Begin typing your search above and press return to search.

ఎర్రబెల్లి మాటల్లో మర్యాద..చేతల్లో చుక్కలు

By:  Tupaki Desk   |   11 Feb 2016 5:31 AM GMT
ఎర్రబెల్లి మాటల్లో మర్యాద..చేతల్లో చుక్కలు
X
రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం.. శాశ్వత మిత్రత్వం అన్నది ఏమీ ఉండదు. ఆ విషయం మరోసారి తేలిపోయింది. సైకిల్ దిగేసి.. కారు ఎక్కేసే విషయంలో తర్జనభర్జనలతో పాటు.. పలుమార్లు రహస్య చర్చలు జరిపిన ఎర్రబెల్లి ఎట్టకేలకు సైకిల్ దిగేసి.. కారు ఎక్కేశారు. ఈక్రమంలో తనను క్షమించాలని.. తెలంగాణలో టీడీపీని ఎంత కాపాడాలన్నా కుదర్లేదని.. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ అంటే ఇప్పటికి అభిమానం.. ప్రేమ ఉన్నాయని పేర్కొన్నారు. తాజాగా విడుదలైన గ్రేటర్.. మొన్న జరిగిన వరంగల్ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత టీడీపీకి మనుగడ లేదని తేలిందని.. 25 ఏళ్ల వయసులో తెలుగుదేశం పార్టీలో చేరి 30 ఏళ్లుగా కొనసాగుతున్నానని.. పార్టీని విడిచి పెట్టటం బాధగా ఉందంటూ సైకిల్ తో తన అనుబంధాన్ని తెంచుకున్న అనంతరం ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు.

భావోద్వేగంతో ఆయనిలా మాట్లాడుతూనే.. చేతల్లో టీడీపీ అధినేత చంద్రబాబుకు చుక్కలు చూపించటం విశేషం. రాజకీయాల్లో మాటలకు.. చేతలకు మధ్య వైరుధ్యం ఉండటం కొత్తేం కాదు. అందుకు తగ్గట్లే ఎర్రబెల్లి తీరు ఉందన్న విషయం మర్చిపోకూడదు. టీఆర్ ఎస్ లో చేరిన కాసేపటికే ఆయన మాట్లాడుతూ.. టీటీడీపీని టీఆర్ ఎస్ లోకి వీలీనం చేస్తున్నట్లు పేర్కొనటం గమనార్హం. ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలకు అర్థం.. అసెంబ్లీలో ఉన్న తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష నేతలంతా టీఆర్ ఎస్ లో కలిసిపోతారని. సాంకేతికంగా చూస్తే.. మెజార్టీ సభ్యులు కానీ పార్టీని మరో పార్టీలోకి విలీనం చేసుకోవాలని కోరితే.. సదరు పార్టీ అధినేత ఓకే అంటే.. సాఫీగా అంతా సాగిపోతోంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్సీల విషయంలోనూ ఇదే తీరులో సాగి.. టీటీడీపీ నేతల్లో ఇద్దరు మినహా మిగిలిన వారంతా గులాబీ కండువాలు కప్పుకున్నారు. తమను ఎలా గుర్తిస్తారని ప్రశ్నించే సమయంలోనే వారి పదవీ కాలం ముగియటంతో రాజ్యాంగపరమైన ఇబ్బందులు ఎదురు కాలేదు. కానీ.. అసెంబ్లీలో ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితి.

మొత్తం 15 మంది ఉన్న టీటీడీపీ ఎమ్మెల్యేల్లో ఎర్రబెల్లి.. ప్రకాశ్ గౌడ్ లు టీఆర్ ఎస్ లో చేరిన నేపథ్యంలో తెలంగాణ అధికారపక్షంలో చేరిన ఎమ్మెల్యేలసంఖ్య తొమ్మిదికి చేరుకుంటుంది. మరో.. ఇద్దరు - ముగ్గురు కారు ఎక్కటం ఖాయమని ఎర్రబెల్లి చెప్పిన నేపథ్యంలో మిగిలిన ఇద్దరు ముగ్గురి సంగతేమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. మెజార్టీ సభ్యులు తమదే టీటీడీపీ అని స్పీకర్ కు చెప్పి తమను టీఆర్ ఎస్ లో విలీనం చేయాలని కోరితే.. స్పీకర్ అందుకు అనుకూలంగా నిర్ణయం తీసుకునే వీలుంది. అదే జరిగితే.. మిగిలిన ముగ్గురు టీటీడీపీ ఎమ్మెల్యేల్ని ఎలా గుర్తిస్తారన్నది మరో ప్రశ్న. దీనిపై స్పీకర్ నిర్ణయం ఇప్పుడు ఆసక్తికరంగా మారిందనే చెప్పాలి. ఓ పక్క సాఫ్ట్ గా తన బాధను వ్యక్తం చేస్తూనే.. మరోవైపు చంద్రబాబుకు భారీ షాక్ ఇచ్చిన ఎర్రబెల్లి రానున్న రోజుల్లో ఇంకేం చేస్తారో చూడాలి.