ప్రపంచ మీడియాను పూల్ చేసేశారు

Tue Apr 18 2017 12:30:22 GMT+0530 (IST)

ఒక కథనం ప్రచురితం కావాలంటే ఎంతో మదింపు.. మరెంతో పరిశోధన జరిగిన తర్వాతే బయటకు వస్తుంది. మారిన పరిస్థితులతో అలాంటివి దాదాపుగా తగ్గిపోయాయి. పరుగు పందెం ప్రపంచ వ్యాప్తంగా మీడియాను ఆవహించింది. గతంలో ఉన్న ప్రింట్.. టీవీ ఫార్మట్లకు డిజిటల్ ఫార్మాట్ తోడు కావటానికి.. దానికి సోషల్ మీడియా ఒకటి తోడు కావటంతో.. మీడియాలో మార్పులు సమూలంగా మారిపోతున్నాయి. ఏ విషయం కూడా ఎక్కువసేపు ఉండలేనిది. ఏదైనా అంశం వైరల్ అయితే.. వివిధ మార్గాల్లో ప్రపంచ ప్రజల దృష్టికి వాయువేగంతో వెళ్లిపోతోంది. ఈ హడావుడిలో కొన్నిసార్లు ఊహించని రీతిలో తప్పులు జరుగుతుంటాయి.

తాజాగా అలాంటి తప్పే చోటు చేసుకుంది. ఒక కథనాన్ని ప్రపంచ ప్రఖ్యాత మీడియా సంస్థలు మొదలు.. ఓ మోస్తరు మీడియా సంస్థల వరకూ అందరూ తప్పులో కాలేసిన వైనం తాజాగా చోటు చేసుకుంది. ఒక జంట పిల్లలు పుట్టకపోవటంతో డాక్టర్ల దగ్గరకు వెళ్లారని.. చివరకు అక్కడి డాక్టర్‌కు ఏదో సందేహం వచ్చి డీఎన్ ఏ పరీక్ష నిర్వహించారని.. అనంతరం వీరిద్దరూ కవలలుగా తేల్చినట్లుగా ఒక చిత్ర విచిత్రమైన వార్త ఒకటి ఆదివారం అంతర్జాతీయ మీడియాలో దర్శనమిచ్చింది.

అది అంతకంతకూ వైరల్ అయి.. సోమవారం నాటికి అంతర్జాతీయంగా.. జాతీయంగా.. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా అన్ని మీడియా సంస్థలు ఈ వార్తను కవర్ చేశాయి. అయితే.. ఈ వార్త మీద కొన్ని సందేహాలతో ప్రఖ్యాత మీడియా సంస్థ ది సన్ రంగంలోకి దిగింది. ఈ కథనానికి సంబంధించి మరిన్ని వివరాల కోసం ప్రయత్నించగా.. అలాంటివేమీ లభించకపోవటంతో సందేహంతో క్రాస్ చెక్ చేసింది. దీంతో.. ఇదంతా ఫేక్ న్యూస్ గా తేలిపోయింది.

అసలీ వార్త ఎక్కడ నుంచి మొదలైందన్న విషయంపై ఆరా తీసిన సన్.. మిస్సిస్సీప్పీ హెరాల్డ్ అనే బుల్లి వెబ్ సైట్ ఒకటి ఈ కాకమ్మ స్టోరీని వండేసినట్లుగా తేలింది. కొన్నినెలల క్రితమే దీన్ని ప్రారంభించారని.. దీని సమాచారానికి విశ్వసనీయత లేదని తేల్చారు. ఈ వెబ్ సైట్ కి చట్టబద్ధత లేదని.. ఇది బోగస్ సైటుగా తేల్చారు. ఒక చిల్లర సైట్ అల్లిన కథనం.. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా అందరూ బుక్ అయ్యేలా చేసింది. ఈ బోగస్ కథనాన్ని ప్రచురించిన మీడియా సంస్థల్లో బాధ్యత కలిగిన ప్రతి మీడియా సంస్థ.. తాజాగా వెలుగులోకి వచ్చిన అసలు విషయాన్ని వెల్లడించి.. తన పత్రికా ధర్మాన్ని పాటించింది. మరికొన్ని సంస్థలు మాత్రం.. ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా వదిలేశాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/