బీటెక్ స్టూడెంట్ దెబ్బకు ఆ ఎమ్మెల్యేకు చుక్కలు

Thu Oct 12 2017 16:18:14 GMT+0530 (IST)

ఒక బీటెక్ కుర్రాడు చేసిన పనికి ఒక ఎమ్మెల్యేకు చుక్కలు కనిపించాయి. ఊహించని రీతిలో ఉన్న ఈ ఉదంతం వింటే అవాక్కు అవ్వాల్సిందే. సదరు కుర్రాడి దెబ్బకు ఠారెత్తి పోయిన ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు మహారాష్ట్రకు చెందిన సీనియర్ నేత.. సోషలిస్ట్ పార్టీకి చెందిన జితేంద్ర అవాహద్.సోషల్ మీడియాలో సదరు ఎమ్మెల్యే పేరుతో ఒక అకౌంట్ క్రియేట్ చేసిన సదరు బీటెక్ కుర్రాడు..  పలువురు మహిళలకు మెసేజ్ లు పెట్టేవాడు. ఫోన్లు చేసి గంటల తరబడి ఫోన్లు మాట్లాడుతూ విసిగించేవాడు.  అక్కడితో ఆగని ఆ కుర్రాడు వారిని డిన్నర్ లకు పిలిచేవాడు. దీంతో సదరు ఎమ్మెల్యే తీరుపై పలువురు ఫిర్యాదు చేయటం షురూ చేశారు.

అయితే.. ఈ విషయం మీద అవగాహన లేని సదరు ఎమ్మెల్యేకు మాత్రం ఏం జరుగుతుందో ఒక పట్టాన అర్థమయ్యేది కాదు. మొదట్లో తన పట్ల మహిళలు ఎందుకు అగ్రహం వ్యక్తం చేస్తున్నారో తెలీక కిందామీదా పడేవారు. తన పేరుతో మహిళలకు మెసేజ్ లు పెడుతున్న వైనాన్ని గుర్తించిన సదరు ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలో దిగే సమయానికి విషయాన్ని అర్థం చేసుకొని తెలివిగా అకౌంట్లను బ్లాక్ చేయటంతో అతడ్ని ఎలా పట్టుకోవాలో అర్థం కాక తల పట్టుకున్నారు.

ఇదిలా ఉంటే. కొంతకాలానికి మళ్లీ అకౌంట్ ఓపెన్ చేసి మళ్లీ మహిళల్ని వేధించటం షురూ చేశారు. ఇలాంటి అవకాశం ఎదురుచూస్తున్న పోలీసులు.. ఈసారి మాత్రం అవకాశాన్ని విడిచిపెట్టలేదు. ఐపీ ఆధారంగా అతగాడి అడ్రస్ ను పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. ఆ కుర్రాడి వివరాలు చూసిన పోలీసులు షాక్ తినే పరిస్థితి. ముంబయిలోని ఒక టాప్ కాలేజీలో బీటెక్ చదువుతున్న ఇతగాడి తల్లిదండ్రులు ఫారిన్ లో ఉంటున్నారని గుర్తించారు.

మెసేజ్ లు పెట్టినప్పుడు తిరిగి బదులిచ్చే వాటిని తాను ఎంజాయ్ చేస్తున్నట్లుగా వెల్లడించారు. బంధువుల ఇంట్లో ఉండి ఈ పాడు పని చేస్తున్న ఇతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.