కాంగ్రెస్ వ్యూహకర్తను పట్టిస్తే 5 లక్షలు!

Mon Mar 20 2017 19:14:20 GMT+0530 (IST)

ప్రకటనలు ఆకట్టుకునేలా ఉండటమే కాదు ఒక్కో సారి ఆశ్చర్యం కలిగించేలా కూడా ఉంటాయి. ఇలాంటి క్రేజ్ కు రాజకీయ నాయకుల కసి తోడయితే సీన్ మారిపోతుంది. ఇప్పుడు సరిగ్గా అలాగే జరిగింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఘోర పరాభవం ఎదురవడాన్ని ఆ పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఓటమికి పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ను బాధ్యుడ్ని చేస్తున్నారు. లక్నోలోని పార్టీ ఆఫీస్ లో ప్రశాంత్ కిశోర్ కనిపించడం లేదని ఆయన ఆచూకి చెప్పిన వారికి రూ.5 లక్షల నజరానా ఇస్తామన్న హోర్డింగ్ కనిపించడం గమనార్హం.

రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్ తోనే ఉన్న రాజేష్ సింగ్ అనే వ్యక్తి ఈ హోర్డింగ్ ను ఏర్పాటుచేశాడు. ఇందులో తన భారీ ఫొటోను కూడా పెట్టడం విశేషం. ఈ హోర్డింగ్ పై అసంతృప్తి వ్యక్తంచేసిన కాంగ్రెస్ పార్టీ...ఆ వ్యక్తిపై ఆరేళ్ల సస్పెన్షన్ విధించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాజ్ బబ్బర్ - కొత్తగా ఎన్నికైన ఏడుగురు ఎమ్మెల్యేలు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. యూపీ చరిత్రలో కాంగ్రెస్ ఇన్ని తక్కువ సీట్లు ఎప్పుడూ సాధించలేదు. దీనిపై రాజేష్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ "నేను చేసిన పనికి చింతించడం లేదు. ప్రశాంత్ కిశోర్ మమ్మల్ని నడిపించారు. మేము నిజాయితీ గల పార్టీ కార్యకర్తలం. పార్టీ కోసం రక్తం-చెమట ధారపోశాం. అయినా మా అభిప్రాయాలను ఎన్నికల్లో ఎవరూ పట్టించుకోలేదు. ఇలాంటి కన్సల్టెంట్లను కిరాయికి తెచ్చుకోవడం వల్లే పార్టీ ఓడింది" అని రాజేష్ సింగ్ ఆరోపించారు.

2014లో బీజేపీ ఘన విజయం సాధించేలా సాగిన నరేంద్ర మోడీ మ్యాజిక్ వెనుక ఉన్నది ప్రశాంత్ కిశోరే. ఆయన వ్యూహాలు కీలక ఎన్నికల్లో పార్టీలకు విజయాలు సాధించిపెట్టాయి. దీంతో ఈసారి ఆయన సేవలు వినియోగించుకోవాలని కాంగ్రెస్ భావించింది. మూడు రాష్ట్రాల బాధ్యతలు అప్పగించగా.. పంజాబ్ లో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. యూపీ - ఉత్తరాఖండ్ లలో ఓడిపోయింది. అటు పంజాబ్ లో మాత్రం తమ విజయంలో ప్రశాంత్ కిశోర్ దే కీలకపాత్ర అని కెప్టెన్ అమరీందర్ సింగ్ చెప్పడం గమనార్హం.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/