ఎన్టీఆర్ పై అదిరిపోయే సెటైర్ వేసిన వాజ్ పేయి

Thu Aug 16 2018 18:42:28 GMT+0530 (IST)

భారతరత్న - భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అగ్రనేత - మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి(93) గురువారం సాయంత్రం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వాజపేయి ఆరోగ్యం.. బుధవారం మరింత క్షీణించింది. ఇవాళ సాయంత్రం 5.05 నిమిషాలకు వాజ్ పేయి కన్నుమూసినట్లు ఎయిమ్స్ వైద్యులు ఓ ప్రకటనలో తెలిపారు. వాజ్ పేయికి తెలుగు నేలతో కీలకమైన అనుబంధమే ఉంది. ఒకానోక సందర్భంలో ఆయన టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ పై సెటైర్లు వేశారు.ఎన్టీఆర్ ఏపీ సీఎంగా ఉన్నరోజుల్లో కాంగ్రేసేతర పక్షాలను ఒకతాటి మీదకు తెచ్చేందుకు ప్రయత్నించేవారు. తరచుగా విపక్షాల సదస్సులు ఏర్పాటు చేసేవారు. అలాంటి ఒక సదస్సుకు పలువురు జాతీయ నేతలతోపాటుగా వాజపేయి హాజరయ్యారు. భోజనాల వేళ ఎన్టీఆర్ తనదైన శైలిలో వారందిరికీ బకెట్లో వెన్నతెచ్చి స్వయంగా వడ్డిస్తున్నారు. అప్పుడు వాజపేయి సరదాగా రామారావు సాబ్‌నే హమ్ కో మస్కా లగారహా హై (రామారావుగారు మనకు మస్కా కొడుతున్నారు) అని చెణుకు విసిరితే అంతా నవ్వుల్లో మునిగిపోయారు.వాజపేయి గొప్పవక్త. మాటకారి. చెణుకులు విసరడంలో దిట్ట. ఆయన వేసిన జోకులను కథలుకథలుగా చెప్పుకుంటారు. అలా వాజ్ పేయికి చెందిన ఓ జోకును పలువురు ఇలా గుర్తుచేసుకుంటున్నారు.