Begin typing your search above and press return to search.

చ‌చ్చిపోయినా కూడా సాయం చేయ‌రా..?

By:  Tupaki Desk   |   27 Oct 2016 2:44 PM GMT
చ‌చ్చిపోయినా కూడా సాయం చేయ‌రా..?
X
ఒక కాకి చ‌నిపోతే వంద కాకులు గమ్మిగూడుతాయి. అక్క‌డ చూడాల్సింది ఐక‌మ‌త్యం మాత్రమే కాదు... స్పందించే గుణం! తోటివారికి క‌ష్టం వ‌స్తే క‌రిగే ల‌క్ష‌ణం కాకికి ఉన్న‌పాటి కూడా మ‌నిషిలో లేదా..? చావుకు మించిన క‌ష్టం ఉండ‌దు! కానీ, అలాంటి సంద‌ర్భంలో కూడా స్పందించ‌క‌పోతే ‘మనిషి’ అనే మాట‌కు అర్థం ఉంటుందా! అలాంటి ‘అర్థంలేని త‌నం’ గురించి మ‌రోసారి చెప్పుకోవాల్సిన దుస్థితి వ‌చ్చింది. అదే రాష్ట్రం... అదే మ‌నుషులు.. అదే తీరు... అవే బండల‌ గుండెలు.. ఏం మార‌లేదు! ఒక గిరిజ‌న మ‌హిళ మ‌ర‌ణిస్తే అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించేందుకు ఏ ఒక్క‌రూ ముందుకు రాలేదు. ‘సాయం చేయండి నాయనా బాబూ’ అని నెత్తీనోరూ బాదుకుని అర్ధించినా కూడా ఆ గ్రామ ప్ర‌జ‌లు స్పందించ‌లేదు. క‌ల‌హండి ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న తాజాగా వెలుగులోకి వ‌చ్చింది.

కొక్సారా ప్రాంతంలోని మ‌హిమా పంచాయ‌తీ ఉంది. ఆ గ్రామంలో సావిత్రి జువాయిడ్ అనే మ‌హిళ ఇటీవ‌ల మ‌ర‌ణించింది. అయితే, ఆమెకు అంత్య‌క్రియ‌లు చేసేందుకు గ్రామంలోని ఏ ఒక్క‌రూ ముందుకు రాలేదు. ఇంత‌కీ, ఆమె బ‌తికుండ‌గా చేసిన త‌ప్పు ఏంటంటే... వేరే కుల‌స్థుడ‌ని వివాహం చేసుకోవ‌డం! స‌వ‌ర కులానికి చెందిన సావిత్రి, గౌడ కుల‌స్థుడిని వివాహం చేసుకుంది. దీంతో గ్రామ పెద్ద‌లు అప్పట్లో ఆగ్ర‌హించారు. అన్య‌కుల‌స్థుల‌ను వివాహం చేసుకున్నార‌న్న నేరంతో ఈ ఇద్ద‌రినీ గ్రామం నుంచి వెలేశారు. అయితే, ఆమె భ‌ర్త ఇటీవ‌లే తీవ్ర అనారోగ్యంతో మ‌ర‌ణించాడు. దాంతో సావిత్రి మ‌న‌స్థాపానికి గురైంది. ఆ బాధ‌తోనే మంగ‌ళ‌వారం నాడు సావిత్రి కూడా భ‌ర్త ద‌గ్గ‌ర‌కి వెళ్లిపోయింది.

ఆమెకి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించేందుకు బంధువులు ప్ర‌య‌త్నించారు. మృత‌దేహాన్ని శ్మ‌శాన వాటిక వ‌ర‌కూ తీసుకెళ్లేందుకు ఏ ఒక్క‌రూ సాయం చేయ‌లేదు. దీంతో వేరే దిక్కు లేక‌... మంచానికి వెద‌రు బొంగులు క‌ట్టి, దానిపై మృత‌దేహాన్ని పెట్టి రోడ్డుపై ఈడ్చుకెళ్లాల్సి వ‌చ్చింది. ఈ అంతిమ‌యాత్ర‌ను చూసిన కొంత‌మంది వెంట‌నే జిల్లా క‌లెక్ట‌రుకు ఫోన్ చేసి, విష‌యం తెలిపారు. ఆయ‌న స్పందించి రూ. 2000 ఇచ్చి, సాయం కోసం కొంత‌మందిని పంపించారు. ఒడిశా గిరిజ‌న ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న ఇప్పుడు వెలుగులోకి వ‌చ్చింది! అదే రాష్ట్రంలో భార్య‌ను భుజాన వేసుకుని మోసిన భ‌ర్త ఘ‌ట‌న ఈ మ‌ధ్య వెలుగులోకి వ‌చ్చి ఎంత క‌న్నీరు పెట్టించిన సంగ‌తి తెలిసిందే. ఆ హృద‌య విదార‌క స‌న్నివేశం మ‌ర‌చిపోకుండానే... ఇదిగో ఈ ఘ‌ట‌న మ‌ళ్లీ చోటుచేసుకుంది. క‌రువైపోతున్న మాన‌వత్వానికీ, అంత‌రించిపోతున్న సాయ‌ప‌డే తత్వానికి మ‌రో మౌన సాక్ష్యం ఈ ఘ‌ట‌న‌.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/