Begin typing your search above and press return to search.

సెల్ఫీ సరదాకు ఐదుగురు బలి..

By:  Tupaki Desk   |   8 Oct 2019 7:37 AM GMT
సెల్ఫీ సరదాకు ఐదుగురు బలి..
X
సెల్పీ సరదా ప్రమాదాలకు కారణంగా మారటమే కాదు పెద్ద ఎత్తున ప్రాణాలు పోయేలా చేస్తోంది. కర్ణాటకలో చోటు చేసుకున్న తాజా ఉదంతంలో సెల్ఫీ సరదాకు ఏకంగా ఐదుగురు మరణించటం సంచలనంగా మారింది. సెల్ఫీ సరదాకు ప్రమాదం పొంచి ఉందన్న విషయాన్ని మర్చిపోతే.. ఎంతటి విషాదం కమ్మేస్తుందో తెలిపే ఉదంతంగా దీన్ని చెప్పాలి. ఈ ఘోర విషాదంలోకి వెళితే..

కర్ణాటకలోని క్రిష్ణగిరి జిల్లా బర్గూరుకు చెందిన 20ఏళ్ల నివేదకు అదే ప్రాంతానికి చెందిన పెరుమాళ్ స్వామికి గత నెల 12న పెళ్లైంది. కొత్తగా పెళ్లైన జంటకు దగ్గర బంధువులు భోజనాలకు పిలవటం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా తమకు బంధువులైన ఇళంగోవన్ ఇంటికి వెళ్లారు. వారిది ఊత్తంగేరి దగ్గరున్న ఒట్టపట్టి.

భోజనాలు అయ్యాక కొత్త దంపతులతో పాటు.. ఇంగోవన్ ఇద్దరు కుమార్తెలు (19 ఏళ్ల స్నేమ.. 18 ఏళ్ల కనికా).. కొడుకు (14 ఏళ్ల సంతోష్)తో పాటు వారి బంధువుల అమ్మాయి 20 ఏళ్ల యువరాణి కలిసి సినిమాకు వెళ్లారు. సినిమా అయ్యాక.. ఇంటికి తిరిగి వచ్చే క్రమంలో దగ్గర్లోని పాలారు నదీ అందాల్ని చూసేందుకు వెళ్లారు.

గడిచిన కొద్దిరోజులగా కురుస్తున్న వర్షాలతో క్రిష్ణగిరి జిల్లా పరిధిలోని చెరువులు.. కుంటల్లో భారీగా నీరు చేరింది. దీనికి వరద నీరు తోడు కావటంతో నదిలో నీరు పెద్ద ఎత్తున ఉన్నాయి. జోరుగా పారుతున్న నీటిని చూసినంతనే అంతా కలిసి సెల్ఫీ తీసుకోవాలని భావించారు. ఉత్సాహంతో ఉన్న వారు ముంచుకొస్తున్న ప్రమాదాన్ని గుర్తించలేదు. సెల్ఫీ సరదాలో అందర్లోకి చిన్నోడైన సంతోష్ కాలు జారి నదిలో పడ్డాడు. కొట్టుకుపోతున్న తమ్ముడ్ని రక్షించేందుకు ఇద్దరు అక్కలు నదిలోకి దిగారు. వారికి సాయంగా నూతన వధువు నివేధ.. బంధువుల అమ్మాయి యువరాణి కూడా నదిలోకి దిగింది. అయితే.. వీరెవరికి ఈత రాదు.

ముంచుకొచ్చిన ప్రమాదాన్ని గుర్తించిన పెరుమాళ్ స్వామి నదిలోకి దూకి రక్షించే ప్రయత్నం చేశారు. అయితే.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బంధువుల అమ్మాయి యువరాణి మినహా మరెవరినీ రక్షించలేకపోయాడు. మిగిలిన వారంతా నదిలో కొట్టుకు పోయారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న స్థానికులు వెంటనే రంగంలోకి దిగారు. అయితే.. అప్పటికే ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. సెల్ఫీ సరదాకు ఏకంగా ఐదుగురు బలి కావటం సంచలనంగా మారింది. సెల్ఫీ సరదా తప్పుగా చెప్పటం లేదు. కానీ.. ఈ ఉత్సాహంలో ముంచుకొచ్చే ప్రమాదాన్ని అంచనా వేయాల్సిన అవసరం ఉందన్నది మర్చిపోకూడదు.