శరణార్థులు కేసులో ట్రంప్ షాకయ్యే తీర్పు

Tue Nov 20 2018 16:35:08 GMT+0530 (IST)

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న సంచలన నిర్ణయం అనేక దేశాల వారిని హతాశులను చేస్తోంది. మెక్సికో నుంచి అక్రమంగా సరిహద్దులు దాటుతున్న వారికి అడ్డుకట్ట వేయడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇలా వచ్చిన వాళ్లలో తల్లిదండ్రుల నుంచి పిల్లలను వేరు చేసి వాళ్లను టెండర్ ఏజ్ షెల్టర్లకు పంపిస్తున్నారు. తమ తల్లిదండ్రులు కనిపించక ఆ పిల్లలు తెగ ఏడుస్తున్నారు. ఇప్పటికే వాళ్లకు సంబంధించిన ఆడియో క్లిప్పులు వైరల్ గా మారాయి. మరోవైపు ఇలా జైలు పాలవుతున్న తల్లితండ్రుల వివరాలను ఆరాతీయగా....అందులో మనోళ్లు కూడా ఉన్నారని తేలింది. ఇలా సంచలనం సృష్టించిన డోనాల్డ్ ట్రంప్ కు అమెరికా కోర్టు జలక్ ఇచ్చింది.శరణార్థులకు ఆశ్రయం కల్పించరాదు అంటూ ట్రంప్ ఇచ్చిన ఆదేశాలను ఫెడరల్ జడ్జి కొట్టిపారేశారు. మెక్సికో నుంచి వేల సంఖ్యలో శరణార్థులు అమెరికాలోకి అక్రమంగా వలస వస్తున్నారు. వారిని అడ్డుకునేందుకు ట్రంప్ తాజాగా ఆ ఆదేశాలను జారీ చేశారు. అయితే ఆ ఆదేశాలను శాన్ ఫ్రాన్సిస్ కోకు చెందిన డిస్ట్రిక్ జడ్జి టాన్ టైగర్ అడ్డుకున్నారు. పౌర హక్కుల సంఘాలు వేసిన పిటిషన్ ను స్వీకరించిన న్యాయమూర్తి ఈ ఆదేశాలు ఇచ్చారు. ఈ కేసులో తదుపరి విచారణ డిసెంబర్ 19న ఉంటుందని జడ్జి తెలిపారు. శరణార్థులు దేశంలోకి ఎలా ప్రవేశించినా.. వాళ్లు ఆశ్రయాన్ని పొందవచ్చు అని జడ్జి తన తీర్పులో పేర్కొన్నారు.

కాగా సరైన ధ్రువీకరణ పత్రాలు లేకుండా అమెరికాకు వచ్చినవారి పిల్లల రక్షణ కోసం 2012లో నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా డాకా (డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్ హుడ్ అరైవల్స్) డ్రీమర్ స్కీమ్ ని ప్రవేశపెట్టారు. ఈ స్కీమ్ ప్రకారం...30 ఏళ్ల లోబడిన వారంతా తమ వ్యక్తిగత సమాచారాన్ని యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ సెక్యూరిటీకి అందజేయాలి. ప్రతీ రెండేళ్లకు ఒకసారి వ్యక్తిగత సమాచారాన్ని అధికారులు సేకరించి పరిశీలిస్తారు. ఒబామా ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ ని రద్దు చేయనున్నట్టు గతేడాది సెప్టెంబర్ లో ట్రంప్ ప్రకటించారు. ఈ ఏడాది మార్చి5 నుంచి డాకా డ్రీమర్ స్కీమ్ లో పేర్లు నమోదు చేసుకున్నవారి దరఖాస్తులను రెన్యువల్ చేయబోమని - కొత్త దరఖాస్తులను స్వీకరించమని అధికారులు ప్రకటించారు. దీనిపై దాఖలైన పిటిషన్ నేపథ్యంలో తాజా తీర్పు ఇచ్చారు.