Begin typing your search above and press return to search.

రాజయ్య కోడలు ఆత్మహత్య చేసుకుందని తేల్చారు

By:  Tupaki Desk   |   27 Nov 2015 4:33 AM GMT
రాజయ్య కోడలు ఆత్మహత్య చేసుకుందని తేల్చారు
X
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ ఎంపీ రాజయ్య కోడలు సారిక.. ఆమె పిల్లల మరణాలపై తాజాగా ఫోరెన్సిక్ ల్యాబ్ తన నివేదికను ఇచ్చింది. రాజయ్య కోడలు.. మనమలది ఆత్మహత్యేనని.. వారివి అనుమానాస్పద మరణాలు కావని పేర్కొంది. వారి మృతదేహాల్ని పరీక్షించటంతో పాటు.. వారింట్లో సేకరించిన ఆహారపదార్థాల్ని పరీక్షించిన పిమ్మట.. అందులో ఎలాంటి విషపదార్థాల ఆనవాళ్లు లేవని తేల్చారు.

రాజయ్య కోడలు సారిక.. మనమలు అభినవ్ (7).. అయాన్(3).. శీయాన్ (3)లు ఊపిరి ఆడకపోవటం వల్లే మృత్యువాత పడినట్లుగా ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చింది. వారు హత్యకు గురైనట్లుగా చెప్పే ఆధారాలు ఏమీ లేవని స్పష్టం చేసింది. వారు బతికి ఉన్నప్పుడే గ్యాస్ లీక్ కారణంగా మరణించినట్లుగా తేల్చారు.

గ్యాస్ లీక్ కారణంగా ఊపిరి ఆడక మరణించినట్లుగా తేల్చారు. సారిక.. ఆమె ముగ్గరు పిల్లల శరీరాలు మంటలు వ్యాపించిన కారణంగానే మరణించినట్లుగా నిర్ధారించారు. నవంబరు 4 ఉదయం వేళ.. మాజీ ఎంపీ రాజయ్య ఇంట్లో నుంచి పొగలు రావటం.. అది చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించటంతో రాజయ్య ఇంటికి చేరుకొని.. మంటలు వ్యాపించిన గదిని బద్ధలు కొట్టటం.. అందులోరాజయ్య కోడలు సారిక.. ముగ్గరు మనమలు అగ్నికి ఆహుతి కావటం అప్పట్లో సంచలనం సృష్టించింది.

అయితే.. రాజయ్య కోడలు.. ఆమె భర్త మధ్య విభేదాలు ఉండటం.. తన అత్తమామలైన రాజయ్య.. ఆయన సతీమణిపై కోడలు ‘‘వేధింపు’’ ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. దీన్ని అనుమానాస్పద మరణాలుగా భావించారు. ఈ సజీవ దహనం మీద తొలుత పలు సందేహాలు వ్యక్తమైనా.. లభించిన ఆధారాలు చూసినప్పుడు.. అవన్నీ ఆత్మహత్య చేసుకున్నట్లు కనిపించాయే తప్పించి.. వారి మరణాలకు అసహజ కారణాలు లేవన్నట్లుగా చెబుతున్నారు. అయితే.. సారిక ఆత్మహత్య చేసుకోవటానికి కారణాలు ఏమిటన్నది తేలాల్సి ఉంది.