Begin typing your search above and press return to search.

బాబు అనుకున్నంత ప‌ని చేస్తున్న ఎర్ర‌బెల్లి

By:  Tupaki Desk   |   12 Feb 2016 7:15 AM GMT
బాబు అనుకున్నంత ప‌ని చేస్తున్న ఎర్ర‌బెల్లి
X
తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ అడ్ర‌స్ గ‌ల్లంతు చేయాల‌నే టీఆర్ ఎస్ అధినేత - సీఎం కేసీఆర్ అనుకున్న ల‌క్ష్యం నెర‌వేరే దిశ‌గా అడుగులు ప‌డ్తున్నాయి. తాజాగా టీడీపీ నుంచి టీఆర్ ఎస్‌ లో చేరిన ఆ పార్టీ మాజీ ఫ్లోర్ లీడ‌ర్ ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ఇందుకు క్రియాశీలంగా క‌స‌ర‌త్తు చేస్తున్నారు. కేసీఆర్ క‌ళ్ల‌ల్లో ఆనంద కోసం బాబు కంట కారం కొట్టే ప్ర‌క్రియ‌కు ఎర్ర‌బెల్లి మ‌రో అడుగు వేశారు.

ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌ రావు, ఆయ‌న‌తో పాటు చేరిన ప్ర‌కాశ్‌ గౌడ్ తాజాగా పార్టీ మారిన నారాయ‌ణ‌పేట్ ఎమ్మెల్యే రాజేంద‌ర్ రెడ్డితో టీడీపీ నుంచి టీఆర్ ఎస్‌ లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 10 మందికి చేరిన సంగ‌తి తెలిసిందే. టీడీపీ త‌ర‌ఫున గెలిచిన మొత్తం 15 మందిలో 10 అంటే మూడింట రెండు వంతుల మంది పార్టీ మారిన నేప‌థ్యంలో ఎర్ర‌బెల్లి కీల‌క‌ ముందడుగు వేశారు. టీఆర్ ఎస్‌ లో విలీనం కావడానికి 10 మంది ఎమ్మెల్యేలు అంగీరించారని ఈ నేప‌థ్యంలో తమను టీఆర్ ఎస్‌ లో క‌లిపేయాలని కోరుతూ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారికి విన్న‌వించారు. ఈ మేరకు ఎర్రబెల్లి దయాకరరావు తాజాగా స్పీకర్‌ కు లేఖ రాశారు.

టీడీపీ త‌ర‌ఫున గెలిచిన త‌న‌తో స‌హా తలసాని శ్రీనివాస యాదవ్ - తీగల కృష్ణారెడ్డి - ప్రకాశ్ గౌడ్ -మంచిరెడ్డి కిషన్ రెడ్డి - సాయన్న - మాధవం కృష్ణారావు - చ‌ల్లా ధర్మారెడ్డి - కేవీ వివేకానంద గౌడ్ - రాజేందర్ రెడ్డి టీఆర్ ఎస్ కార్యాలయంలో సమావేశమై టీఆర్ ఎస్‌ స‌భ్యులుగా గుర్తింపు కావాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు స్పీకర్ కు రాసిన లేఖలో ఎర్ర‌బెల్లి వివ‌రించారు. ఈ నేప‌థ్యంలో అసెంబ్లీలో తమను టీఆర్ ఎస్ సభ్యులుగా గుర్తించాలని కోరారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ 4వ నిబంధన ప్రకారం తమ విలీనానికి అనుమతి ఇవ్వాలని స్పీకర్‌కు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర‌రావు విజ్ఞప్తి చేశారు.

టీడీపీ ఫ్లోర్ లీడ‌ర్‌ గా ఎర్ర‌బెల్లి స్థానంలో రేవంత్ రెడ్డిని నియ‌మిస్తూ చంద్ర‌బాబు ఇప్ప‌టికే స్పీక‌ర్‌ కు లేఖ రాసిన సంగ‌తి తెలిసిందే. అయితే పాత‌బాస్‌ కు వ్య‌తిరేకంగా...కొత్త బాస్ ఆనందం కోసం ప‌దిమంది ఎమ్మెల్యేల‌తో ఎర్ర‌బెల్లి దయాక‌రరావు చేసిన పైర‌వీ ఏ మేర‌కు వ‌ర్క‌వుట్ అవుతుందో చూడాలి మ‌రి.