Begin typing your search above and press return to search.

ఫెయిల్.. స‌క్సెస్ రెండూ ఎగ్జిట్ పోల్స్ సొంతం!

By:  Tupaki Desk   |   18 May 2019 5:00 AM GMT
ఫెయిల్.. స‌క్సెస్ రెండూ ఎగ్జిట్ పోల్స్ సొంతం!
X
మ‌రో రెండు రోజుల్లో ఎగ్జిట్ పోల్స్ విడుద‌ల కానున్నాయి. ఆదివారం సాయంత్రం 5 గంట‌ల‌కు ఏడో విడ‌త పోలింగ్ పూర్తి అయిన కొద్ది క్ష‌ణాల‌కే ఎగ్జిట్ పోల్స్ విడుద‌ల‌కు అన్ని ఏర్పాట్లు జ‌రిగిపోయాయి. ఈ నేప‌థ్యంలో ఓట్ల లెక్కింపున‌కు నాలుగు రోజుల ముందే విడుద‌ల‌య్యే అంచ‌నాలు ఎంత‌వ‌ర‌కు నిజమ‌వుతాయ‌న్న‌ది అస‌లు ప్ర‌శ్న‌.

2014 నుంచి 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల మ‌ధ్య‌లో దేశ వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో జ‌రిగిన ఎన్నిక‌ల వేళ‌.. ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాల్ని చూస్తే.. తాజాగా విడుద‌ల‌య్యే ఎగ్జిట్ పోల్స్ ను ఎంత‌మేర‌కు న‌మ్మొచ్చ‌న్న విష‌యం మీద కాస్తంత క్లారిటీ రావ‌టం ఖాయం.

ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాలు నూటికి నూరుశాతం నిజం కాలేదు. అలా అని వ‌మ్ము కూడా కాలేదు. రాష్ట్రాల ఎన్నికల విష‌యంలోనే కాదు.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల విష‌యంలోనూ ఇదే తీరు క‌నిపించ‌క మాన‌దు. 2004 నుంచి 2014 వ‌ర‌కు జ‌రిగిన మూడు సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల్ని చూస్తే.. గెలుపు అవ‌కాశాల‌పై ఎగ్జిట్ పోల్స్ మిశ్ర‌మ ఫ‌లితాల్నే ఇచ్చింది త‌ప్పించి.. ప‌క్కా ఫ‌లితాన్ని చెప్పిన వైనం క‌నిపించ‌దు.

2017లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను అంచ‌నా వేయ‌టంలో అన్ని మీడియా సంస్థ‌లు ఫెయిల్ అయ్యాయి. బీజేపీకి 251-279 సీట్లు వ‌స్తాయ‌ని ఇండియా టుడే.. సిసిరో.. 289 సీట్లు వ‌స్తాయ‌ని టుడేస్ చాణ‌క్య అంచ‌నాలు వేశాయి. ఈ రెండు మీడియా సంస్థ‌లు వాస్త‌వ ఫ‌లితానికి కాస్త ద‌గ్గ‌ర‌గా ఉన్నాయి. ఆ ఎన్నిక‌ల్లో బీజేపీ ఏకంగా 325 సీట్ల‌ను సొంతం చేసుకుంది.

ఈ ఎన్నిక‌ల వేళ సీఓట‌ర్ 161 సీట్లు.. ఏబీపీ-సీఎస్ డీ ఎస్ చెప్పిన 170 సీట్లు.. న్యూస్ ఎక్స్-ఎంఆర్ సీ చెప్పిన 185 సీట్ల లెక్క‌లు దారుణంగా ఫెయిల్ అయ్యాయి. అదే స‌మ‌యంలో 2015లో జ‌రిగిన బిహార్ ఎన్నిక‌ల్లోనూ ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్ అయ్యాయి. ఆ ఎన్నిక‌ల్లో లల్లూ ప్ర‌సాద్.. నితీశ్ కుమార్ కూట‌మికి అంచ‌నాల‌కు మించిన 178 సీట్లు రాగా.. బీజేపీ కేవ‌లం 58 స్థానాల్నే సొంతం చేసుకోగ‌లిగింది. ఈ ఎన్నిక‌ల్లో అన్ని మీడియా సంస్థ‌లు బీజేపీకి అనుకూలంగా త‌మ ఎగ్జిట్ పోల్స్ ను వెల్ల‌డించాయి. ఎగ్జిట్ పోల్స్ దారుణంగా దెబ్బ తిన్న మ‌రో ఎన్నిక‌ల ఫ‌లితంగా 2015లో జ‌రిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల్ని ప్ర‌స్తావించాలి.

ఈ ఎన్నిక‌ల్లో అన్ని సంస్థ‌లు ఆమ్ ఆద్మీ పార్టీ అత్తెస‌రు సీట్ల‌తో ఆప్ పార్టీ అధిక్యంలో నిలుస్తుంద‌న్న మాటే చెప్పాయి. కానీ.. వాస్త‌వ ఫ‌లితం మాత్రం అందుకు భిన్నంగా ఆమ్ ఆద్మీ పార్టీ 70 స్థానాల‌కు 67 స్థానాల్ని సొంతం చేసుకొని చారిత్ర‌క విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఈ త‌ర‌హా ప్ర‌జాతీర్పును ఏ మీడియా సంస్థ‌.. స‌ర్వే సంస్థ అంచ‌నా వేయ‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం.

ఇటీవ‌ల జ‌రిగిన క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆరు సంస్థ‌లు ఎగ్జిట్ పోల్స్ వెలువ‌రించ‌గా.. మూడు సంస్థ‌లు వెల్ల‌డించిన అంచ‌నాలు మాత్ర‌మే నిజ‌మ‌య్యాయి. గుజ‌రాత్ అసెంబ్లీకి జ‌రిగిన ఎన్నిక‌ల్లోనూ అన్ని ఛాన‌ళ్లు బీజేపీకి క‌నిష్ఠంగా 106 సీట్లు.. గ‌రిష్ఠంగా 135 సీట్లు వ‌స్తాయ‌ని చెబితే..చివ‌ర‌కు బీజేపీకి ద‌క్కింది 99 సీట్లు మాత్ర‌మే కావ‌టం గ‌మ‌నార్హం. కాంగ్రెస్ కు 47-75 మ‌ధ్య వ‌స్తాయ‌న్న అంచ‌నాకు భిన్నంగా 81 సీట్లు సొంతం చేసుకుంది. త‌మిళ‌నాడుకు జ‌రిగిన ఎన్నిక‌ల్లోనూ జ‌య‌ల‌లిత విజ‌యాన్ని అంచ‌నా వేయ‌టంలో ఫెయిల్ అయ్యారు. 2018లో ఛ‌త్తీస్ గ‌ఢ్ ఎన్నిక‌ల్లో ఐదు సంస్థ‌లు ఎగ్జిట్ పోల్స్ నిర్వ‌హించ‌గా.. ఇండియాటుడే-యాక్సిస్ మై ఇండియా స‌ర్వే మాత్ర‌మే వాస్త‌వ ఫ‌లితానికి ద‌గ్గ‌ర‌గా ఉండ‌టం గ‌మ‌నార్హం. మొత్తంగా చెప్పేదేమంటే.. ఎగ్జిట్ ఫ‌లితాలు స‌క్సస్ కావ‌టానికి ఛాన్సులు ఎన్ని ఉన్నాయో.. ఫెయిల్ కావ‌టానికి అంతే అవ‌కాశం ఉంద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు.