Begin typing your search above and press return to search.

ఏకాకి జీవితం.. దేశమే కుటుంబం

By:  Tupaki Desk   |   16 Aug 2018 5:33 PM GMT
ఏకాకి జీవితం.. దేశమే కుటుంబం
X
వార్ధక్యం - అనారోగ్యం కారణంగా కన్నుమూసిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌ పేయి భారతదేశ రాజకీయ చరిత్రలో విలక్షణ నాయకుడు. 1924 డిసెంబర్ 25వ తేదీన గ్వాలియర్‌ లో జన్మించిన ఆయన భారతీయ జనతా పార్టీ నుంచి ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించిన మొట్టమొదటి నేత. దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత రెండోసారి జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన తొలిసారి లోక్‌ సభకు ఎన్నికయ్యారు. ఆ తరువాత మళ్లీ నాలుగో లోక్‌ సభకు ఎన్నికయ్యారు. అప్పటి నుంచి 14వ లోక్‌ సభ ముగిసే వరకు పార్లమెంటుకు ఎన్నికవుతూనే ఉన్నారు. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగానూ పనిచేశారు. నాలుగు దశాబ్దాలకు పైబడి పార్లమెంట్‌ సభ్యుడిగా ఉన్న ఆయన - లోక్‌ సభ సభ్యుడిగా 9 సార్లు - రాజ్యసభ సభ్యుడిగా రెండుసార్లు ఎన్నికయ్యారు.

1968 నుంచి 1973 వరకు జనసంఘ్ పార్టీకి అధ్యక్షుడిగా పని చేశారు. 1980 నుంచి 1986 వరకు బీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నారు. 1996లో తొలిసారి ప్రధాని అయ్యారు. అయితే.. పూర్తి మెజారిటీ లేకుండా ఏర్పడిన ప్రభుత్వం కావడంతో రోజుల వ్యవధిలోనే ఆ్న ప్రభుత్వం కూలిపోయింది. 1998లో రెండోసారి ప్రధాని అయ్యారు. అప్పుడు 13 నెలలు పాలించారు. 1999లో 13వ లోకసభ తర్వాత మూడోసారి ప్రధాని అయ్యారు. పూర్తికాలం 2004 వరకు ప్రధానిగా కొనసాగారు.

2005లో రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించిన ఆయన అనంతరం అనారోగ్య కారణాలతో పూర్తిగా ప్రధాన రాజకీయ స్రవంతికి దూరమయ్యారు. వాజ్ పేయికి 2015లో భారతరత్న ప్రకటించారు. అనారోగ్యంతో మంచంపై ఉన్న వాజ్ పేయికి భారతరత్న ప్రదానం చేసేందుకు అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ స్వయంగా ఆయన నివాసానికి వచ్చారు. ఆయన పుట్టిన రోజు డిసెంబర్ 25 సుపరిపాలనా దినంగా ప్రభుత్వం ప్రకటించింది.

రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో భారతీయ జనసంఘ్‌ సంస్థాపక సభ్యుల్లో ఒకరిగా ఉన్న ఆయన అనంతరం ఆ సంస్థకు అధ్యక్షుడయ్యారు. 1975లో దేశంలో అత్యయిక పరిస్థితిని విధించాక -1977లో అధికార కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా లోక్‌ నాయక్‌ జయప్రకాష్‌ నారాయణ నేతృత్వంలో జాతీయస్థాయిలో ప్రతిపక్షపార్టీలు ఏకమైనపుడు జనసంఘ్‌ ను జనతాపార్టీలో విలీనం చేశారు. ఆ తర్వాత1977లో జరిగిన ఎన్నికల్లో జనతాపార్టీ విజయం సాధించాక - కేంద్రంలో మొరార్జీ దేశాయ్‌ కేబినెట్‌ లో విదేశీవ్యవహారాల మంత్రిత్వశాఖ బాధ్యతలు చేపట్టారు. అదే ఏడాది విదేశాంగ మంత్రి హోదాలో ఐరాస జనరల్‌ అసెంబ్లీలో హిందీలో ప్రసంగించిన తొలి వ్యక్తిగా నిలిచారు. 1979లో జనతాపార్టీ ప్రభుత్వం పతనమైన తరువాత ఆ పార్టీలో లుకలుకలు తీవ్రమయ్యాయి. ఆ మరుసటి ఏడాదే ఎల్‌కే అద్వానీ - భైరవ్‌ సింగ్‌ షెకావత్‌ తో కలిసి జనసంఘ్ - ఆరెస్సెస్‌ లలోని పలువురు ఇతర నేతలతో కలిసి భారతీయ జనతాపార్టీని స్థాపించారు.

ఇందిరాగాంధీ హత్యానంతరం 1984 చివర్లో జరిగిన లోక్‌ సభ ఎన్నికల్లో బీజేపీ కేవలం రెండు సీట్లకే పరిమితమైంది. ఆ తర్వాత కాలంలో విశ్వహిందూ పరిషత్ - ఆరెస్సెస్‌ ల ఆధ్వర్యంలో నడిచిన రామజన్మభూమి ఉద్యమానికి బీజేపీ రాజకీయగొంతుగా మారింది. 1994లో కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ప్రభావం చూపింది. ఆ వెంటనే 1995లో గుజరాత్ - మహారాష్ట్ర ఎన్నికల్లో గెలుపొందాక జాతీయ రాజకీయాల్లో పుంజుకుంది. 1995 నవంబర్‌ లో ముంబైలో జరిగిన బీజేపీ మహాసభల్లో వాజ్‌ పేయి దేశ ప్రధాని అవుతారంటూ అద్వానీ ప్రకటించారు.

ప్రధానిగా..

1996 మే లోక్‌ సభ ఎన్నికల్లో వాజ్‌ పేయి నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చినా బలనిరూపణలో విఫలం కావడంతో ఆయన ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. 1998లో మళ్లీ ప్రధానై 13 నెలలు అధికారంలో ఉన్నారు. 1999లో ప్రధని అయి అయిదేళ్ల పూర్తికాలం ఆ సీట్ లో ఉన్నారు. 1998-2004 మధ్యకాలంలో ప్రధానిగా ఉన్నపుడు విదేశాంగ విధానంపై వాజ్‌ పేయి తనదైన ముద్ర వేశారు. ఈ కాలంలో ప్రధానంగా పోఖ్రాన్‌2 అణుపరీక్షలు - పాకిస్తాన్‌ తో స్నేహసం‍బంధాల పునరుద్ధరణకు గట్టి ప్రయత్నాలు - చొరవతో పాటు 1999లో లాహోర్‌ డిక్లరేషన్‌ ను రూపొందించడంలోనూ తన ప్రభావాన్ని చూపారు. పోఖ్రాన్‌ అణుపరీక్షల నేపథ్యంలో పాకిస్తాన్‌ కూడా పరీక్షలు జరపడంతో దక్షిణాసియాలో ఉద్రిక్తతలకు దారితీసింది. భారత్‌ వైఖరిని పశ్చిమదేశాలు ఖండించడంతో పాటు వివిధ రూపాల్లో ఆర్థిక ఆంక్షలు కూడా విధించారు. దీంతో అమెరికా ఇతర ఆర్థికసంస్థల నుంచి అందే ఆర్థికసహాయం కూడా నిలిచిపోయింది. సైనిక ఉత్పత్తులు కొనుగోలు చేయకుండా కఠినమైన ఆంక్షలు అమలయ్యాయి. పాక్‌ తో పాటు అమెరికాతో కూడా బంధాన్ని పెంచుకునే ప్రయత్నాలు 1998లో మొదలయ్యాయి. ఈ కారణంగా రెండుదేశాల మధ్య మూడేళ్లపాటు ద్వైపాక్షిక చర్చలకు ఆస్కారం ఏర్పడింది. ఇరుదేశాల మధ్య సాధారణ సంబంధాలు ఏర్పడేందుకు ఇవి దోహదపడ్డాయి. అమెరికా ప్రోద్భలంతో భారత పాక్‌ లమధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు చర్యలు పునః ప్రారంభమయ్యాయి. వాజ్‌ పేయి చొరవ కారణంగా 1999 ఫిబ్రవరిలో లాహోర్‌ కు బస్సుయాత్రలో వెళ్లి అక్కడ పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ తో లాహోర్‌ ఒప్పందంపై సంతకం చేశారు. రెండుదేశాల మధ్య సత‍్సంబంధాలు నెలకొల్పేందుకు అణ్వాయుధాల పోటీకి దిగరాదని - అణ్వాయుధాల వినియోగాన్ని విడనాడాలని - ఇరుదేశాల మధ్య అన్నిరకాల ఘర్షణలు తగ్గించేందుకు కృషి చేయాలని నిర్ణయించారు. అయితే నవాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వాన్ని పర్వేజ్‌ ముషారఫ్‌ నేతృత్వంలోని సైన్యం కూలదోయడంతో ఈ ఒప్పందం నిష్ప్రయోజనకరంగా మారింది. ఆ తర్వాత కార్గిల్‌ యుద్ధం నేపథ్యంలో ఒప్పందం బుట్టదాఖలైంది.

కార్గిల్ యుద్ధం..

కశ్మీర్‌ లోని కార్గిల్‌ మంచుకొండల్లోకి పాకిస్తాన్‌ బలగాలు చొచ్చుకురావడంతో భారత్‌ పాక్‌ ల మధ్య యుద్ధం వచ్చింది. 1999 జులైలో కార్గిల్‌ నుంచి పాక్‌ దళాలు వెళ్లిపోవడంతో భారత సైన్యం ఆపరేషన్‌ విజయ్‌ లో విజయం సాధించింది. 2003లో చైనాతో సంబంధాలు మెరగయ్యేందుకు, సరిహద్దు సమస్యలపై చర్చించుకునే దిశలో చర్యలు మొదలయ్యాయి. రష్యా అధ‍్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ భారత్‌ లో పర్యటించిన సందర్భంగా రెండుదేశాల మధ్య ఆయుధాల సరఫరా - విమానాల కొనుగోలు - తదితర అంశాలపై సైనిక ఒప్పందాలు కుదిరాయి. ఆ తర్వాతి ఏడాదే వాజ్‌ పేయి రష్యాలో పర్యటించినపుడు ఇరుదేశాల మధ్య వాణిజ్య - భద్రతా - రాజకీయరంగాల్లో సహకారం కోసం ’మాస్కో డిక్లరేషన్‌’ పై సంతకాలు జరిగాయి. 2001 జులైలో భారత్‌ తో సంబంధాల పునరుద్ధరణలో భాగంగా పాక్‌ అధ‍్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ మనదేశాన్ని సందర్శించారు. కశ్మీర్‌ అంశంపై ముషారఫ్‌ మొండిపట్టుదల వల్ల ఆగ్రాలో జరిగిన ఈ భేటీ ఎలాంటి ఫలితం లేకుండా ముగిసింది.

చిన్ననాటి దెబ్బను మర్చిపోని సున్నిత మనస్కుడు

ఒంటరి జీవితాన్ని జీవితాంతం గడిపిన వాజ్‌ పేయ్‌ తాను అయిదో తరగతిలో ఉన్నప్పుడు మాస్టారు కొట్టిన చెంపదెబ్బను తన జీవితంలో చేదు ఘడియగా చెబుతారు. అంత సున్నిత మనస్కుడాయన. తనను ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ రాష్ట్రపతి పిలిచినప్పుడు అత్యంత ఆనందానికి లోనయ్యానని చెబుతారు. పెళ్లి చేసుకోవడానికి సమయం లేకపోవడం వల్లే బ్రహ్మచారిగా ఉండిపోయానని చెప్పే ఆయన జీవితంలో గొప్ప మిత్రులను సంపాదించుకున్నారు. ఎల్‌కే అద్వానీ - భైరాన్‌ సింగ్‌ షెకావత్ - అప్పా ఘటాటే - జశ్వంత్‌ సింగ్ - ముకుంద్‌ మోడీ వంటివారంతా ఆయనకు మంచి మిత్రులు.

జీవితాంతం కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలే నెరపిన వాజ్‌ పేయి తనకు ఇష్టమైన నాయకుడెవరంటే మాత్రం నెహ్రూ పేరు చెబుతారు. అలాగే... శరత్‌ చంద్ర - ప్రేమ్‌ చంద్‌ - హరివంశరాయ్‌ బచన్ - రామనాథ్‌ అవస్థి - డాక్టర్‌ శిమంగల్‌ సింఘ్‌ సుమన్ - సూర్యకాంత్‌ త్రిపాఠీ ‘నిరళ’ - బాలక్రిష్ణ శర్మ నవీన్ - జగన్నాథ్‌ ప్రసాద్‌ మిలండి - ఫియాజ్‌ అహ్మద్‌ ఫియాజ్‌ ల రచనలన్నా ఆయనకు ఇష్టం. భీమ్‌ సేన్‌ జోషి - అమ్‌ జాద్‌ అలీఖాన్ - హరిప్రసాద్‌ చౌరాసియా వాజ్‌ పేయ్‌ మదిమెచ్చిన కళాకారులు. అలాగే లతా మంగేష్కర్‌ పాటలన్నా - ముఖేష్‌ - ఎస్‌ డి బర్మన్‌ అన్నా చెవికోసుకునేవాడట. దేవదాస్ - బాంధినీ - తీస్‌ రీ కసమ్ - మౌసమ్ - ఆంధీ - ‘‘బ్రిడ్జి ఓవర్‌ ద రివర్‌ క్వై’’ - ‘‘బార్న్‌ ఫ్రీ’’ - ‘‘గాంధీ’’ సినిమాలు ఆయనకు ఇష్టం.