Begin typing your search above and press return to search.

తుది సమరం: ముగియనున్న సార్వత్రిక ఎన్నికలు

By:  Tupaki Desk   |   18 May 2019 5:30 PM GMT
తుది సమరం: ముగియనున్న సార్వత్రిక ఎన్నికలు
X
కేంద్రంలో అధికారాన్ని నిర్ణయించే సార్వత్రిక ఎన్నికలు రేపటితో ముగియనున్నాయి. మొత్తం 545 పార్లమెంటు స్తానాలకు గానూ ఏడు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. ఇప్పటికే ఆరు విడతల్లో పోలింగ్‌ పూర్తయింది. ఆదివారం ఎనిమిది రాష్ట్రాల్లో 59 లోక్‌సభ స్థానాలకు నిర్వహించే పోలింగ్‌తో సార్వత్రిక ఎన్నికలు ముగిసిపోతాయి. ఏడోవిడతలో అతిరథ మహారథులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఉత్తరప్రదేశ్‌ లోని వారణాసి నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ పోటీ చేస్తున్నారు. అదేవిధంగా బిహార్‌ లోని ససారామ్‌ నుంచి లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌ బరిలో దిగారు. జార్ఖండ్‌ మాజీ సీఎం శిబు సోరేన్‌ గోడ్డా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

ఈమేరకు దేశవ్యాప్తంగా సుమారు ఒకటిన్నర నెల పాటు ఎన్నికలు జరిగాయి. గత 2014 ఎన్నికల్లో బీజేపీ ఏకపక్షంగా విజయం సాధించింది. ఫలితంగా ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాగా మరోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. అయితే కాంగ్రెస్‌ కూటమి ఈసారి కేంద్రంలో అధికారం చేపట్టాలని భావిస్తోంది. ఈమేరకు పలు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంది. అయినా ఎలాంటి ఫలితం ఉండదని భావిస్తున్నారు.

కాగా మళ్లీ అధికారంలోకి వస్తామని బీజేపీ నేతలు అమిత్‌ షా - ప్రధాని నరేంద్రమోదీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈసారి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ గెలుపు అమేధీలో కష్టమే అని చెబుతున్నారు. ఈక్రమంలో ఆయన కేరళలోని వయనాడ్‌ నుంచి బరిలో దిగారు. రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. అయితే సోనియాగాంధీ రాయ్‌ బరేలీ - మోదీ వారణాసి - లక్నో నుంచి రాజనాథ్‌ సింగ్‌ పోటీలో ఉన్నారు. ఈనెల 23వ తేదీ ఓట్ల లెక్కింపు.. ఫలితాలు వెల్లడిస్తారు.

ఏడోవిడతలో భాగంగా ఉత్తరప్రదేశ్‌›– 13 - పశ్చిమబెంగాల్‌ – 9 - బిహార్‌ – 8 - జార్ఖండ్‌ – 3 - మధ్యప్రదేశ్‌ – 8 - పంజాబ్‌ – 13 - హిమాచల్‌ ప్రదేశ్‌ – 4 - చంఢీగడ్‌ – 1 స్థానాలకు ఆదివారం పోలింగ్‌ నిర్వహిస్తారు.

తొలివిడతలో 20 రాష్ట్రాల్లోని 91 స్థానాలు - రెండోవిడతలో 13 రాష్ట్రాల్లో 95 స్థానాలు - మూడోవిడతలో 15 రాష్ట్రాల్లో 117 స్థానాలు - నాల్గో విడతలో 9 రాష్ట్రాల్లో 71 స్థానాలు - ఐదోవిడతలో 7 రాష్ట్రాల్లో 51 స్థానాలు - ఆరోవిడతలో 7 రాష్ట్రాల్లో 59 స్థానాలు - ఏడోవిడతలో 8 రాష్ట్రాల్లో 59 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. కాగా మూడోవిడతలో అత్యధికంగా 117 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అదేవిధంగా జమ్మూ కశ్మీర్‌ లోని ఒకే పార్లమెంటు స్థానానికి మూడు విడతల్లో ఎన్నికలు జరగడం విశేషం.