ప్రపంచ వ్యాప్తంగా చాలా చోట్ల ఫేస్ బుక్ పని చేయలేదు!

Thu Mar 14 2019 09:10:09 GMT+0530 (IST)

అరచేతిలో సెల్ ఫోన్ రావటం.. దానికి జియో సిమ్ తోడు కావటంతో డేటా వినియోగం ఏ రేంజ్లో పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఏ మాత్రం ఖాళీ దొరికినా వీడియోలు చూడటం.. వాట్సాప్ అప్డేట్ చేసుకోవటం.. సోషల్ మీడియాల్ని ఫాలో కావటం ఒక అలవాటుగా మారింది. పక్కనున్నోడితో మాట్లాడే దాని కంటే చేతిలో ఉన్న ఫోన్ ను చెక్ చేసుకోవటం అంతకంతకూ పెరిగిపోతోంది.ఇంతలా అలవాటైన ప్రాణానికి సోషల్ మీడియా సరిగా పని చేయకుంటే పరిస్థితి ఏమిటి?  తాజాగా అలాంటి అనుభవమే ప్రపంచ వ్యాప్తంగా పలువురికి ఎదురైంది.బుధవారం రాత్రి 9 గంటల తర్వాత ప్రపంచ వ్యాప్తంగా చాలామందికి ఫేస్ బుక్ పని చేయలేదు. ఇలాంటి పరిస్థితి రాత్రి పదకొండు గంటల ప్రాంతం వరకూ ఉన్నట్లు చెబుతున్నారు.

దీంతో.. ఫేస్ బుక్ యూజర్లకు ఇబ్బందిని కలుగజేసింది. సాంకేతిక సమస్య అని ఫేస్ బుక్ చెబుతున్నా.. ఎఫ్ బీపై టెక్నికల్ దాడి ఏమైనా జరిగిందా? అన్నది అనుమానంగా మారింది. ఈ విషయానికి బలం చేకూరేలా ఫేస్ బుక్ తాజా ట్వీట్ ఇదే విషయాన్ని చెబుతోంది. సాంకేతిక సమస్యల కారణంతో ఫేస్ బుక్ సేవలకు అంతరాయం ఏర్పడినట్లుగా పేర్కొన్నారు.

ఫేస్ బుక్ పని చేయని విషయాన్ని ఆ సంస్థ.. తనకు పోటీ అయిన మరో సోషల్ నెట్ వర్క్ సంస్థ ట్విట్టర్ ద్వారా వెల్లడించటం ఆసక్తికర అంశంగా చెప్పాలి. ఫేస్ బుక్ పని చేయకపోవటానికి కారణం ఫలానా అని పేర్కొనకపోయినా.. పని చేయటం లేదన్న విషయాన్ని మాత్రం ఎఫ్ బి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రపంచానికి సమాచారాన్ని అందించింది.