Begin typing your search above and press return to search.

నిమిషం కూడా ఆగలేనంత అర్జెంట్ కాలా?

By:  Tupaki Desk   |   29 May 2016 4:37 AM GMT
నిమిషం కూడా ఆగలేనంత అర్జెంట్ కాలా?
X
జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించటమే కాదు.. సీనియర్ రాజకీయ నేతగా సుపరిచితుడైన ఫరూక్ అబ్దుల్లా చేసిన తప్పుపై దేశ వ్యాఫ్తంగా ఆగ్రహం వ్యక్తం కావటమే కాదు.. పలువురు మండిపడుతున్నారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరైన ఫరూక్ అబ్దుల్లా..జాతీయ గీతాలాపన సమయంలో సెల్ ఫోన్ మాట్లాడటం వివాదంగా మారింది.

జాతీయ గీతం ఆలపించే సమయంలో నిలుచొని ఉండటం.. మరే అంశం మీద దృష్టి పెట్టకుండా ఉండాల్సి ఉన్నా.. అందుకు భిన్నంగా అదేమీ పట్టకుండా ఫోన్ మాట్లాడిన తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్న క్రమంలో ఫరూక్ రియాక్ట్ అయ్యారు. తాను కావాలని చేయలేదని.. జాతీయ గీతాలాపన సమయంలో ఎలా వ్యవహరించాలో తనకు తెలుసని చెప్పిన ఆయన.. తాను నిలబడి ఉన్నా అర్జెంట్ ఫోన్ కాల్ మాట్లాడాల్సి రావటంతో తాను ఫోన్ మాట్లాడినట్లుగా చెప్పారు.

ఇంతకీ ఫరూక్ కి అంత అర్జెంట్ కాలేమిటన్న విషయాన్ని చెబుతూ విదేశాల్లో ఉన్న తన బంధువు అనారోగ్యానికి గురయ్యారని.. దీంతో ఎమర్జెన్సీ కాల్ కాబట్టి తాను మాట్లాడాల్సి వచ్చిందని చెబుతున్నారు. తాను ఫోన్ మాట్లాడిన ఉదంతంపై ఎవరి మనోభావాలు దెబ్బ తీసినట్లుగా అనిపిస్తే తనను క్షమించాలని కోరుతున్న ఫరూక్ మాటలు చూసినప్పుడు.. ఆయన చెబుతున్నదంతా వెన్నపూత మాటలే తప్ప విషయం లేదన్న భావన కలగటం ఖాయం.

జాతీయగీతం ఆలపించే సమయం కేవలం 52 సెకన్లు మాత్రమే. అంటే.. నిమిషం కంటే తక్కువ సమయమన్నమాట. ఈ స్వల్ప వ్యవధిలో దేశానికి ముప్పు వాటిల్లే ప్రమాదం వచ్చినప్పుడు తప్పించి.. మరే అంశానికి ప్రాధాన్యత ఇవ్వకూడదన్న చిన్న విషయం ఫరూక్ లాంటి సీనియర్ నేతకు చెప్పాల్సిన రావటానికి మించిన దురదృష్టం ఇంకేం ఉంటుంది? నిమిషం కంటే తక్కువ వ్యవధిలో అయిపోయే జాతీయ గీతాలాపన విషయంలో కమిట్ మెంట్ ప్రదర్శించని ఫరూక్ లాంటి నేతలు.. చేసింది వెధవ పని అయినా.. మనోభావాలు దెబ్బ తింటే తనను క్షమించాలని కోరటం చూస్తే.. చేసిన తప్పుపై ఆయన ఇప్పటికి ఆత్మపరిశీలన చేసుకున్నట్లుగా కనిపించలేదనే చెప్పాలి. ఇలాంటి వారిని నేతలుగా గుర్తించి.. గౌరవించాల్సిన అవసరం ఉందా?