Begin typing your search above and press return to search.

విద్యార్థుల మరణం.. ప్రశ్నించడానికి భయమా?

By:  Tupaki Desk   |   24 April 2019 5:42 AM GMT
విద్యార్థుల మరణం.. ప్రశ్నించడానికి భయమా?
X
టాలీవుడ్ సినిమా సెలబ్రెటీలు కొందరు భయపడుతున్నారా?. భయంతో కూడిన సిగ్గు వల్ల వచ్చిన అతివినయాన్ని తెలంగాణలో ప్రదర్శిస్తున్నారా.?. పక్కరాష్ట్రంలో చీమచిటుక్కుమన్నా స్పందించి రచ్చ చేసే సినీ సెలబ్రెటీలు తాము నివాసం ఉంటున్న తెలంగాణలో మాత్రం ఏం జరిగినా స్పందించకపోవడానికి కారణమేంటన్న ప్రశ్న ఇప్పుడు అందరినీ నుంచి వ్యక్తమవుతోంది..

తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అంతా గోల్ మాల్ జరిగింది. ఫలితాల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయి. తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్లక్ష్య వైఖరికి 15మందికి పైగా విద్యార్థులు బలయ్యారు. ఫలితాల్లో అవకతవకల కారణంగా మనస్తాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

అయితే సినీ సెలబ్రెటీలు దీనిపై తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ, తెలంగాణ ఇంటర్ బోర్డ్ ను కానీ పల్లెత్తు మాట అనడం లేదు. కానీ ఒకే ఒక్క హీరో మంచు మనోజ్ మాత్రం ఇంటర్ బోర్డ్ వైఫల్యాన్ని ఎండగట్టారు. ఇంత నిర్లక్ష్యంగా పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్న ఇంటర్ బోర్డుపై చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ లో డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇంత మంది స్టూడెంట్స్ చనిపోతున్నా పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు.

కానీ కొందరు సినీ సెలెబ్రెటీలు మాత్రం విద్యార్థుల మరణంపై ఆచితూచి స్పందించారు. గాయంపై యాంటిమెంట్ పూసిన చందంగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని.. స్థైర్యం కోల్పోవద్దని. తల్లిదండ్రులు అండగా నిలవాలనే సుతిమెత్తగా హితబోధ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాన్ని, ఇంటర్ బోర్డు చేతగానితనాన్ని మనోజ్ లా ఎవ్వరూ ప్రశ్నించిన పాపాన పోవడం లేదు.

ఇదే ఏపీలో సమస్యలపై మాత్రం టాలీవుడ్ సినీ సెలబ్రెటీలు ఉవ్వెత్తున లేస్తుంటారు. చంద్రబాబును, పవన్ ను, మోడీని తిట్టిన నోళ్లు కూడా కేసీఆర్ తిట్టడానికి మాత్రం సాహసించడం లేదు. పక్కరాష్ట్రాలు, దేశం గురించి ఆలోచించే సినీ సెలెబ్రెటీలు తాము ఉంటున్న చోట ప్రభుత్వం విఫలమైతే మాత్రం నోరు మెదపకపోవడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.