Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ పై అసంతృప్తి..మొద‌టి వికెట్ ప‌డింది

By:  Tupaki Desk   |   20 Sep 2018 7:46 AM GMT
కేసీఆర్‌ పై అసంతృప్తి..మొద‌టి వికెట్ ప‌డింది
X
విజ‌యంపై ధీమాతో...ప్ర‌తిప‌క్షాల‌ను ఎద‌గ‌నీయ‌కుండా చేయాల‌నే ఎత్తుగ‌డ‌తో ముంద‌స్తు ఎన్నిక‌ల ఎత్తుగ‌డ‌ను కేసీఆర్ అమల్లో పెట్టిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ ఎపిసోడ్‌ పై అనూహ్య ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. ముంద‌స్తుకు సిద్ధ‌మైన కేసీఆర్ ముందుగా ప్ర‌క‌టించిన‌ట్లే...ఎన్నిక‌ల టికెట్ల‌ను సిట్టింగ్‌ల‌కే కేటాయించిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఈ ప‌రిణామంపై ఇప్ప‌టికే అసంతృప్తులు రాజుకుంటుండ‌గా తాజాగా మ‌రో క‌ల‌కలం రేగింది. తెలంగాణ రాష్ట్ర సమితికి మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ గుడ్‌ చెప్పారు.ఖానపూర్ ఎమ్మెల్యే సీటు ఆశించి భంగపడిన ఆయ‌న గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌ లో చేరుతున్నారు.

టీడీపీలో ఉన్న సమయంలో ఆదిలాబాద్ జిల్లాలో రమేష్ రాథోడ్ హవా నడిచింది. మారిన రాజకీయ పరిణామాలు ఆయనకు అనుకూలంగా లేకపోవడంతో టీఆర్ ఎస్‌ లో చేరారు. తెలుగుదేశం పార్టీలో ఎంపీగా పనిచేసిన రాథోడ్ ర‌మేశ్ ఏడాదిన్నర క్రితం టీడీపీ నుంచి టీఆర్ ఎస్‌ లో చేరారు.అప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రేఖానాయక్‌ కు రమేష్‌ కు మధ్య రాజకీయ వైరం ఉంది. దీనికి తోడుగా ఎమ్మెల్యే టికెట్ ద‌క్క‌క‌పోవ‌డంతో ఆయ‌న మ‌న‌స్తాపానికి గుర‌య్యారు. కేసీఆర్‌ టికెట్ ఇవ్వకపోవడంతో టీఆర్ఎస్‌కు గడ్‌ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. హైదారాబాద్‌ లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా - పార్టీ సీనియ‌ర్ నేత గులాంన‌బీ ఆజాద్‌ సమక్షంలో రమేష్ రాథోడ్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఖానాపూర్‌ బరిలో దిగే అవకాశం ఉందంటున్నారు.