Begin typing your search above and press return to search.

జ‌నాల జేబుల‌కు గురి పెట్టిన ఫేస్ బుక్!

By:  Tupaki Desk   |   10 April 2018 5:15 AM GMT
జ‌నాల జేబుల‌కు గురి పెట్టిన ఫేస్ బుక్!
X
ఉచితంగా ఏమిచ్చినా తీసుకోవ‌టం మామూలే. జ‌నాల‌కున్న ఈ బ‌ల‌హీన‌త‌ను కొన్ని కార్పొరేట్ కంపెనీలు చాలా తెలివిగా వాడేస్తుంటాయి. త‌మ ఉత్ప‌త్తుల‌ను ఉచితంగా అందించ‌ట‌మో లేదంటే కారుచౌక‌గా ఇస్తూ.. మొద‌ట్లో ఆక‌ర్షించి.. బాగా అల‌వాటు ప‌డిపోయాక ఒక క్ర‌మ‌ప‌ద్ద‌తిలో డ‌బ్బులు లాగేసే టెక్నిక్ ప్ర‌యోగిస్తుంటారు.

ఇంచుమించు ఇదే రీతిలో ఉంది ఫేస్ బుక్ య‌వ్వారం. ఎవ‌రి మానాన వారు బ‌తుకుతున్న ప్ర‌పంచ ప్ర‌జ‌ల‌కు స‌రికొత్త అనుభూతిని అందించిన ఫేస్ బుక్ కు చాలా త‌క్కువ వ్య‌వ‌ధిలోనే జనాలు అల‌వాటు ప‌డిపోయారు. ప్ర‌పంచం మొత్తం ఓ చిన్న కుగ్రామంగా మారిపోయి.. ఎక్క‌డెక్క‌డి వారో.. ముక్కు ముఖం తెలీని వారిని క‌లిపేసే ఫేస్ బుక్ జ‌నాల‌కు కిరాకు పుట్టించ‌ట‌మేకాదు.. రోజువారీ జీవితంలో భాగ‌మైంది. తిండి కాస్త లేట్ అయినా ఫ‌ర్లేదు కానీ.. ఫేస్ బుక్ వాల్ లో అప్డేట్ చూసుకోవ‌టం మాత్రం లేట్ చేయ‌లేని ప‌రిస్థితిని తీసుకొచ్చేసింది.

ఇప్పుడు చావుక‌బురు చ‌ల్ల‌గా చెప్పుకొచ్చింది. ప్ర‌పంచంలో ఉచితంగా ఏదీ రాద‌న్న సూత్రానికి విరుద్దంగా ప్ర‌పంచ ప్ర‌జ‌ల్ని క‌లిపేసే ఫేస్ బుక్ కు ప్ర‌యోజ‌నం ఏమిట‌న్న మాట‌కు చాలామంది చాలా ఆదాయ‌వ‌న‌రుల్ని చూపించినా.. వ్య‌క్తిగ‌త డేటా ఫేస్ బుక్ ప్ర‌ధాన ఆయుధ‌మ‌ని.. దాంతో చాలానే మేజిక్ లు చేస్తుంద‌న్న విష‌యం ఈ మ‌ధ్య‌నే బ‌య‌ట‌కు వ‌చ్చింది.

అరే.. ఫేస్ బుక్ ను న‌మ్మి అందులో స‌మాచార‌మంతా పెట్టేస్తున్నామే? జుక‌ర్ బ‌ర్గ్‌.. నిన్ను న‌మ్మినందుకు ఇలా చేస్తావా? అంటూ కొంద‌రు క‌స్సుమంటున్న ప‌రిస్థితి. ఫేస్ బుక్ యూజ‌ర్ల వ్య‌క్తిగ‌త డేటా ప‌క్క‌దారి ప‌ట్టిన వైనంలో ఫేస్ బుక్ ను అంద‌రూ వేలెత్తి చూపిస్తున్న వేళ‌.. జుక‌ర్ సైతం క్ష‌మాప‌ణ చెప్పాల్సి వ‌చ్చింది.

త‌న చేత సారీ చెప్పించిన వారికి అంత‌కంతా చూడాల‌ని జుక‌ర్ అనుకుంటున్నారేమో కానీ.. ఊహించ‌ని రీతిలో షాకింగ్ మాట‌ను వెల్ల‌డించింది ఫేస్ బుక్‌. తాజాగా ఆ సంస్థ చీఫ్ ఆప‌రేటింగ్ ఆఫీస‌ర్ షెరిల్ శాండ్ బ‌ర్గ్ మాట్లాడుతూ.. ఫేస్ బుక్ లో వ్య‌క్తిగ‌త గోప్య‌త కాపాడుకోవాల‌నుకునే వారికి ఒక ప్ర‌త్యామ్నాయం కావాలంటే అందుకు వారు కొంత మొత్తాన్ని క‌ట్టాల్సి ఉంటుంని చెప్పారు.

సాధార‌ణంగా ఫేస్ బుక్ యూజ‌ర్ల‌కు ప్ర‌క‌ట‌న‌లు క‌నిపిస్తూ ఉంటాయి. వాటితో ఫేస్ బుక్ భారీగా ఆర్జిస్తుంటుంది. అయితే.. వ్య‌క్తిగ‌త డేటాను వేరే కంపెనీల‌కు ఫేస్ బుక్ విక్ర‌యిస్తుంద‌న్న ఆరోప‌ణ‌ల్ని కొట్టిపారేసిన షెరిల్‌.. తాము డేటాను ఏ కంపెనీకి అమ్మ‌టం లేద‌ని.. అడ్వ‌ర్ట‌యిజ‌ర్ల‌కు యూజ‌ర్ల వ్య‌క్తిగ‌త డేటా ఇస్తున్నామ‌న్న ఆరోప‌ణ ఎంత‌మాత్రం నిజం కాద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌నో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశారు. వినియోగ‌దారులు త‌మ వ్య‌క్తిగ‌త గోప్య‌త కాపాడుకోవాల‌ని భావిస్తే.. కొంత మొత్తాన్ని ఫేస్ బుక్ కు క‌డితే.. యూజ‌ర్ల వాల్ పై ఎలాంటి యాడ్స్ గోల ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టికి అయితే దీనికి సంబంధించి ఎలాంటి ఛార్జ్ వ‌సూలు చేయ‌న‌ప్ప‌టికీ.. రానున్న రోజుల్లో ఈ చెల్లింపుల ప్ర‌క్రియ తెర మీద‌కు వ‌చ్చినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పాలి. ప్ర‌పంచంలో ఏదీ ఉచితం కాద‌న్న నానుడిని ఫేస్ బుక్ సైతం నిజం చేసినందుకు థ్యాంక్స్ చెప్పాల్సిందే.