Begin typing your search above and press return to search.

పోటీకి కొత్తైనా ప్రత్యర్థులకు చుక్కలు చూపారు

By:  Tupaki Desk   |   12 Dec 2018 7:30 AM GMT
పోటీకి కొత్తైనా ప్రత్యర్థులకు చుక్కలు చూపారు
X
తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు చాలాచోట్ల అభ్యర్థులకు చుక్కలు చూపించారు. తొలిసారే అయినప్పటికీ హేమాహేమాలను తలదన్నేలా ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూస్తే వీరిపట్ల ఓటర్లు కూడా సొంత సానుకూలంగా తీర్పున విలక్షణ తీర్పు ఇచ్చినట్లు కనబడుతుంది.

తొలిసారిగా అసెంబ్లీకి పోటీ చేసిన వారిలో ఇద్దరికి ఓటరు దేవుళ్లు పట్టంకట్టారు. కాగా మిగతా వారిలో చాలామంది రెండు స్థానంలో నిలువడంతోపాటు మరికొన్ని చోట్ల గట్టీ పోటీ ఇచ్చారు. గెలిచిన అభ్యర్థుల్లో ఒకరు మేడ్చల్ నుంచి చామకూర మల్లారెడ్డి(సీఎంఆర్)- మరొకరు అంబర్ పేట నుంచి కాలేరు వెంకటేశ్. వీరిద్దరు అసెంబ్లీ పోరులో తొలిసారి నిలిచి గెలుపు బావుటా ఎగురవేశారు.

ఇక మొదటిసారిగా కూకట్ పల్లి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన సుహాసిని రాజకీయాలకు కొత్త. నందమూరి కుటుంబ వారసురాలిగా ఆమెకు టీడీపీ టికెటిచ్చి బరిలో నింపింది. ఆమె తొలిసారి అయినప్పటికీ గెలుస్తారనే ప్రచారం బాగానే సాగింది. అయితే కారు జోరు ముందు ఆమె రెండో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

బీజేపీ నుంచి పోటీచేసిన యోగానంద్ - శేరిలింగంపల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన ఆనంద ప్రసాద్ వీరద్దరూ రాజకీయాలకు కొత్తవారే. అయినప్పటికీ ఆనంద్ ప్రసాద్ రెండో స్థానం - యోగానంద్ మూడో స్థానంలో నిలిచి గట్టి పోటీ ఇచ్చారు. ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి దాసోజు శ్రవణ్ కుమార్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఉప్పల్ సెగ్మెంట్ నుంచి టీడీపీ అభ్యర్థి టీ. వీరేందర్ గౌడ్ రెండో స్థానంలో - చాంద్రాయణగుట్ట నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన షెహజాది రెండో స్థానంలో నిలిచారు.

ముషీరాబాద్ నుంచి పోటీచేసిన కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్(మాజీ ఎంపీ అంజన్ యాదవ్ కుమారుడు) రెండో స్థానంలో నిలిచారు. అదేవిధంగా మహేశ్వరం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన శ్రీరాములు యాదవ్ మూడో స్థానంలో, రాజేంద్రనగర్ నుంచి ఎంఐఎం అభ్యర్థిగా పోటీచేసిన మీర్జా రహ్మత్ బేగ్ రెండో స్థానంలో - టీడీపీ అభ్యర్థి గణేష్ గుప్తా మూడో స్థానంలో నిలిచి ప్రత్యర్థులకు గట్టీ పోటీనిచ్చారు.