Begin typing your search above and press return to search.

స్నాప్ చాట్ బ‌లుపును అమ్ముతున్న ఫేస్ బుక్‌

By:  Tupaki Desk   |   19 April 2017 9:11 AM GMT
స్నాప్ చాట్ బ‌లుపును అమ్ముతున్న ఫేస్ బుక్‌
X
వ్యాపారం గ‌తంలో మాదిరి లేదు. ఇప్పుడు మొత్తంగా మారిపోయింది. గ‌తంలో బిజినెస్ జెయింట్స్ ఎవ‌రూ ఒక‌రి మీద ఒక‌రు వ్యాఖ్య‌లు చేసుకునే వారు కాదు. ఇప్పుడు అలాంటి ప‌రిస్థితి లేదు. అవ‌కాశం వ‌స్తే.. ఒక పంచ్ ఇవ్వ‌టానికి సైతం వెనుకాడ‌టం లేదు. తాజాగా ఫేస్ బుక్ సీఈవో జుక‌ర్ బ‌ర్గ్ వ్యాఖ్య‌లు చూస్తే ఈ విషయం అర్థ‌మ‌వుతుంది.

స్నాప్ చాట్ సీఈవో బ‌లుపుతో ఇండియా లాంటి దేశాలు త‌మ‌కు అవ‌సరం లేద‌ని.. పూర్ కంట్రీగా చేసిన వ్యాఖ్య‌లు దుమారంగా మారిన సంగ‌తి తెలిసిందే. స్నాప్ చాట్ సీఈవో స్పీగ‌ల్ బ‌లుపు మాట‌ల‌కు ఆ కంపెనీ భారీ మూల్యాన్నే చెల్లించాల్సి వ‌చ్చింది. పొగ‌రు త‌గ్గించుకొని భార‌తీయుల్ని ప్ర‌స‌న్నం చేసుకునే ప‌నిలో ప‌డిన వైనం ఉండ‌గా.. ఆ సంద‌ర్భాన్ని త‌న‌కు అనువుగా మార్చుకునే ప్ర‌య‌త్నం చేశారు ఫేస్ బుక్ సీఈవో జుక‌ర్ బ‌ర్గ్‌.

తాజాగా శాన్ జోస్‌ లో జ‌రిగిన ఫేస్ బుక్ ఎఫ్‌8 వార్షిక అభివృద్ధి స‌మావేశంలో మాట్లాడిన సంద‌ర్భంగా త‌మ ఫేస్ బుక్ కేవ‌లం హైఎండ్ వారి కోసం మాత్ర‌మే కాదు.. అంద‌రి కోసం అంటూ స్నాప్ చాట్ బ‌లుపును మ‌రోసారి గుర్తు చేసే ప్ర‌య‌త్నం చేశారు. తమ‌కు స్నాప్ చాట్ మాదిరి త‌ల‌పొగ‌రు లేద‌న్న విష‌యాన్ని చెప్ప‌టంతో పాటు.. గాయ‌ప‌డిన హృద‌యాల‌కు ద‌న్నుగా నిలిచిన భావ‌న‌తో.. అలాంటి వారి మ‌న‌సుల్ని గెలుచుకునే ప్ర‌య‌త్నం చేశార‌ని చెప్పాలి.

టెక్నాల‌జీ అన్న‌ది కేవ‌లం ఉన్న‌త స్థాయిలో ఉన్న వారికి మాత్ర‌మే కాద‌ని.. స‌మాజంలో ఉన్న వారంద‌రికీ ఉప‌యోగ‌ప‌డాల‌ని చెప్పిన జుక‌ర్‌.. ఫేస్ బుక్ లైట్ లాంటి వాటి మీద తాము దృష్టి పెట్టిన‌ట్లుగా వెల్ల‌డించారు. మొత్తానికి స్నాప్ చాట్ బ‌లుపు మాట‌ల్ని త‌న వ్యాపారాన్ని మ‌రింత పెంచుకునే ముడిస‌రుకుగా వాడుకున్న జుక‌ర్ తెలివిని అభినందించాల్సిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/