Begin typing your search above and press return to search.

రాజకీయాల కోసం రుణమాఫీలొద్దు

By:  Tupaki Desk   |   11 Dec 2017 4:30 PM GMT
రాజకీయాల కోసం రుణమాఫీలొద్దు
X
తెలుగు రాష్ర్టాలు సహా దేశంలోని పలు రాష్ర్టాల్లో ఎన్నికల వేడి ఇప్పుడిప్పుడే మొదలవుతున్న తరుణంలో చాలా రాజకీయ పార్టీల దృష్టి రుణమాఫీపై ఉంది. రుణమాఫీని అమలు చేయడం సంగతి ఎలా ఉన్నా కూడా ఆ హామీ ఓట్లను కురిపిస్తుండడంతో రాజకీయ పార్టీలు ఈ దిశగా ఆలోచన చేస్తున్నాయి. అయితే... ఆర్బీఐ మాజీ గవర్నర్లు వైవీ రెడ్డి - సి.రంగరాజన్‌ లు దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు రుణమాఫీ అంశం పూర్తిగా రాజకీయంతో కూడిన నిర్ణయమని వారిద్దరూ తేల్చేశారు.

రాజకీయ పార్టీలు కొన్ని రాష్ట్రాల్లో రైతులకు వ్యవసాయ రుణమాఫీ చేస్తామని ఆఫర్ చేస్తున్నాయని.. రుణమాఫీకి బదులు ప్రత్యామ్నాయాలు చూడాలని.. అప్పులు తిరిగి చెల్లించడానికి రైతులు ఎక్కువ సమయం ఇవ్వడం... వాయిదాల పద్ధతిలో డబ్బు చెల్లించడంలోనూ కొన్ని వెసులు బాట్లు ఇవ్వడం.. పంటలు పాడైన ప్రాంతాలు, సంవత్సారాల్లో వడ్డీలు తగ్గించడం.. వాయిదాల నిలుపుదల వంటి చర్యలు తీసుకోవాలని వారు సూచించారు. సంవత్సరానికి వడ్డీ తగ్గించడంతోపాటు రుణాల చెల్లింపునకు రీషెడ్యూల్‌ చేయడం మంచిదని వీరిద్దరూ స్పష్టం చేశారు.

వ్యవసాయ రుణాల మాఫీ ఆర్థికవ్యవస్థ - పరపతి సంస్కృతికి మంచిది కాదని వారిద్దరూ అభిప్రాయపడ్డారు. కరువు పరిస్థితుల్లో వడ్డీ చెల్లింపులు మాఫీ చేయడం మంచిదన్నారు. ఇవేవీ ఫలితం ఇవ్వనప్పుడు.. అప్పటికీ రైతు పరిస్థితి బాగుపడనప్పుడు మాత్రమే రుణమాఫీ చేయాలని అన్నారు. పంజాబ్‌ - యూపీ - మహారాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీ ప్రకటించిన క్రమంలో ఈ ఆర్థికవేత్తల వ్యాఖ్యలు చర్చనీయమవుతున్నాయి.