Begin typing your search above and press return to search.

ఫేస్ బుక్ ఇండియా చీఫ్ ను బదిలీ చేశారు?

By:  Tupaki Desk   |   13 Feb 2016 6:56 AM GMT
ఫేస్ బుక్ ఇండియా చీఫ్ ను బదిలీ చేశారు?
X
ఫ్రీబేసిక్స్ దెబ్బకు ఫేస్ బుక్ ఇండియా చీఫ్ బుక్కయ్యారు. ఇండియన్ ఇంటర్నెట్ ను తన గుప్పిట్లో పెట్టుకునేందుకు ప్రతిపాదించిన ఫ్రీ బేసిక్స్ కు ట్రాయ్ నో చెప్పడంతో ఫేస్ బుక్ షాకైన సంగతి తెలిసిందే. ఆ దెబ్బతో రగిలిపోతున్న ఫేస్ బుక్ అధినేత జుకర్ బర్గ్ తన సంస్థలోని కీలక ఇండియన్ ఉద్యోగులపై కసి తీర్చుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. అందుకు తాజాగా పరిణామాలే ఉదాహరణ. ఫేస్ బుక్ ఇండియా చీఫ్ గా పనిచేస్తున్న కార్తీకరెడ్డితో ఆ పదవికి రాజీనామా చేయించి ఆమెను ఫేస్ బుక్ ప్రధాన కార్యాలయానికి సరెండర్ చేశారు. సంస్థకు చెందిన కీలక ప్రాజెక్టు ఫ్రీబేసిక్స్ ను ఇండియాలో ఇంప్లిమెంటయ్యేలా చేయలేకపోయారన్న కారణంతోనే ఆమెపై వేటువేసినట్లు చెబుతున్నారు.

నిజానికి ఇండియాలో ఫేస్ బుక్ విస్తరించడంతో కార్తీకరెడ్డి కీలక పాత్ర పోషించారు. వేలల్లో ఉన్న ఫేస్ బుక్ ఖాతాదారుల సంఖ్య లక్షలకు చేరేలా ఆమె ఎన్నో మార్పులను తీసుకొచ్చారు. ఫేస్ బుక్ ను ఇండియాలోని మూలమూలకూ చేరేలా చేశారామె. అయితే... ఫ్రీ బేసిక్స్ కు ప్రభుత్వం నో చెప్పడంతో జుకర్ బర్గ్ ఆమెపై వేటేశారు.

అయితే... కార్తీక రెడ్డి విషయంలో మరో వాదనా వినిపిస్తోంది. ఎంతో సామర్థ్యం ఉన్న కార్తీకను ఇండియాలో ఫేస్ బుక్ విస్తరణ కోసమే ఇక్కడికి తెచ్చారని.... ఆ పని పూర్తవడం... ఫ్రీ బేసిక్స్ కు ఇక మార్గం లేకపోవడంతో ఆమె సేవలను ప్రధాన కార్యాలయంలో ఉపయోగించుకునేందుకు అక్కడికి బదిలీ చేశారన్న వాదనా వినిపిస్తోంది. ఎంతో సత్తా గల కార్తీక అవసరం ఇండియాలో ఇక లేదని... ఆమె ప్రధాన కార్యాలయంలో ఉండాల్సిన అవసరం ఉందని జుకర్ అనుకుంటున్నారట.