నాగేశ్వరరావు సతీమణి కంపెనీలో సోదాల షాక్?

Sat Feb 09 2019 11:50:44 GMT+0530 (IST)

ముల్లును ముల్లుతోనే తీయాలి. ఈ విషయం మీద పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తెలిసినంత బాగా మరెవరికీ తెలీదని చెప్పక తప్పదు. మోడీ లాంటి మొండోడికి సైతం ఉలికిపాటు చెందేలా షాకిచ్చిన నేర్పు ఆమె సొంతం. చూసేందుకు సాదాసీదాగా ఉన్నప్పటికీ .. మొండితనంలో మోడీకి మించిన వ్యక్తిగా అందరికి ఇప్పుడు అర్థమయ్యారు. మమత గురించి ఇప్పటివరకూ తెలిసినా.. తనదైన శైలిలో మోడీ మీద నడి రోడ్డు మీదకు వచ్చి మరీ నిరసన తెలిపిన తీరు ఆమెకు కొత్త ఇమేజ్ ను తెచ్చి పెట్టింది.కోల్ కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ను సీబీఐ ప్రశ్నించటానికి బదులుగా సీబీఐ మాజీ బాస్ నాగేశ్వరరావుకు ఊహించని షాక్ తగిలినట్లుగా చెబుతున్నారు. సీబీఐ మాజీచీఫ్ సతీమణికి చెందిన కంపెనీలో కోల్ కతా పోలీసులు సోదాలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. సీబీఐ చేసిన దానికి బదులుగా ఈ సోదాలు ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.  

నాగేశ్వరరావు సతీమణికి చెందిన ఏఎంపీఎల్ సంస్థలో కోల్ కోతా పోలీసులు సోదాలు నిర్వహించారు. తమకు అందిన ఫిర్యాదులో భాగంగా.. తనిఖీలు చేపట్టినట్లుగా చెబుతున్నారు. అయితే.. ఇవి తనిఖీలు ఎంతమాత్రంకావని.. కేవలం పరిశీలన మాత్రమేనని చెబుతున్నారు. ఇదిలా ఉంటే నాగేశ్వరరావు మాత్రం ఏఎంపీఎల్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని ఒక ప్రకటనను విడుదల చేశారు. మరి.. ఆయన సతీమణికి చెందిన కంపెనీగా చెబుతున్న నేపథ్యంలో.. ఆ విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.