Begin typing your search above and press return to search.

మ‌ట్టిక‌రిచిన బీజేపీ..కాంగ్రెస్‌ దూకుడు..

By:  Tupaki Desk   |   11 Dec 2018 5:35 PM GMT
మ‌ట్టిక‌రిచిన బీజేపీ..కాంగ్రెస్‌ దూకుడు..
X
పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు ముందు సెమీఫైన‌ల్‌ గా భావించిన ఐదు రాష్ర్టాల ఎన్నిక‌ల ఫ‌లితం ఘ‌ట్టం పూర్త‌యింది. ఈ ఫ‌లితాల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీకి చావు దెబ్బ త‌గిలింది. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో ఆ పార్టీ దారుణంగా ఓడిపోయింది. 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ - చ‌త్తీస్‌ గ‌ఢ్‌ తోపాటు రాజ‌స్థాన్ ఎన్నిక‌ల్లో కూడా క‌మ‌లానికి ఓట‌మి త‌ప్ప‌లేదు. తెలంగాణ‌లో అయితే ఒకే ఒక్క స్థానంతో స‌రిపెట్టుకోగా.. అటు ఈశాన్య రాష్ట్రం మిజోరంలోనూ అదే ప‌రిస్థితి ఎదురైంది. చ‌త్తీస్‌ గ‌ఢ్‌ లో కాంగ్రెస్ క్లీన్‌ స్వీప్ చేయ‌గా.. రాజ‌స్థాన్‌ లోనూ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌గ‌లిగే మెజార్టీని సాధించింది. అటు మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ లో మాత్రం రెండు పార్టీల మ‌ధ్య హోరాహోరీ పోరాటం జ‌రిగినా.. చివ‌రికి కాంగ్రెసే పైచేయి సాధించింది. మూడుసార్లు చ‌త్తీస్‌ గ‌ఢ్‌ లో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చిన సీఎం ర‌మ‌ణ్‌ సింగ్ కూడా కిందామీదా ప‌డి గెలిచే పరిస్థితి ఎదురైంది. ఆ రాష్ట్రంలో బీజేపీ కేవ‌లం 17 స్థానాల‌తో సరిపెట్టుకుంది. అటు రాజ‌స్థాన్‌ లో 72 స్థానాల్లో గెల‌వ‌గా.. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ లో మూడంకెల స్కోరును అందుకుంది. వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌బోయే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు సెమీఫైన‌ల్స్‌ గా భావించిన ఈ ఎన్నిక‌ల్లో బీజేపీ ఓడిపోవ‌డం మోదీ ప్ర‌తిష్ఠ‌ను దిగ‌జార్చేదే. పైగా గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీకి బంప‌ర్ మెజార్టీ రావ‌డంలో ఈ మూడు రాష్ట్రాలే కీల‌కపాత్ర పోషించాయి. ఇప్పుడు వాటిలో ఓట‌మి క‌చ్చితంగా 2019 ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూప‌నుంది.

కాగా, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ ఫ‌లితాల‌పై ఆస‌క్తిక‌ర రీతిలో స్పందించారు. ఇకపై ప్రధానికి ఎన్నికలు గెలవడం కష్ట సాధ్యంగా మారనుందని ప్రజలు స్పష్టమైన సందేశం ఇచ్చారని అన్నారు. ప్రధాని మోడీ - బీజేపీకి దేశప్రజలు వారికి స్పష్టమైన సందేశం ఇచ్చారన్నారు. ప్రభుత్వం తానిచ్చిన వాగ్దానాలను నెరవేర్చకపోవడాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారని తెలిపారు. ప్రధాని మోడీ ప్రతిపక్షాల నుంచి ఒత్తిడిని ఎదుర్కోలేక చేష్టలు చచ్చుబడి వాగ్దానాలను నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారని విమర్శించారు. యువతకు ఉపాధి కల్పిస్తామని ప్రధాని ఇచ్చిన హామీ నెరవేర్చలేదన్నారు. యువత భవిష్యత్తుపై ఆందోళన నెలకొందని.. లక్షలాది మందికి ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఏం ప్రణాళికలు సిద్ధం చేసిందని ప్రశ్నించారు.

దేశంలో ఉపాధి - రైతులే కీలకమైన అంశాలని రాహుల్ గాంధీ చెప్పారు. ఇది ఒక్క మధ్యప్రదేశ్ కి మాత్రమే పరిమితం కాదని - దేశమంతటా విస్తరించి ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ ఏకమై పోరాడతాయని స్పష్టం చేశారు. ప్రజలకు ఈవీఎంలతో అసౌకర్యంగా ఉంటే దానిని పరిష్కరించాల్సిందేనని అభిప్రాయపడ్డారు. తాము బీజేపీ ఆలోచనా విధానంతో పోరాడి ఓడిస్తాం తప్ప వారిని తుడిచిపెట్టబోమని చెప్పారు. పెద్దనోట్ల రద్దు - రాఫెల్ డీల్ కచ్చితంగా కుంభకోణాలేనని.. వాటిలో అవినీతి జరిగిందని తెలిపారు.

‘మాపై ఎంతో బాధ్యత ఉంది - మార్పుకి ఇదే సమయం’ అని రాహుల్ అన్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘన విజయం రైతులది - చిరు వ్యాపారులది - కాంగ్రెస్ కార్యకర్తలదేనని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ కి ఇంతటి విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు - కాంగ్రెస్ వర్కర్లకు ఆయన అభినందనలు తెలిపారు. గతంలో రాష్ట్రాల శాసనసభలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడినా - గెలిచినా వెన్నంటి ఉన్నవారందరికీ రాహుల్ ధన్యవాదాలు చెప్పారు. ఇప్పుడు ఓడిన రాష్ట్రాలకు ముఖ్యమంత్రి పదవిలో ఉండి వారు చేసిన పనులకు ఆయన కృతఙ్ఞతలు తెలిపారు.

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ లో నరాలు తెగే ఉత్కంఠ కొనసాగుతున్నది. బీజేపీ - కాంగ్రెస్‌ ల మధ్య విజయం దోబూచులాడుతున్నది. రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతున్నది. ప్రతి రౌండు లెక్కింపులో ఫలితాలు తారుమారు అవుతున్నాయి. ఒక్కో రౌండులో ఒక్కో పార్టీ ఆధిక్యం దిశగా దూసుకుపోతున్నాయి. రాష్ట్రంలో హంగ్‌ ఏర్పడే దిశగా ఫలితాలు వెలువడుతున్నాయి. తుది ఫలితాలు వెల్లడించే సమయానికి కాంగ్రెస్‌ 111 స్థానాల్లో ముందంజలో ఉంది. బీజేపీ అభ్యర్థులు 108 స్థానాల్లో విజయం దిశగా సాగుతున్నారు. బీఎస్పీ సైతం తన ఉనికిని చాటింది. ఐదు స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 116 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ బుద్ని నియోజకవర్గంలో మెజార్టీ దిశగా దూసుకుపోతున్నారు. నాలుగోసారి గెలిచి అధికార పీఠం అధిష్టించాలన్న ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఆశలు నెరవేరే పరిస్థితులు కనిపించడం లేదు. గత ఎన్నికల్లో బీజేపీ 165 స్థానాల్లో విజయం సాధించగా - కాంగ్రెస్‌ 58 చోట్ల గెలిచింది.

ఛత్తీస్‌ గఢ్‌ లో కాంగ్రెస్‌ పాగా

రాయ్‌ పూర్‌: ఛత్తీస్‌ గఢ్‌ లో హంగ్‌ వచ్చే అవకాశాలున్నాయన్న ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు తలకిందులయ్యాయి. మంగళవారం ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్‌ దూసుకుపోతున్నది. మొత్తం 90 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ 67 చోట్ల ఆధిక్యంలో ఉన్నది. ఇక అధికార బీజేపీ ఓటమి దిశగా పయనిస్తున్నది. ఇప్పటి వరకు జరిగిన ఓట్ల లెక్కింపులో ఆ పార్టీ 16 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉన్నది. హంగ్‌ వస్తే కింగ్‌ మేకర్‌ తానేనని భావించిన జనతా కాంగ్రెస్‌ ఛత్తీస్‌ గఢ్‌(జే) అధ్యక్షుడు - మాజీ సీఎం అజిత్‌జోగి ఎన్నికల్లో అంతగా ప్రభావం చూపలేకపోయారు. ఆయన పార్టీ రెండు స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతున్నది. అజిత్‌ జోగి - ఆయన భార్య రేణు జోగి మాత్రమే గెలుపు దిశగా పయనిస్తున్నారు. మొత్తానికి ఛత్తీస్‌ గఢ్‌ లో బీజేపీ 15 ఏండ్ల పాలనకు తెరపడే దిశగా ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. మరోవైపు అధికార బీజేపీకి చెందిన ఐదుగురు మంత్రులు వెనుకంజలో ఉన్నారు. బ్రిజ్‌ మోహన్‌ అగర్వాల్‌(రాయ్‌ పూర్‌ సిటీ సౌత్‌) - కేదర్‌ కశ్యప్‌(నారాయణ్‌ పూర్‌) - మహేశ్‌ గాగ్ద(బీజాపూర్‌) - దయాల్‌ దాస్‌ బాఘెల్‌(నవాగఢ్‌) - అమర్‌ అగర్వాల్‌(బిలాస్‌ పూర్‌) ఓటమి దిశగా పయనిస్తున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దరమ్‌ లాల్‌ కౌశిక్‌ - కాంగ్రెస్‌ అధ్యక్షుడు భూపేశ్‌ బాఘెల్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రతిపక్ష నాయకుడు టీఎస్‌ సింగ్‌ దేవ్‌ - ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ ఎంపీ తమ్రద్వాజ్‌ సౌ కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఎన్నికల ఫలితాలపై అజిత్‌ జోగి స్పందిస్తూ ‘నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే.. 15 ఏండ్ల బీజేపీ పాలనకు ప్రజలు చరమగీతం పాడుతున్నారు. కాంగ్రెస్‌ అధికారం చేపట్టబోతున్నది’ అని తెలిపారు. అజిత్‌జోగి జనతా కాంగ్రెస్‌ ఛత్తీస్‌ గఢ్‌(జే) పార్టీని స్థాపించక ముందు కాంగ్రెస్‌ లో ఉన్నారు.

జైపూర్ః మొత్తం 200 స్థానాలున్న రాజ‌స్థాన్‌లో అయితే 199 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. ఆ రాష్ట్రంలో మేజిక్ ఫిగర్ కు కావాల్సింది 100 సీట్లు. ప్రస్తుతం కాంగ్రెస్ 99 స్థానాలు గెలుకుంది. బీజేపీ 73 సీట్లకే పరిమితమైంది. బీఎస్పీ 6 స్థానాలు కైవసం చేసుకోగా... ఇతరులు 20 నియోజక వర్గాల్లో విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజారిటీ సాధించింది. ఇప్పటికే సచిన్ పైలట్ సుమారు 10 మంది ఇండిపెండెన్స్ తో సంప్రదింపులు జరిపారని సమాచారం. రేపు జైపూర్ లో కాంగ్రెస్ లెజస్లేచర్ పార్టీ సమావేశం జరుగనుంది. అందులో సీఎం అభ్యర్థిని ఎన్నుకునే అవకాశం ఉంది. గత 25 ఏళ్లుగా అధికారం మారే సంప్రదాయం రాజస్థాన్‌ లో కొనసాగుతుండగా.. అదే ట్రెండ్‌ మరోసారి కనిపించింది. అధికారం ఖాయమవడంతో సీఎం పదవి ఎవరిని వరిస్తుందనే విషయంపై చర్చ మొదలైంది. సీఎం పదవి రేపులో అశోక్‌ గెహ్లాట్ - సచిన్‌ పైలెట్ ముందంజలో ఉన్నారు.

మిజోరాంఃఈశాన్యలో ఎమ్ ఎన్ ఎఫ్ మెరిసింది. కాంగ్రెస్ కు ఉన్న మరో రాష్ట్రం చేజారింది. దీంతో ఇక్కడ పదేళ్ల కాంగ్రెస్‌ పాలనకు తెరపడింది. ప్రతిపక్ష మిజో నేషనల్‌ ఫ్రంట్(ఎంఎన్ ఎఫ్‌)‌ స్పష్టమైన మెజార్టీతో విజయం దిశగా కనబరచింది. మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న ఆ రాష్ట్రంలో ఎన్ ఎంఎఫ్-26 స్థానాలు దక్కించుకుంది. దీంతో ఆ పార్టీ త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఎంఎన్ ఎఫ్‌ అధినేత జోరంతాంగా ముఖ్యమంత్రి పీఠం ఎక్కబోతున్నారు. ఇక్కడ ప్రతి రెండు దఫాల తర్వాత అధికారం చేతులు మారుతూ వస్తోంది. 1987లో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కాంగ్రెస్‌ - మిజో నేషనల్‌ ఫ్రంట్‌ ల మధ్య అధికార మార్పిడి జరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉన్నట్లు తేలిపోయింది. ప్రస్తుత ఫలితాల్లో ఎంఎన్ ఎఫ్-26 గెలుచుకోగా... కాంగ్రెస్-5 స్థానాలకే పరిమితం అయ్యింది. బీజేపీ -1 నియోజకవర్గంలో విజయం సాధించింది. ఇతరులు-8 స్థానాలను కైవసం చేసుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 34చోట్ల - ఎంఎన్ ఎఫ్‌ 5 స్థానాల్లో గెలుపొందాయి. ఈసారి ఫలితాలు తారుమారు అయ్యాయి. మిజో నేషనల్‌ ఫ్రంట్‌ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం చేస్తామని హామీ ఇచ్చింది. అటు ప్రభుత్వ వ్యతిరేకత - ఇటు ఎంఎన్ ఎఫ్‌ హామీల నేపథ్యంలో మిజోరం ఓటర్లు ఎంఎన్‌ ఎఫ్‌ కే పట్టం కట్టారు.