Begin typing your search above and press return to search.

మంత్రి ఆగ్రహం.. మహిళా ఎస్పీ ‘పోస్ట్’ ఊస్టింగ్

By:  Tupaki Desk   |   28 Nov 2015 4:23 PM GMT
మంత్రి ఆగ్రహం.. మహిళా ఎస్పీ ‘పోస్ట్’ ఊస్టింగ్
X
రాజకీయ నాయకులుకు అధికారులు అణిగిమణిగి ఉండటం.. వారి అడుగులకు మడుగులు ఒత్తటం లాంటివి చేస్తుంటారు. కొందరు నికార్సుగా ఉంటూ.. ఆటుపోట్లు ఎదుర్కొంటారు. ముక్కుసూటిగా వ్యవహరించి.. ఉన్న నిజాన్ని చెబితే ఎలాంటి సత్కారం దక్కుతుందన్నది తాజా ఉదంతం చెప్పకనే చెప్పేస్తుంది. హర్యానాలో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడక్కడ సంచలనం సృష్టిస్తోంది.

హర్యానా రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి అనిల్ విజ్.. ఫతేహబాద్ ఎస్పీ సంగీతా కలియాలతో కలిపి ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమ మద్యం అమ్మకాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారంటూ ఎస్పీని ప్రశ్నించారు మంత్రివర్యులు. గత ఏడాది కాలంలో దాదాపు 2500 కేసులు నమోదు చేసినట్లుగా ఆమె చెప్పారు.

అక్కడితో ఆగని మంత్రి.. పోలీసు శాఖకు మద్యం మాఫియాతో సంబంధాలు ఉన్నట్లుగా వస్తున్న ఆరోపణలపై సమాధానం ఏమిటంటూ ప్రశ్నించారు. అసలు విషయం మంత్రికి తెలిసినా తనను ప్రశ్నించటంతో ఆ మహిళా ఎస్పీ ముఖం పగిలిపోయే సమాధానం ఇస్తూ.. అది ప్రభుత్వ వ్యవహారమని.. మద్యం అమ్మకాలకు లైసెన్స్ ఇచ్చింది ప్రభుత్వమే కదా అని సూటిగా బదులిచ్చారు.

అలాంటి సూటి సమాధానాన్ని ఏ మాత్రం ఊహించని మంత్రివర్యులకు కోపం వచ్చేసింది. అగ్రహంతో ఊగిపోయిన ఆయన.. ఆమెను సమావేశం నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. మంత్రిగారు తన రేంజ్ చూపిస్తే.. ఎస్పీ తనకున్న హక్కుతో తాను వెళ్లనని తేల్చి చెప్పారు. దీంతో మరింతగా ఊగిపోయిన ఆయన వాకౌట్ చేసి వెళ్లిపోయారు. మరి.. ఈ విషయం రచ్చ కావటం.. విషయం డీజీపీ దగ్గరకు వెళ్లటంతో ఎస్పీను సదరు బాధ్యతలను ఊస్టింగ్ చేస్తూ.. బదిలీ వేటు వేశారు. అయినా.. కెలకటం ఎందుకు.. సూటిగా సమాధానం చెబితే భరించలేక అంతలా ఫీలైపోవటం ఎందుకు..?