Begin typing your search above and press return to search.

టీడీపీకి చావు దెబ్బ..ఆ నలుగురు ఇకపై బీజేపీ ఎంపీలే!

By:  Tupaki Desk   |   20 Jun 2019 2:06 PM GMT
టీడీపీకి చావు దెబ్బ..ఆ నలుగురు ఇకపై బీజేపీ ఎంపీలే!
X
అనుకున్నంతా అయ్యింది. ఏపీలో కొత్తగా విపక్ష పాత్రలోకి వచ్చి కూర్చున్న తెలుగుదేశం పార్టీకి చావు దెబ్బ తగిలింది. టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు వై. సుజనా చౌదరి - సీఎం రమేశ్ - గరికపాటి మోహన్ రావు - టీజీ వెంకటేశ్ లు కాసేపటి క్రితం బీజేపీలోకి చేరిపోయారు. నిన్న సాయంత్రం నుంచి ఈ నలుగురు ఎంపీలు బీజేపీలోకి చేరబోతున్నారన్న వార్తలు పెను కలకలమే రేపాయి. పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఫారిన్ టూర్ లో ఉన్న సమయంలో... అదను చూసుకుని ఈ నలుగురు ఎంపీలు పార్టీ మారిపోయారు. నేటి ఉదయం నుంచి వరుసగా చోటుచేసుకున్న పరిణామాలు సాయంత్రం 6 గంటలకు పూర్తి అయ్యాయి. బీజేపీలో చేరేందుకు అంగీకరించిన ఈ నలుగురు ఎంపీలను ఏ విధంగా పార్టీలోకి తీసుకోవాలన్న కోణంలో బీజేపీ అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించింది. అందులో భాగంగా నలుగురు ఎంపీలతో చర్చలు జరుపుతూ బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నద్దా... చివరికి రాజ్యసభ చైర్మన్ కు లేఖ రాయాలని తీర్మానించారు.

ఆ మేరకు తాము నలుగురం బీజేపీలోకి చేరిపోతున్నామని, తమను ఇకపై టీడీపీ ఎంపీలుగా కాకుండా బీజేపీ ఎంపీలుగా పరిగణించాలని వారు రాజ్యసభ చైర్మన్ గా ఉన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కోరారు. అంతేకాకుండా రాజ్యసభలో టీడీపీ పార్లమెంటరీ పార్టీని బీజేపీ పార్లమెంటరీ పార్టీలో చేర్చాలని కూడా వారు తమ లేఖలో వెంకయ్యను కోరారు. ఈ అభ్యర్థనకు వెంకయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్గుగానే పరిగణించాలి. ఎందుకంటే... రాజ్యసభలో టీడీపీ సభ్యులు ఆరుగురు ఉన్నారు. ఆరుగురిలో ఏకంగా నలుగురు ఒకే సారి పార్టీ మారుతున్న నేపథ్యంలో వారి పాత పార్టీ శాఖను వారు చేరుతున్న కొత్త పార్టీ శాఖలో కలపడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. మొత్తం... వెంకయ్యకు లేఖ ఇవ్వడంతో రాజ్యసభలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ.. బీజేపీ పార్లమెంటరీ పార్టీలో విలీనం అవడంతో పాటుగా ఈ నలుగురు ఎంపీలు కూడా బీజేపీ సభ్యులుగానే పరిగణింపబడతారు. ఈ సందర్భంగా అటు బీజేపీ నుంచే కాకుండా ఇటు పార్టీ మారిన నలుగురు టీడీపీ ఎంపీల వ్యాఖ్యలు కూడా ఆసక్తి రేకెత్తిస్తున్నాయని చెప్పక తప్పదు.

ప్రజా ప్రయోజనాల దృష్ల్యానే పార్టీ మారుతున్నట్లుగా నలుగురు ఎంపీలు కూడబలుక్కుని చెప్పుకొచ్చారు. ఎంపీ సుజనా చౌదరి మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత బీజేపీతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. సంఘర్షణ పడటం కంటే సహకారం ద్వారానే ఏదైనా సాధించుకోగలమని నమ్ముతున్నామని అన్నారు. విభజన చట్టం పకడ్బందీగా అమలుకు అవకాశం కలుగుతుందని ఆశిస్తున్నామని ఆయన అన్నారు. జాతి నిర్మాణంలో భాగస్వాములం అయ్యి దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మా వంతు ప్రయత్నం చేస్తామన్నారు.

ఇక మీడియా ముందు తనదైన శైలి వ్యవహారాన్ని ప్రదర్శించే టీజీ వెంకటేశ్ మరో అడుగు ముందుకేసి... రాయలసీమ అభివృద్దిని దృష్టిలో పెట్టుకునే తాను పార్టీ మారుతున్నట్లుగా ప్రకటించారు. బీజేపీతో తనకు చాలా కాలంగా అనుబందం ఉందని చెప్పిన టీజీ గతంలో తాను రాయలసీమలో ఏబీవీపీ నాయకుడిగా - రాష్ట్ర యువ మోర్చా ఉపాధ్యక్షుడిగా పనిచేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. తాను బీజేపీలో చేరడం ద్వారా మాతృసంస్థకు తిరిగి వచ్చిన భావన కలుగుతోందని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం - మోదీ కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని - అందుకే - తాము కూడా ప్రజల వెంటే వెళ్లాలని నిర్ణయించుకున్నామని టీజీ వెంకటేశ్ పేర్కొన్నారు.