ని పెంచే అంశం కాకపోగా - ఫిరాయింపు రాజకీయాలతో నెగిటివ్ ఇమేజ్ ను పెంచుకుంటోంది కమలం పార్టీ. అయితే ఆ పార్టీకి రాజ్యసభలో బలం పెరిగింది. రాజ్యసభలో ఇప్పటి వరకూ బీజేపీకి తగినంత బలం లేదు.

ఇలాంటి నేపథ్యంలో ఈ ఫిరాయింపుదారులకు కమలం పార్టీ చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంది. ప్రజాబలం పరంగా బీజేపీకి ఇది పెద్దగా ప్రయోజనం లేని పరిణామం. కేవలం రాజ్యసభలో బలోపేతం కావడానికి మాత్రం ఉపయోగపడుతూ ఉంది. అయితే ఏపీ ప్రజల్లో మాత్రం బీజేపీ పై ఇది నెగిటివ్ ఇమేజ్ కు కారణం అవుతూ ఉంది.