పుట్టిన పసికందును తెచ్చిన తీరుపై వైద్యులు షాక్

Thu May 17 2018 10:59:22 GMT+0530 (IST)

తనను పుట్టించాలని ఆ పసికందు కోరుకోలేదు. తన ప్రమేయం ఏమీ లేకుండా పుట్టిన ఆ పసికందుకు.. జన్మనిచ్చిన తల్లిదండ్రులు ప్రవర్తించిన తీరు చూసి వైద్యులు సైతం నిర్ఘాంతపోయే పరిస్థితి. పుట్టిన పసికందును అమ్మకానికి పెట్టటమే పెద్ద తప్పు అయితే.. ఆ పాపను వదిలించుకోవటానికి ఆ తండ్రి వ్యవహరించిన తీరు చూస్తే.. కళ్ల వెంట నీళ్లు రాక మానవు.ప్లాస్టిక్ సంచిలో వస్తువును వేసుకొచ్చిన చందంగా అప్పుడే పుట్టిన పసికందుకు ప్లాస్టిక్ సంచిలో వేసుకొచ్చి.. అమ్మకానికి పెట్టిన దుర్మార్గం ఇప్పుడు సంచలనంగా మారింది. కర్కశ హృదయంతో వ్యవహరించిన తండ్రి తీరును తీవ్రంగా తప్పు పడుతున్నారు. అందరికి షాకిచ్చిన ఈ ఉదంతంలోకి వెళితే..

అప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్న దంపతులకు మరో ఆడపిల్ల పుట్టింది. మొహాలీలో ఉండే ఈ జంటకు తాజాగా ఆడపిల్ల పుట్టింది. ఆమెను.. ఆసుపత్రిలో అమ్మకానికి తండ్రి జస్పాల్ సింగ్ పెట్టారు. ఆసుపత్రిలో విధుల్లో ఉన్న డాక్టర్ వద్దకు వెళ్లి తమ పాపను కొనుక్కోవాలని కోరాడు. దాంతో ఆశ్చర్యపోయిన వైద్యులు పాప ఎక్కడ ఉందని అడిగారు. తన దగ్గరి ప్లాస్టిక్ సంచిలో ఉందంటూ.. పాపను చూపించారు.

దీంతో.. షాక్ తిన్న వైద్యులు వెంటనే.. పాపను తీసుకొని అత్యవసర వైద్య సాయాన్ని అందిస్తున్నారు.  ఎవరికి కనిపించకుండా ఉండేందుకు ప్లాస్టిక్ సంచిలో పెట్టినట్లుగా చెబుతున్నారు. ప్లాస్టిక్ సంచిలో ఎక్కువ సేపు ఎవరికి కనిపించకుండా ఉంచే క్రమంలో ఆ పాప తీవ్ర అనారోగ్యానికి గురైంది. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. పాపకు వాంతులు అవుతున్నాయని చెబుతున్నారు.

తన భార్యకు అనారోగ్యంగా ఉందని.. ఆమెకు వైద్యం చేయించటానికి అవసరమైన డబ్బులు లేక తానీ పని చేసినట్లుగా జస్పాల్ సింగ్ చెబుతున్నాడు. మొహాలీలోని ఒక షాపులో కూలీగా పని చేసే ఇతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే తమకు ఇద్దరు పిల్లలు ఉన్నట్లుగా పోలీసు విచారణలో ఆ కర్కస తండ్రి వెల్లడించాడు.పసికందుకు కాపాడేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు.