Begin typing your search above and press return to search.

వారి ప్రశ్నలకు నోట మాట రాని కోదండరాం?

By:  Tupaki Desk   |   5 Oct 2015 4:53 AM GMT
వారి ప్రశ్నలకు నోట మాట రాని కోదండరాం?
X
తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ పౌర సమాజాన్ని ఏకతాటి మీదకు తీసుకొచ్చిన అతికొద్దిమంది ఉద్యమనేతల్లో ప్రొఫెసర్ కోదండరాం ఒకరు. తెలంగాణ ఉద్యమ సమయంలో తన వాడివేడి మాటలతో అగ్గిపుట్టించిన ఆయన.. ఈ మధ్యనే ప్రొఫెసర్ గా తన పదవీ విరమణ చేశారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న రైతుల ఆత్మహత్యల్ని నివారించేందుకు.. రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకు వీలుగా కిసాన్ సంవేదన్ యాత్రలో ఆయన పాల్గొంటున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం మెదక్ జిల్లాలో పర్యటిస్తున్న ఆయనకు.. ఆదివారం ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ జిల్లాలోని చేగుంట మండలం ముక్కరాజు పేటకు చెందిన కొందరు రైతులు అడిగిన తూటాల్లాంటి ప్రశ్నలకు కోదండరాం సూటిగా సమాధానం చెప్పలేకపోయారు. కోదండరాం మాష్టార్ని అంతగా ఇబ్బంది పెట్టిన ప్రశ్నలేందంటే..

‘‘తెలంగాణ వస్తే అంతా బాగుంటది.. రైతులకు తిప్పలే ఉండవంటివి.. ఆత్మహత్యలు పోవాలంటే ప్రత్యేక రాష్ట్రం రావాలంటివి. మరి గిప్పుడేమవుతోంది సారూ..?’’ అని సూటిగా అడిగేశారు. అక్కడితో ఆగని వారు.. ‘‘ఉద్యోగులకు జీతాలు పెంచినట్లు రైతులను కూడా ఆదుకుంటే బాగుంటది కదా..? ఒక్క ఏడాది పెంచిన జీతాలు బందు చేయమనుండ్రి. బ్యాంకుల్లో మా అప్పులన్నీ ఒక్కసారే తీరుతాయి కదా? మీరు ఇప్పుడెందుకు మాట్లాడతలేరు’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

ఉద్యోగుల మీద ప్రదర్శిస్తున్న ప్రేమ అన్నదాతల మీద లేదని.. కష్టాల్లో మునిగిపోయిన అన్నదాతలకు స్థైర్యం కలిగేలా చర్యలు ఎందుకు తీసుకోవటం లేదన్న సూటి ప్రశ్నకు కోదండం మాష్టారు అంతే సూటిగా సమాధానం చెప్పలేకపోయారు. ఉద్యోగులకు సంఘాలు ఉన్నాయని.. అందుకే వారు తమ డిమాండ్లను సునాయాసంగా సాధించుకుంటున్నారని.. రైతులకు సంఘాలు లేక అలా చేయలేకపోతున్నారని చెప్పుకొచ్చారు.

రాష్ట్ర వ్యాప్తంగా సంఘాలు పెడుతున్నామని.. త్వరలోనే వాటికి కార్యరూపం దాలుస్తామని.. అప్పుడు అందరం రోడ్డెక్కితే సమస్యకు సమాధానం దొరుకుతుందని మాత్రమే కోదండం మాష్టారు సమాధానం చెప్పగలిగారు. ప్రభుత్వ యంత్రాంగంలో భాగం కాని ఆశా వర్కర్లు రోడ్డు ఎక్కితే ఎలాంటి మాటలు.. ఎలాంటి ఇబ్బందులు పడుతున్నది చూసి కూడా రైతులకు సంఘాలు ఉండాలని కోదండరాం మాష్టారు చెబుతున్న మాటలు కాస్త ఆశ్చర్యం కలిగించేవే.