Begin typing your search above and press return to search.

ఏకే 47 సహా ఆయుధాల అడ్డాగా యూరప్?

By:  Tupaki Desk   |   29 Nov 2015 7:55 AM GMT
ఏకే 47 సహా ఆయుధాల అడ్డాగా యూరప్?
X
ప్రశాంతతకు చిరునామాగా చెప్పుకునే యూరప్ ఈ మధ్యకాలంలో తరచూ వార్తల్లోకి వస్తోంది. తమ దారిన తాము బతికేస్తూ.. చీకు చింతా లేని జీవితాల్ని అనుభవిస్తున్నారన్న పేరున్న యూరప్ లోని పలు దేశాలకు సంబంధించి వస్తున్న కొన్ని వార్తలు ఆశ్చర్యకరంగానూ.. విస్మయాన్ని రేకెత్తించేలా ఉన్నాయి. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో ఈ మధ్య ఇస్లామిక్ తీవ్రవాదులు విరుచుకుపడటం తెలిసిందే. ఈ సందర్భంగా వందకు పైగా అమాయకుల్ని ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు.

ప్రపంచాన్ని కదిలించిన ఈ నరమేధాన్ని కేవలం రూ.5లక్షల రూపాయిలతో పూర్తి చేశారన్న వార్తలు వచ్చాయి. ఉగ్రదాడికి అంత తక్కువ మొత్తంతో నిర్వహించొచ్చా? అన్న చర్చ మొదలైంది. దీనికి ఔను అంటూ పలు ఉదాహరణలు చూపిస్తున్నారు. అలాంటి విశ్లేషణ ఒకటి తాజాగా బయటకు వచ్చింది. యూరప్ లోని పలు దేశాలు అక్రమ ఆయుధాలకు అడ్డాగా మారిందని చెబుతున్నారు. ప్యారిస్ ఉగ్రఘటనల్లో ఒక ఉగ్రవాది వాడిన ఏకే 47 ఇలానే కొనుగోలు చేసినట్లుగా చెబుతున్నారు. కేవలం 500 యూరోలు.. మన రూపాయిల్లో అయితే దగ్గరదగ్గరగా రూ.36వేలు వెచ్చించాలే కానీ.. ఏకే 47 రైఫిల్ లభిస్తుందని చెబుతున్నారు.

అది కూడా యూరప్ కు చెందిన బెల్జియం.. సెర్బియాలలో ఇలాంటి ఆయుధాలు ఎన్నో కుప్పలు.. కుప్పలుగా లభిస్తాయని చెబుతున్నారు. బెల్జియం రాజధాని బస్సెల్స్.. సెర్చియా రాజధాని బెల్ గ్రేడ్ లాంటి నగరాల్లో పిస్తోళ్లు.. ఏకే 47 రైఫిల్స్ తో సహా.. మందుగుండు సామాగ్రి భారీగా దొరుకుతాయని చెబుతున్నారు. అంతేకాదు.. ఆయుధాల్ని వాహనాల్లో లోడ్ చేసి.. మూడో కంటికి తెలీకుండా సరిహద్దులు దాటించేందుకు సురక్షిత వ్యవస్థలు చాలానే ఉన్నాయని చెబుతున్నారు. ఇంతకాలం ఇలాంటి యవ్వారాల మీద పెద్దగా పట్టించుకోని యూరోప్ దేశాలు.. ఇకపై అలానే నిర్లక్ష్యం చేస్తే మాత్రం అందుకు మూల్యం భారీగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.