Begin typing your search above and press return to search.

మోదీని ఎత్తి చూపే... వేలును న‌రికేస్తార‌ట‌!

By:  Tupaki Desk   |   21 Nov 2017 10:51 AM GMT
మోదీని ఎత్తి చూపే... వేలును న‌రికేస్తార‌ట‌!
X
దేశంలో పెద్ద నోట్ల ర‌ద్దు - జీఎస్టీ అమ‌లు త‌దిత‌రాల‌తో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీపై ఎన్న‌డూ లేనంత రీతిలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. అంత‌కుముందు కూడా మోదీపై విమ‌ర్శ‌లు వినిపించినా... అవ‌న్నీకూడా అంత‌గా ఘాటు పుట్టించ‌లేద‌నే చెప్పాలి. అయితే నోట్ల ర‌ద్దు - జీఎస్టీ త‌ర్వాత మోదీపై విమ‌ర్శ‌కులు త‌మ‌దైన శైలిలో వాడీవేడీ కామెంట్లు చేస్తున్నారు. ఈ కామెంట్లు విప‌క్షం నుంచే కాకుండా స్వ‌ప‌క్షం నుంచి కూడా వ‌స్తుండ‌టం బీజేపీ నేత‌ల‌ను తీవ్ర ఆందోళ‌న‌ల‌కే కాకుండా ఆగ్ర‌హావేశాల‌కు కూడా గురి చేస్తోంద‌నే చెప్పాలి. బీజేపీలో ఆగ్ర‌హంతో ర‌గిలిపోయే నేత‌ల‌కు కొద‌వేమీ లేద‌నే చెప్పాలి. ఈ విష‌యంలో ఇత‌ర పార్టీల‌తో పోలిస్తే... బీజేపీనే ముందు వరుస‌లో ఉంటుంద‌ని చెప్ప‌డంలోనూ ఎలాంటి సందేహం లేద‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. మ‌రి మోదీపైకి దూసుకువ‌స్తున్న విమ‌ర్శ‌ల‌పై బీజేపీ నేత‌లు ఎలా స్పందిస్తున్నార‌న్న విష‌యానికి వ‌స్తే... తాము ఏ స్థాయిలో ఉన్నామ‌న్న విష‌యాన్ని ప‌క్క‌న‌పెట్టేస్తున్న కొంద‌రు బీజేపీ ఎంపీలు నోటికి ఎంత మాట వ‌స్తే అంత మాట అనేస్తున్నారు.

ఇటీవ‌లే కేంద్రంపై ద‌క్షిణాది భాషా చిత్రాల న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ చేసిన విమ‌ర్శ‌ల‌పై క‌ర్ణాట‌కకు చెందిన బీజేపీ యువ ఎంపీ ఘాటు వ్యాఖ్య‌లు చేసి విష‌యం తెలిసిందే. అస‌లు నువ్వెంత‌? నీ అర్హ‌త ఎంత‌? మోదీని విమ‌ర్శించే అర్హ‌త నీకు ఉందా? అన్న రీతిలో ఆ యువ ఎంపీ... ప్ర‌కాశ్ రాజ్‌ పై భారీ ఎత్తున విరుచుకుప‌డ్డారు. తాజాగా బీజేపీకే చెందిన బీహార్ ఎంపీ మ‌రొక‌రు రంగంలోకి దిగిపోయారు. ఈ ఎంపీ క‌ర్ణాట‌క‌కు చెందిన బీజేపీ యువ ఎంపీని దాటేసి మ‌రో అడుగు ముందుకేసీ... ఏకంగా వేళ్ల‌ను న‌రికేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ ఎంపీ వ్యాఖ్య‌లు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. తాజా ఉదంతం విష‌యానికి వ‌స్తే... మోదీ విమ‌ర్శ‌కుల‌పై బీహార్‌ కు చెందిన బీజేపీ ఎంపీ నిత్యానంద రాయ్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. మోదీని విమ‌ర్శిస్తూ చూపే వేళ్లను చిదిమేస్తామ‌ని, అవ‌స‌ర‌మైతే తెగ న‌రికేస్తామ‌ని హెచ్చ‌రించారు. అయినా రాయ్ అంత‌గా ఎందుకు ఎదురు దాడికి దిగారంటే.. మోదీ దేశంలోని పేద‌ల కోసం, సామాన్య జ‌నం కోసం ప‌నిచేస్తున్న నేత‌గా రాయ్ అభివ‌ర్ణించారు. ఈ దిశ‌గా మోదీ ఉన్న‌త శిఖ‌రాల‌కు చేరుకున్నార‌ని కూడా ఆయ‌న చెప్పుకొచ్చారు.

దేశంలో న‌ల్ల‌ధ‌నాన్ని తుద‌ముట్టించేందుకు కంక‌ణం క‌ట్టుకున్న మోదీ... దేశ ప్ర‌జ‌ల‌కు దీర్ఘ‌కాలిక ప్ర‌యోజ‌నాల‌ను ఆశించే పెద్ద నోట్ల ర‌ద్దు - జీఎస్టీ అమ‌లు వంటి సంచ‌ల‌న నిర్ణ‌యాల‌ను తీసుకున్నార‌ని చెప్పారు. అస‌లు మోదీని ఆయ‌న పేద‌లు, సామాన్య జ‌నం ప్ర‌తినిధిగా అభివ‌ర్ణించారు. అలాంటి మోదీపై వేలెత్తి చూపే నేత‌ల‌ను, విమ‌ర్శ‌కుల‌ను స‌హించేది లేద‌ని కూడా రాయ్ ఘీంక‌రించారు. మోదీ నిర్ణ‌యాల‌ను వ్య‌తిరేకించే వారిని తాము మోదీ వ్య‌తిరేకులుగానే ప‌రిగ‌ణిస్తామ‌ని కూడా చెప్పేశారు. అంత‌టితో ఆగ‌ని రాయ్‌... మోదీ వైపు చూపే ప్ర‌తి వేలును చిదిమేస్తామ‌ని, తెగ న‌రికేస్తామ‌ని కూడా ప్ర‌క‌టించారు. రాయ్ చేసిన వ్యాఖ్య‌లు క్ష‌ణాల్లో దేశ‌వ్యాప్తంగా పెను సంచ‌ల‌నంగా మారాయి. ఈ త‌ర‌హా బెదిరింపులు ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌కు గొడ్డ‌లిపెట్టేన‌ని కూడా ప‌లువురు రాజ‌కీయ నేత‌లు, పార్టీలు అభిప్రాయ‌ప‌డ్డాయి. ముందుగా ఆవేశంగా మాట్లాడేసి వేళ్ల‌ను న‌రికేస్తామ‌ని ప్ర‌క‌టించిన రాయ్‌... ఆ త‌ర్వాత తీరిగ్గా తేరుకుని తన వ్యాఖ్య‌ల‌పై విచారం వ్య‌క్తం చేశారు. అంతేకాకుండా తాను అలా మాట్లాడ‌కుండా ఉండాల్సిందంటూ సారీ కూడా చెప్పేశారు. న‌రికేస్తామంటూ హెచ్చ‌రిక‌లు జారీ చేసిన త‌ర్వాత‌... సారీ చెప్పినా ఏం ప్ర‌యోజనం ఉంటుంద‌న్న‌ది ఇప్పుడు అందరి ప్ర‌శ్న‌. మ‌రీ రాయ్ వ్యాఖ్యల‌పై బీజేపీ నేత‌లు ఎలా స‌మ‌ర్థించుకుంటారో చూడాలి.