Begin typing your search above and press return to search.

ఢిల్లీలో వేడెక్కించిన న‌లుగురు సీఎంల పాద‌యాత్ర‌

By:  Tupaki Desk   |   17 Jun 2018 4:51 AM GMT
ఢిల్లీలో వేడెక్కించిన న‌లుగురు సీఎంల పాద‌యాత్ర‌
X
దేశ రాజ‌ధానిలో అనూహ్య ఘ‌ట‌న చోటు చేసుకుంది. రాజ‌కీయంగా ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో చోటు చేసుకున్న ఈ ఉదంతంతో రాజ‌కీయ వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా మారిపోయింది. గ‌డిచిన ఆరు రోజులుగా దీక్ష చేస్తున్న ఢిల్లీ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్‌కు మ‌ద్ద‌తుగా న‌లుగురు ముఖ్యమంత్రులు (ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా.. క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి.. కేర‌ళ ముఖ్య‌మంత్రి విజ‌య‌న్‌) ఏపీ భ‌వ‌న్ నుంచి పాద‌యాత్ర‌గా ఢిల్లీ లెఫ్టెనెంట్ గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యానికి వెళ్లి క‌ల‌క‌లం రేపారు.

ప్ర‌జ‌ల చేత ఎన్నికైనా ప్ర‌భుత్వ‌మే అయినా.. అధికారాలు ఏమీ లేని వైనంపై కేంద్రంపై ఒంట‌రిగా పోరాడుతున్న కేజ్రీవాల్‌కు ద‌న్నుగా నిలుస్తూ.. ఆయ‌న‌కు త‌మ సంపూర్ణ మద్ద‌తు ఉందంటూ నలుగురు ముఖ్య‌మంత్రులు చేసిన‌ పాద‌యాత్రతో ఈ వ్య‌వ‌హారం అనూహ్య మ‌లుపు తిరిగిన‌ట్లైంది. కేజ్రీవాల్‌కు సంఘీభావం తెలిపేందుకే తాము పాద‌యాత్ర‌ను చేప‌ట్టిన‌ట్లుగా వారు చెబుతున్నారు.

వీరి పాద‌యాత్ర విష‌యంలో ఢిల్లీ లెఫ్టెనెంట్ జ‌న‌ర‌ల్ అనుస‌రించిన వైనంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. త‌న‌ను క‌లిసేందుకు న‌లుగురు ముఖ్య‌మంత్రులు అపాయింట్ మెంట్ కోరితే నో అనేశారు. ముఖ్య‌మంత్రులు త‌న నివాసం ఎదుట‌కు చేరుకోకుండా అడ్డుకోవ‌టంతో పాటు.. లెఫ్టెనెంట్‌ గ‌వ‌ర్న‌ర్ నివాసం చుట్టూ భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేయ‌టం హాట్ టాపిక్ గా మారింది.

ఐఏఎస్ అధికారుల‌పై ఢిల్లీ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు దాడి చేశార‌న్న ఆరోప‌ణ‌లు చేస్తూ.. మూడు నెల‌లుగా ఢిల్లీలోని ఐఏఎస్ లు కేజ్రీవాల్ స‌ర్కారుకు స‌హాయ నిరాక‌ర‌ణ చేస్తున్నారు. ఇదంతా మోడీషాల డైరెక్ష‌న్లో జ‌రుగుతున్న వ్య‌వ‌హారంగా అధికార‌పార్టీ ఆరోపిస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాలంటూ సీఎం కేజ్రీవాల్ నాలుగు రోజుల క్రితం రాత్రి వేళ లెఫ్టెనెంట్ గ‌వ‌ర్న‌ర్ ఇంటికి వెళ్లి.. ఆయ‌న్ను క‌లుసుకునే ప్ర‌య‌త్నం చేయ‌టం.. ఆయ‌న నుంచి అనుమ‌తి రాక‌పోవ‌టంతో.. అక్క‌డే త‌న నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌ను నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే.

లెఫ్ట‌నెంట్ గ‌వ‌ర్న‌ర్ త‌మ‌కు అపాయింట్ మెంట్ ఇచ్చే వ‌ర‌కూ క‌దిలేది లేదంటూ భీష్మించుకున్న ఢిల్లీ ముఖ్య‌మంత్రికి సంఘీభావం తెలిపేందుకు న‌లుగురు ముఖ్య‌మంత్రులు ముందుకు వ‌చ్చారు. ఇప్ప‌టికే కేజ్రీవాల్ చేస్తున్న దీక్ష దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తూ.. అంద‌రి దృష్టిని విప‌రీతంగా ఆక‌ర్షిస్తోంది. ఇంత జ‌రుగుతున్నా కేంద్రం కానీ.. లెఫ్టెనెంట్ జ‌న‌ర‌ల్ కానీ స్పందించ‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం.

ఇదిలా ఉండ‌గా.. నీతి ఆయోగ్ స‌మావేశానికి హాజ‌ర‌య్యేందుకు వ‌చ్చిన ముఖ్యమంత్రుల్లో.. న‌లుగురు సీఎంలు కేజ్రీవాల్ ను ద‌న్నుగా నిలవాల‌ని నిర్ణ‌యించారు. మోడీని విప‌రీతంగా వ్య‌తిరేకించే వీరు.. కేజ్రీకి ద‌న్నుగా నిలిచే నిర్ణ‌యం తీసుకోవ‌టం.. ఏపీ భ‌వ‌న్ నుంచి కేజ్రీవాల్ ఇంటి మీదుగా పాద‌యాత్ర‌ను చేస్తూ లెఫ్టెనెంట్ గ‌వ‌ర్న‌ర్ నివాసం వ‌ద్ద‌కు చేరుకున్నారు. మార్గ‌మ‌ధ్యంలో సీఎం స‌తీమ‌ణిని పరామ‌ర్శించిన వారు కేంద్రం తీరును.. లెప్టెనెంట్ గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌హార‌శైలిని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టే ప్ర‌య‌త్నం చేశారు. ఇదిలా ఉండ‌గా.. న‌లుగురు ముఖ్య‌మంత్రులు త‌న‌ను క‌లిసేందుకు అనుమ‌తి ఇవ్వాలంటూ లెఫ్టెనెంట్ గ‌వ‌ర్న‌ర్ కు రాసిన లేఖ‌ను ఆయ‌న డ‌స్ట్ బిన్ లో వేసిన‌ట్లుగా చెబుతున్నారు. ఈ తీరు ప్ర‌జ‌ల్లో మోడీషాల మీద తీవ్ర‌మైన ప్ర‌భావాన్ని చూపుతుంద‌ని చెబుతున్నారు.

ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రి చేస్తున్న నిర‌స‌న‌కు నాలుగు రాష్ట్రాల‌కు చెందిన ముఖ్య‌మంత్రులు మ‌ద్ద‌తు తెలుపుతూ ముందుకు రావ‌టం ఒక ఎత్తు అయితే.. ఇష్యూను ప‌రిష్క‌రించే దిశ‌గా జ‌రిగిన ప్ర‌య‌త్నాన్ని మ‌రింత ముదిరేలా వ్య‌వ‌హ‌రించిన లెఫ్టెనెంట్ గ‌వ‌ర్న‌ర్ తీరును ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. అదే స‌మ‌యంలో.. మోడీ తీరుపైనా వేలెత్తి చూపుతున్న ప‌రిస్థితి. అనూహ్య నిర్ణ‌యాన్ని తీసుకున్న న‌లుగురు ముఖ్య‌మంత్రులు.. మ‌రింకేమీ చేస్తారోన‌న్న ఆస‌క్తి ఇప్పుడు వ్య‌క్త‌మ‌వుతోంది.