Begin typing your search above and press return to search.

సీఎంగారు మ‌ళ్లీ మాట మార్చారు

By:  Tupaki Desk   |   8 Feb 2016 3:35 PM GMT
సీఎంగారు మ‌ళ్లీ మాట మార్చారు
X
రాజ‌కీయ నాయ‌కులంటేనే సంద‌ర్భానికి త‌గిన‌ట్లు, అవ‌స‌రాన్ని అనుస‌రించి మాట‌లు మార్చేవారు. ఈ తీరును చూసి ఆశ్చ‌ర్య‌పోవ‌డం జ‌నాలు మానేసి చాలాకాల‌మైంది. అయితే త‌మ మూల‌ సిద్దాంతాల‌ను కూడా వ‌దిలేసి అడ్డ‌గోలుగా మాట్లాడే నాయ‌కులు ఉండ‌టం, అందులోనూ బాధ్య‌త‌యుత‌మైన ముఖ్య‌మంత్రి స్థానంలో ఉన్న‌వారు ఈ విధంగా వ్య‌వ‌హ‌రించ‌డం వింత‌గా ఉంటుంది. అచ్చూ ఇలాగే మాట్లాడారు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్ ఖట్టర్. భారత్‌ లో నివసించాలంటే ముస్లింలు గోమాంసం తినడాన్ని వ‌దిలిపెట్టాని, అంత‌గా తినాలనుకుంటే ఈ దేశం విడిచి వెళ్లాలంటూ ఖట్టర్ గతంలో హుకుం జారీచేశారు. అ వ్యాఖ్యలు య‌థావిధిగా దుమారాన్ని రేపాయి. అయితే ఇపుడు అందుకు పూర్తి విరుద్ధ‌మైన స్టేట్‌ మెంట్ ఇచ్చారు ఈ సీఎం గారు.

విదేశాల నుంచి వ‌చ్చే అతిథుల ఆహార అల‌వాట్లు భిన్నంగా ఉంటాయ‌ని పేర్కొంటూ త‌మ రాష్ర్టానికి వ‌చ్చి లగ్జరీ హోటళ్లలో ఉండే విదేశీయులకు గో మాంసం స‌ప్లై చేస్తామ‌ని ఖ‌ట్ట‌ర్‌ ఆఫ‌ర్ ఇచ్చారు. ఇందుకోసం ప్రత్యేక లెసైన్స్ విధానాన్ని తీసుకొస్తామని చెప్పారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ సొంత రాష్ట్రమైన‌ గుజరాత్‌ లో ప్రత్యేక అనుమతి కింద విదేశీయులకు మద్యాన్ని అనుమతిస్తున్నప్పుడు తమ రాష్ట్రంలో మాత్రం గోమాంసాన్ని ఎందుకు అనుమతించరాదంటూ ఖట్టర్ వ్యాఖ్యానించారు. గోవులను పవిత్ర జంతువుగా భావించే హిందువుల మనోభావాలు దెబ్బతినేలా, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీని ఇరుకున పెట్టేలా ఖ‌ట్ట‌ర్ కామెంట్ ఉండ‌టంతో ఈయ‌న గారి స్టేట్‌ మెంట్ కాస్త వివాదంగా మారింది. బీజేపీ సిద్దాంతాల‌కు విరుద్ధంగా ఎలా మాట్లాడుతార‌ని నిల‌దీశారు.

దీంతో సీన్ రివ‌ర్స్ అయింద‌ని గ్ర‌హించిన ఖ‌ట్ట‌ర్ సాబ్ త‌న ప్ర‌క‌ట‌న‌కు తానే వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. త‌న‌ ప్రత్యేకాధికారిగా పనిచేస్తున్న జవహర్ యాదవ్‌ తో వివరణ ఇప్పించారు. గో మాంసం స‌ర‌ఫ‌రా చేసే విషయంలో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోలేదని, ఈ అంశాన్ని ప్రభుత్వం అన్ని కోణాల నుంచి పరిశీలించాల్సిన అవసరం ఉందని రాద్దాంతాన్ని తేలిక ప‌ర్చే ప్ర‌య‌త్నం చేశారు.