జగన్‌కు బీజేపీ దగ్గరవుతోందా...సంకేతాలు ఇవే!

Tue Aug 20 2019 15:49:55 GMT+0530 (IST)

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డితో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సత్సంబంధాలు పెట్టుకునే దిశగా ప్రయత్నాలు చేస్తుందా ? జగన్ తో ఘర్షణాత్మక వైఖరి కంటే స్నేహపూర్వక ధోరణితోనే ముందుకు వెళితే భవిష్యత్తులో కలిసి వస్తుందన్న ప్లాన్ తోనే బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జగన్ కు ఓ కీలక పదవి ఇచ్చింది. జగన్ ను అంతర్ రాష్ట్రాల మండలి స్థాయీ సంఘం సభ్యునిగా నియమించింది. దేశం మొత్తం మీద బీజేపీయేతర ముఖ్యమంత్రుల్లో కేవలం నలుగురికి మాత్రమే ఈ చోటు దక్కింది. వారిలో ఒకరు కేంద్రంలో ఎన్డీయేలో భాగస్వామిగా ఉండగా... ఇద్దరు మాత్రం తటస్థులుగా ఉన్నారు.అంతరాష్ట్రాల మండలి వివిధ రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలను దర్యాప్తు చేసి వాటికి తగిన పరిష్కార మార్గాలను సూచిస్తుంది. వీటిని కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తే కేంద్రం ఆ రెండు రాష్ట్రాల మధ్య సమస్యను ఏం చేయాలనే దానిపై సామరస్య పూర్వకంగా నిర్ణయం తీసుకుంటుంది. మోడీ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చాక ఈ మండలిలో చాలా మార్పులు తీసుకున్నారు. అంతకు ముందు వరకు ఈ సంఘానికి ప్రధాని చైర్మన్ గా ఉండేవారు. రాజ్యాంగంలోనూ ప్రధాని గౌరవ చైర్మన్ గా ఉంటారన్న నిబంధన కూడా ఉంది.

ఈ సారి మోడీ హోం మంత్రిని చైర్మన్ గా నియమించారు. ఈ క్రమంలోనే దక్షిణాది రాష్ట్రాల నుంచి జగన్ కు ఒక్కడికే చోటు దక్కడంతో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నట్లయ్యింది. ఇటీవల ఏ పదవి ఇవ్వాలన్న బీజేపీ రాజకీయ కోణంలోనే చూస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ పేరు కాదని మరి జగన్ ను తీసుకుంది. యూపీఏ - ఎన్డీయేలకు సంబంధం లేకుండా న్యూట్రల్ గా ఉంటోన్న జగన్ - నవీన్ పట్నాయక్ కు ఈ సంఘంలో చోటు దక్కింది.
 
తెలంగాణ మీద కొద్ద రోజులుగా బీజేపీ అధిష్టానం ప్రత్యేకంగా ఫోకస్ పెడుతోంది. కేసీఆర్ తో పాటు టీఆర్ ఎస్ ను టార్గెట్ గా చేసుకుని చాపకింద నీరులా దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే కేసీఆర్ తో ఎలాగూ అక్కడ బీజేపీ శ్రేణులు ఢీ అంటే ఢీ అనేలా ముందుకు వెళుతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ సీఎం జగన్ తో భవిష్యత్తు అవసరాలతో పాటు దక్షిణాదిలో ఎవరో ఒక సీఎంతో అయినా మంచిగా ముందుకు వెళ్లాలన్న వ్యూహాత్మక నిర్ణయంతోనే బీజేపీ జగన్ కు చోటు ఇచ్చినట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.