Begin typing your search above and press return to search.

బిజినెస్ లో 'బాబా'గిరీ

By:  Tupaki Desk   |   25 Nov 2015 11:30 AM GMT
బిజినెస్ లో బాబాగిరీ
X
దాదాగిరీ - గూండాగిరీలా దేశంలో బాబాగిరీ కూడా ఎక్కువైపోతోంది. బాబాగిరీ ఈనాటిది కాకున్నా ఇటీవల కాలంలో ప్రజలు కూడా బాబాగిరీని బాగా కోరుకుంటూ వారి ఉత్పత్తులు - వారి బోధనలు - వారి విన్యాసాలకు ప్రయారిటీ ఇస్తుండడం.. వారిని ఫాలో కావడం ఫ్యాషన్ గా భావిస్తుండడంతో బాబాగిరీ పెరిగిపోయింది. కొందరు బాబాలైతే ప్రార్థనలు - కార్యక్రమాలు - బోధనలు - ఆరోగ్య ఉత్పత్తుల పేరిట వేల కోట్ల వ్యాపారం చేస్తూ కార్పొరేట్ కంపెనీలనే తొడగొట్టి సవాల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాబాలు - వారి వ్యాపార సామ్రాజ్యాలు - ఆస్తిపాస్తులు చూస్తే ఆశ్చర్యంకలగక మానదు.

తమకున్న ఫాలోయింగ్ ను - ఆదరణను - భక్తులను అడ్డంపెట్టుకుని డబ్బు సంపాదించడంలో బాబా రాందేవ్ మిగతా గురువులు - బాబాలకు కూడా గురువైపోయారు. ఆయనకు చెందిన పతంజలి ఆయుర్వేద సంస్థ ఉత్పత్తులు అన్నీ ఇన్నీ కావు. ఆహార - నిత్యావసర - సౌందర్య ఉత్పత్తుల విభాగంలో పతంజలి కార్పొరేట్ సంస్థలకు పోటీ ఇస్తుంది. ఎక్కడికక్కడ పతంజలి స్టోర్లు ఉంటున్నాయి. అంతేకాదు, మాల్స్ లో పతంజలి ఉత్పత్తులకు ప్రత్యేక విభాగం ఉంటోంది. ఆ స్థాయిలో ఉంది ఆయన వ్యాపారం. ఆయుర్వేద ఉత్తత్తుల తయారీలో రాందేవ్ బాబా సంస్థ పతంజలి పెద్ద ఎత్తున ఎర్రచందనాన్ని ఉపయోగిస్తోంది. ఏపీ గవర్నమెంటు వేలం వేసి ఎర్రచందనంలో మూడొంతులు రాందేవ్ బాబాయే కొన్నారంటే ఆయన వ్యాపారం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

మరో ప్రముఖ గురువు ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ కూడా 2003 నుంచి ఈ వ్యాపారంలో ఉన్నారు. శ్రీశ్రీ ఆయుర్వేద పేరుతో ఆయన ఆహార - సౌందర్య - ఆరోగ్యం ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. సత్వ స్టోర్ పేరుతో ఆన్ లైన్లో విక్రయిస్తున్నారు. అందులో దుస్తులు - హస్తకళల ఉత్పత్తులూ ఉన్నాయి. 2017 సరికి దేశంలో వీరు 2500 స్టోర్లు ఏర్పాటు చేయాలనుకుంటున్నారు.

అరబిందో ఆశ్రమంతో సంబంధమేమీ లేకపోయినా అరబిందుని స్ఫూర్తితో అంటూ అరోవిల్లా ఆన్ లైన్ స్టోర్ ఏర్పడింది. ఇందులో 42 విభాగాలకు చెందిన 2500 ఉత్పత్తులు అమ్మాకానికి ఉన్నాయి. వీరి కష్టమర్లలో 40 శాతం విదేశీయులే.

సద్గురు జగ్గీ వాసుదేవ్ కూడా తన ఇషా ఫౌండేషన్ పేరుతోనే ఇషా బిజినెస్ ప్రయివేట్ లిమిటెడ్ స్థాపించి ఆధ్యాత్మిక సామగ్రి - ఆహార - ఆరోగ్య ఉత్పత్తులు విక్రయిస్తున్నారు. కేరళకు చెందిన మాతా అమృతానందమయి అమృతా లైఫ్ పేరుతో ఆయుర్వేద - పర్యావరణ హిత ఉత్పత్తులను అందుబాటులో ఉంచింది.

వీరంతా ఒక తరహాలో వెళ్లగా మరికొందరు ఇంకా ముందుకెళ్తున్నారు. కేరళలోని శాంతిగిరి ఆశ్రమం ఏకంగా రియల్ ఎస్టేట్ - కనస్ట్రక్షన్ - వాహనాల బాడీ బిల్డింగ్ - దుస్తుల తయారీ - కొబ్బరి పీచుతో ఉత్పత్తులను తయారచేస్తూ పారిశ్రామికంగా ఎదుగుతోంది.

మరోవైపు ఆధ్యాత్మిక గురువు గుర్మీత్ రాం రహీం సింగ్ సినిమా నిర్మాణంలో అడుగుపెట్టారు. ఎంఎస్ జీ పేరుతో ఆయన రెండు సినిమాలు తీసి తానే నటించారు. ఎంఎస్ జీ పార్ట్ 2 సినిమా నెల రోజుల్లో రూ.395 కోట్లు వసూలు చేయడం విశేషం.