Begin typing your search above and press return to search.

ఫ్లిప్ కార్ట్ వ‌న్ డే ల‌క్కీ సీఈవో ఎవ‌రంటే..

By:  Tupaki Desk   |   26 April 2017 6:53 AM GMT
ఫ్లిప్ కార్ట్ వ‌న్ డే ల‌క్కీ సీఈవో ఎవ‌రంటే..
X
టీవీ ఛాన‌ల్‌లో ముఖ్య‌మంత్రిని ఇంట‌ర్వ్యూ చేస్తూ.. ఒక స‌వాలుతో ఒక్క‌రోజు ముఖ్య‌మంత్రిగా ఒక జ‌ర్న‌లిస్టు అయ్యే సినిమాటిక్ ఐడియాను అప్పుడెప్పుడో శంక‌ర్ ఆవిష్క‌రించారు. ఆ ఐడియా సినీ ప్రేక్ష‌కుల్ని విప‌రీతంగా ఆక‌ర్షించింది. అప్పుడెప్పుడో వ‌చ్చిన ఆ సినిమా స్ఫూర్తి కావొచ్చు.. లేక‌.. ఇప్ప‌టికే ఇలాంటి ఐడియాల్ని అమ‌లు చేసిన మ‌రికొన్ని కంపెనీల స్ఫూర్తి కావొచ్చు కానీ.. ప్ర‌ముఖ ఈ కామ‌ర్స్ దిగ్గ‌జం ఫ్లిప్ కార్ట్ ఒక్క రోజు సీఈవో కు ఎవ‌రైనా ఉద్యోగినిని ఎంపిక చేయాల‌న్న నిర్ణ‌యం తీసుకోవ‌టం తెలిసిందే.

కంపెనీ ప‌దో వార్షికోత్స‌వం సంద‌ర్భంగా కంపెనీకి సారథ్యం వ‌హించే అవ‌కాశాన్ని ఒక మామూలు ఉద్యోగికి ఇస్తే ఎలా ఉంటుంద‌న్న ఆలోచ‌న చేసింది. సినిమాటిక్ ఐడియాను వెంట‌నే ఇంప్లిమెంటేష‌న్లోకి పెట్టేసింది. ఒక్క‌రోజు సీఈవోగా ఉండేందుకు ఇష్ట‌మైన వారంతా అప్లై చేసుకోవ‌చ్చ‌ని ఉద్యోగుల‌కు ఒక ప్ర‌త్యేక ప్ర‌క‌ట‌న‌లో ప్ర‌క‌టించింది. తామెందుకు సీఈవో కావాల‌నుకుంటున్నారో తెలియ‌జేయాల‌ని పేర్కొంది. అంతేకాదు.. ఒక్క‌రోజు సీఈవోగా ఎంపిక‌య్యే వ్య‌క్తి ఏదో ఆషామాషీకి కాకుండా.. ఒక్క రోజు సీఈవో.. ఆ రోజు జ‌రిగే అన్ని కార్య‌క్ర‌మాల్లోనూ పాల్గొనే అవ‌కాశం ఉండ‌ట‌మే కాదు.. నిర్ణ‌యాలు తీసుకోవ‌చ్చ‌ని కూడా పేర్కొంది.

కంపెనీ ఐడియాకు ఉద్యోగుల నుంచి చ‌క్క‌టి స్పంద‌న ల‌భించింది. సీఈవో ఆఫ్ ద డే ఐడియాకు ఉద్యోగులు పాజిటివ్‌ గా రియాక్ట్ అయ్యారు. చివ‌ర‌కు ఆ ల‌క్కీ ఛాన్స్ 34 ఏళ్ల ప‌ద్మిని ఎంపికైంది. ఫ్లిప్ కార్ట్‌ లో వేర్ హౌస్ ఎగ్జిక్యూటివ్ గా ప‌ని చేస్తున్న ఆమెను మంగ‌ళ‌వారం సంస్థ సీఈవోగా ప‌ద్మిని బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. వాటాదార్ల స‌మావేశాల‌కు హాజ‌రైన ప‌ద్మినికి తోడుగా.. ప్ర‌స్తుత సీఈవో కృష్ణ‌మూర్తి వెంట వెళ్లారు. అయితే.. ఒక్క‌రోజు సీఈవోగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన ప‌ద్మిని కూల్ గా వ‌చ్చిన అవ‌కాశాన్ని ఎంజాయ్ చేశారే కానీ.. సంచ‌ల‌న‌నిర్ణ‌యాల్ని తీసుకోక‌పోవ‌టం గ‌మ‌నార్హం. త‌న‌కు ల‌భించిన ఒక్క‌రోజు సీఈవో అవ‌కాశంతో తాను ఎంతో నేర్చుకున్న‌ట్లుగా ప‌ద్మిని వెల్ల‌డించింది. ఏమైనా.. ఈ కార్య‌క్ర‌మం పుణ్యామా అని ప‌ద్మినికి.. ప్రాంతీయ‌.. జాతీయ మీడియాలో విశేష ప్రాధాన్య‌త ల‌భించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/