Begin typing your search above and press return to search.

బ్రేకింగ్: టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూత..

By:  Tupaki Desk   |   21 Sep 2019 9:23 AM GMT
బ్రేకింగ్: టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూత..
X
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు - చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్(68) కన్నుమూశారు.. కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన తీవ్ర అస్వస్థతకు గురికాగా కుటుంబ సభ్యులు ఇటీవలే చెన్నైకి తరలించారు. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం 2.07 గంటలకు తుదిశ్వాస విడిచినట్టు ఆయన కుటుంబ సభ్యులు మీడియాకు అధికారికంగా తెలిపారు. గడిచిన 24 గంటలుగా ఆయన ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉంది. అంతలోనే ఆయన మరణించడం చంద్రబాబు సహా టీడీపీ శ్రేణులను కలిచివేసింది.

2009 - 2014లో చిత్తూరు ఎంపీగా గెలిచిన శివప్రసాద్ తనదైన ముద్ర వేశారు. పార్లమెంట్ లో వివిధ వేషధారణలతో అందరినీ ఆకట్టుకున్నారు. సమైక్య ఆంధ్రా ఉద్యమం - ఆ తర్వాత టీడీపీకి అన్యాయాలపై పార్లమెంట్ లోనే సినిమా వేశాలు వేస్తూ మీడియాల్లో పతాక శీర్షిక అయ్యారు.

కాగా కొద్దిరోజులుగా శివప్రసాద్ మూత్రపిండాల వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. రెండు వారాల పాటు చెన్నైలో చికిత్స తీసుకున్నారు. ఇటీవలే డిశ్చార్జి అయిన శివప్రసాద్ కు మరోసారి మూత్రపిండాల్లో సమస్యలు తలెత్తినట్లు సమాచారం. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను గురువారం ఉదయం చెన్నైకి తీసుకెళ్లి అత్యవసర చికిత్స విభాగంలో చేర్చారు. శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు..

కాగా శివప్రసాద్ సొంతూరు చిత్తూరు జిల్లా పూటిపల్లి. 1951 జూలై 11న నాగయ్య-చెంగమ్మ దంపతులకు మద్రాస్ రాష్ట్రంలో జన్మించారు. తిరుపతి ఎస్వీ వైద్య కాలేజీలో చదివే రోజుల్లో నారా చంద్రబాబుతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత మంచి స్నేహితులుగా మారారు. బాబు కోరిక మేరకు రాజకీయాల్లోకి వచ్చి 2009 - 2014లో వరుసగా చిత్తూరు నుంచి టీడీపీ ఎంపీగా గెలిచారు.

శివప్రసాద్ కు సినీ రంగంలోనూ ఆయనకు ప్రవేశముంది.. కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు. సినిమాల్లోనూ రాణిస్తూనే రాజకీయాల్లోనూ మంచి గుర్తింపును సాధించారు.