మోడీకి రివర్స్ పంచ్ ఇస్తున్న ఐదుగురు సీఎంలు

Sun Mar 19 2017 10:49:20 GMT+0530 (IST)

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రకటించిన పంటరుణాల మాఫీ అటు తిరిగి ఇటు తిరిగి ఆయన మెడకే చుట్టుకునేటట్లు కనిపిస్తోంది. ఎందుకంటే అన్నదాతల పంట రుణాల రద్దు అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా రగులుకుంటోంది. దుర్భిక్షం - అకాల వర్షాలు వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా అన్నదాతలు అప్పులు చెల్లించలేని స్థితిలో పడిపోయారు. ఈ నేపథ్యంలో పంట రుణాలను రద్దుచేయాలని పలురాష్ర్టాలు ఎప్పటినుంచో కేంద్రాన్ని కోరుతున్నాయి. రైతుల పంట రుణాల అంశం మహారాష్ట్రతోపాటు కర్ణాటక - తమిళనాడు - తెలంగాణ - ఏపీ - బెంగాల్ తదితర రాష్ర్టాలను కలవరపరుస్తోంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పదే పదే విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ కేంద్రం సానుకూలంగా స్పందించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.తాజాగా ఉత్తరప్రదేశ్ లో రైతుల పంట రుణాల రద్దు ఉదంతం ఈ వివాదాన్ని మళ్ళీ రాజేసినట్లయింది. దానిని ఆధారంగా చేసుకుని పలు రాష్ర్టాలు గళమెత్తుతున్నాయి. మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం కూడా ఈ జాబితాలో చేరడం గమనార్హం. సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ నేతృత్వంలో కేంద్ర మంత్రి సుభాష్ భామ్రే - రాష్ట్ర సీనియర్ మంత్రులు మిత్రపక్షమైన శివసేన నేతలు ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ - వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్ సింగ్ లను కలిసి రుణాల భారాన్ని మొత్తం కేంద్రమే భరించాలని కోరారు. ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని మోడీ పంట రుణాల హామీనివ్వడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన వివిధ పార్టీలు ఇప్పుడు అదే విధానాన్ని అంతటా అమలుపరుచాలని డిమాండ్ చేస్తున్నాయి. రైతుల దుస్థితిని ఆత్మహత్యలను నిరోధించేందుకు కేంద్రం ముందుకు రావాలని కోరుతున్నాయి. పార్లమెంటులోనూ వివిధ రాష్ర్టాల్లోనూ ఈ డిమాండ్ ఊపందుకుంటున్నది.

ఇదిలాఉండగా...రైతుల పంట రుణాల రద్దు హామీ కేవలం ఉత్తరప్రదేశ్ కు మాత్రమే సంబంధించినదని అది బీజేపీ వాగ్దానమే తప్ప కేంద్ర ప్రభుత్వ జాతీయ విధానం కాదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. తమ రాష్ర్టాల్లోనూ పంట రుణాలను రద్దుచేయాలంటూ వస్తున్న డిమాండ్లను ప్రస్తావిస్తూ- రాష్ర్టాలు తమ స్వేచ్ఛానుసారం వ్యవహరించవచ్చు. అది (రుణాల రద్దు) ఆయా రాష్ర్టాల వనరులు ఆర్థిక సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ లో రైతుల పంట రుణాల రద్దు అనేది నిర్దిష్టంగా ఆ రాష్ర్టానికే సంబంధించిన హామీ. ఎన్నికల ప్రచారం సందర్భంగా బీజేపీ నాయకత్వం ఆ హామీనిచ్చింది. ప్రభుత్వం ఏర్పడగానే ఆ విషయంలో కచ్చితంగా సానుకూలంగానే వ్యవహరించి అమలుపరిచేందుకు ప్రయత్నిస్తారు. ఇది ప్రభుత్వ జాతీయ విధానం కాదు.. నిర్దిష్టంగా ఆ రాష్ర్టానికి మాత్రమే సంబంధించింది అని ఆయన చెప్పారు. కేంద్రం వివక్షతో వ్యవహరిస్తున్నదన్న ఆరోపణలు సరికాదని వెంకయ్యనాయుడు అన్నారు. ఇందులో ఉత్తర దక్షిణ అంశాలేం లేవు అని సినీనటుడు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/