Begin typing your search above and press return to search.

రికార్డు స్థాయిలో క్షీణిస్తున్న రూపాయి!

By:  Tupaki Desk   |   16 Aug 2018 6:52 AM GMT
రికార్డు స్థాయిలో క్షీణిస్తున్న రూపాయి!
X
మా మోడీ వ‌చ్చి ప్ర‌ధాన‌మంత్రి కుర్చీలో కూర్చుంటే చాలు.. స‌మ‌స్య‌ల్ని చ‌టుక్కున ప‌రిష్కారం కావ‌ట‌మే కాదు.. పురాణాల్లో చ‌దివిన రామ‌రాజ్యం దిశ‌గా అడుగులు వేయ‌టం ఖాయ‌మంటూ సోష‌ల్ మీడియాలో పోస్టుల మీద పోస్టులు పెట్టేటోళ్లు బోలెడంత మంది క‌నిపిస్తారు. అంతేకానీ.. వాస్త‌వ ప‌రిస్థితిని అస్స‌లు ప‌ట్టించుకోరు.

దుర‌దృష్ట‌క‌ర‌మైన విష‌యం ఏమంటే.. అయితే గాంధీ ఫ్యామిలీ లేదంటే.. మోడీ వైపే త‌ప్పించి.. ఇద్ద‌రిలో ఎవ‌రైనా కావొచ్చు.. దేశానికి.. దేశ ప్ర‌జ‌ల‌కు మంచి చేసిన‌ప్పుడు నెత్తిన పెట్టుకోవ‌టం.. తేడా చేస్తే.. తీసి ఆవ‌త‌ల ప‌డేయ‌టం లాంటి మైండ్ సెట్ అస్స‌లు క‌నిపించ‌దు.

న‌మ్మినోళ్ల‌ను.. అభిమానం ఉన్న వారి ప‌ట్ల అదే ప‌నిగా నెత్తికి ఎక్కించుకోవ‌టం కంటే.. సాపేక్షంగా ఉండ‌టం చాలా ముఖ్యం. మోడీ నాలుగున్నరేళ్ల పాల‌న‌పై గొప్ప‌లు చెప్పుకునే వారంతా రాఫెల్ ఇష్యూ గురించి.. రూపాయి క్షీణ‌త గురించి మాట్లాడ‌రు. పంద్రాగ‌స్టు వేళ ఎర్ర‌కోట నుంచి 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ప్ర‌ధాని హోదాలో ఉన్న మోడీ త‌న ప్ర‌సంగంతో షురూ చేశార‌ని చెప్పాలి.

త‌న హ‌యాంలో అంత‌కంత‌కూ క్షీణిస్తున్న రూపాయికి స్వ‌స్థ‌త చేసే అంశం మీద కానీ.. రూపాయిని ఫ‌లాని స‌మ‌యానికి సెట్ చేస్తామ‌న్న మాట అస్స‌లు వినిపించ‌దు స‌రికదా.. ఆ ద‌గ్గ‌ర‌కు కూడా ఆ చ‌ర్చ రాని ప‌రిస్థితి. ఇదిలా ఉంటే.. వ‌రుస పెట్టి క్షీణిస్తున్న రూపాయి ఈ రోజు కూడా మ‌రింత క్షీణించింది. ఈ రోజు ట్రేడింగ్ షురూ అయిన వెంట‌నే కొత్త క‌నిష్ఠానికి చేరుకొన్న రూపాయి కుదేలైంది.

చ‌రిత్ర‌లో ఎప్పుడూ లేని రీతిలో రెండు రోజుల క్రితం డాల‌రుతో రూపాయి మార‌కం విలువ 70ను దాటేసిన వైనం తెలిసిందే. ఈ రోజు ఆ రికార్డును బ్రేక్ చేసి.. మ‌రో చెత్త రికార్డు న‌మోదైంది. ట‌ర్కీతో పాటు ప్రపంచ మార్కెట్ల‌లో చోటు చేసుకున్న ప‌రిణామాల‌తో తాజాగా డాల‌రుతో రూపాయి విలువ రూ.70.32ను తాకి.. ఇన్వెస్ట‌ర్లకు షాకులు ఇస్తోంది.

తాజా ప‌రిణామాలు చూస్తుంటే.. రూపాయి ఇప్ప‌ట్లో కోలుకునేలా క‌నిపించ‌ని ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో రూపాయి మ‌రింత క్షీణ‌త‌కు గుర‌య్యే అవ‌కాశం ఉంద‌న్న మాట వినిపిస్తోంది. అదే జ‌రిగితే.. వాణిజ్య లోటు గ‌రిష్ఠ స్థాయికి చేరుకుంటుంద‌న్న అంచ‌నాలు వినిపిస్తు్న్నాయి. జ‌బ్బు చేసిన రూపాయికి స్వ‌స్థ‌త చేసే మందేమీ లేదా మోడీజీ?