చంద్రుడిపై శోధనకు తెలంగాణ విద్యార్థులు

Thu Oct 12 2017 17:46:04 GMT+0530 (IST)

అంతుచిక్కని రహస్యాలనెన్నో దాచుకున్న చంద్రుడిపై అడుగు పెట్టేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా మరోసారి సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. రోదసిలో మరో కీలకమైన విజయాన్ని సాధించి విశ్వంపై ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో తెలంగాణ విద్యార్థులు భాగస్వామ్యం కాబోతున్నారు. చంద్రుడి ఉపరితలంపై మానవులు ప్రయాణించేలా ఒక నమూనా రోవర్ రూపకల్పన చేయబోతున్నారు. ప్రపంచంలోని మొత్తం 23 దేశాల నుంచి విద్యార్థులు పోటీ పడ్డారు. ఇందులో దేశం తరఫున నాలుగు బృందాలను ఎంపిక చేశారు.  వీరిలో ఐదుగురు తెలంగాణ విద్యార్థులతో కూడిన బృందం కూడా ఉండటం విశేషం!ఈ బృందంలో పి.పాల్ వినీత్ - ప్రకాశ్ రేయినేని - పి.శ్రావణ్ రావ్ - రొండ్ల దిలీప్ రెడ్డి - ఆనంద్ వేణిశెట్టి స్నేహ ఉన్నారు. వీరు వరంగల్ లోని ఎస్ ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్నారు. ఈ బృందానికి కాలేజీ ఉపాధ్యాయుడు మనోజ్ చౌదరి నాయకత్వం వహించబోతున్నారు. చంద్రుడిపై నడయాడే రోవర్ డిజైన్ రూపకల్పన కోసం నాసా  హ్యూమన్ ఎక్స్ ప్లొరేషన్ రోవర్ చాలెంజ్ ను ప్రపంచవ్యాప్తంగా నిర్వహించింది. కొన్ని నమూనాలను ప్రపంచవ్యాప్తంగా ఆహ్వానించింది.

వీటన్నింటినీ పరిశీలించిన నాసా శాస్త్రవేత్తలు కొన్నింటిని ఎంపిక చేశారు. ఇందులో తమ కాలేజీ నమూనా కూడా ఉందని కాలేజ్ సెక్రటరీ ఎ.మధుకర్ రెడ్డి తెలిపారు. ఇది విద్యార్థులకు అపూర్వ అవకాశమని ఆయన అభిప్రాయపడ్డారు. వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా రోవర్ రూపొందించడం సవాల్‌తో కూడుకున్నదని అన్నారు. ఈ విద్యార్థులంతా అమెరికాలోని అలబామాలో వచ్చే ఏడాది ఏప్రిల్‌లో 12 నుంచి 14 వరకూ జరిగే ఐదో ప్రపంచ పోటీలో పాల్గొంటారని వివరించారు.