Begin typing your search above and press return to search.

నలుగురు ‘టీ’ లాయర్లపై ఏడాది వేటు?

By:  Tupaki Desk   |   13 Feb 2016 4:05 AM GMT
నలుగురు ‘టీ’ లాయర్లపై ఏడాది వేటు?
X
నిరసన వ్యక్తం చేయటం తప్పేమీ కాదు. కానీ.. దానికి ముందువెనుకా చూసుకోవాల్సిన అవసరంఎంతైనా ఉంది. కానీ.. అలాంటిదేమీ పట్టించుకోకుండా అనవసర దూకుడును ప్రదర్శిస్తున్న వైనం ఇప్పుడు చాలా చోట్ల కనిపిస్తోంది. సమాజానికి రోల్ మోడల్స్ గా ఉండాల్సిన వారిలో ఒకరైన లాయర్లు.. హద్దులు మీరి తాజాగా వ్యవహరించిన ఒక వైనంపై బార్ అసోసియేషన్ తీవ్రంగా స్పందించింది. పట్నా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఎల్.నర్సింహా రెడ్డి కరీంనగర్ జిల్లాలో జరిగే ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అంబేడ్కర్ ఆశయాల్ని వివరిస్తున్నారు.

ఇదే సమయంలో కొందరు జూనియర్ లాయర్లు సభలో అలజడి సృష్టించారు. నిరసన చేపట్టిన వారు.. సదరు న్యాయమూర్తి చుండూరు కేసులో దళితులకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారని.. అంబేడ్కర్ గురించి మాట్లాడకూడదంటూ విమర్శలు చేశారు. దీంతో.. ఆయన కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఈ తరహా వైఖరిపై కరీంనగర్ బార్ అసోసియేషన్ నలుగురు జూనియర్ లాయర్లను ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏమైనా నిరసన పేరుతో న్యాయవాదుల చర్య ఒకవిధమైన చర్చకు దారి తీస్తే.. తాజాగా వారిపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకోవటం ద్వారా కరీంనగర్ బార్ అసోసియేషన్ మరోవిధమైన చర్చకు తెర తీసిందని చెప్పాలి.