టెకీల బ్లాక్ మెయిల్..ప్రముఖ సంస్థ మేనేజర్ షాక్

Wed Jun 13 2018 14:04:00 GMT+0530 (IST)

హైదరాబాద్ లోని సాఫ్ట్ వేర్ ఉద్యోగులు అవాక్కయ్యే పరిణామం ఇది. ఇలాంటి మోసాలు కూడా జరుగుతాయా అంటూ ఆశ్చర్యపోయే ఉదంతం ఇది...ఉద్యోగంలో విధానం ప్రకారం పదోన్నతులు కల్పించడంలేదని ఓ సాఫ్ట్ వేర్ మేనేజర్ ను.. కిందిస్థాయి ఉద్యోగులు బెదిరించి రూ.15 లక్షలు వసూలు చేశారు. బాధిత ఉద్యోగి ఫిర్యాదు మేరకు రాచకొండ పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. వారి నుంచి రూ.15లక్షలను రికవరీ చేశారు. ఈ సంచలన ఘటనకు బాధితుడు అయింది ఓ ప్రముఖ సంస్థలో మేనేజర్ కావడం గమనార్హం.రాచకొండ సీపీ మహేశ్ భగవత్ వెల్లడించిన వివరాల ప్రకారం ఎల్బీనగర్లో నివాసం ఉంటున్న శ్రీనివాస్ మర్రిమాకుల్లా సోమాజిగూడ ఏడీపీ ( ఆటోమేటిక్ డాటా ప్రాసెసింగ్) ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో సీనియర్ మేనేజర్ గా పని చేస్తున్నారు. అతని కింద సంజీవ్ ముత్యాలా - మాదరి కిరణ్ కుమార్ - రమేశ్ సాబునికర్ అనలిస్ట్ లుగా పని చేస్తున్నారు. అయితే తాము నిర్వహిస్తున్న విధులకు అనుగుణంగా పదోన్నతులు కల్పించడం లేదని సీనియర్ మేనేజర్ శ్రీనివాస్ మీద వారు కక్ష పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు కలిసి గత ఏడాది సెప్టెంబర్ 10 న శ్రీనివాస్ ను ఓ హోటల్ కు పిలిచి తమకు పదోన్నతులు కల్పించకపోతే తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపిస్తామని బెదిరించి దాడి చేశారు. ఈ కేసు పెట్టొద్దంటే తమకు రూ.15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఉద్యోగుల బెదిరింపులతో వణికిపోయిన మేనేజర్ శ్రీనివాస్ సొమ్ములు చెల్లించేందుకు సిద్ధమయ్యాడు. మొదట హైకోర్టు ప్రాంగణంలో రూ.5లక్షలు.. ఆ తర్వాత కాచిగూడ ప్రాంతంలో రూ.10 లక్షలు ఇచ్చాడు. అక్టోబర్ లో మరోసారి శ్రీనివాస్ ను బెదిరించి ఉద్యోగానికి రాజీనామా చేయాలన్నారు. ఆ సమయంలో శ్రీనివాస్ వద్ద నుంచి సిటీబ్యాంకుకు చెందిన ఓ బ్లాంక్ చెక్ ను తీసుకున్నారు. వారి బెదిరింపులకు భయపడిన శ్రీనివాస్ 2018 మార్చిలో ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఇదిలా ఉండగా...శ్రీనివాస్ తిరిగి ఉద్యోగంలో చేరుతాడనే అనుమానంతో వారు .. అతను ఇచ్చిన బ్లాంక్ చెక్ ను ఐడీబీఐ బ్యాంకులో డిపాజిట్ చేశారు. అయితే అది ఫెయిల్ అవడంతో శ్రీనివాస్ ను మరోసారి బెదిరించి మళ్లీ రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే శ్రీనివాస్ రూ.4 లక్షలు ఇస్తానని ఒప్పుకుని ... జరిగిన విషయాన్ని ఎల్బీనగర్ డీసీపీ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బెదిరింపులకు పాల్పడిన రమేశ్ - కిరణ్ కుమార్ - సంజీవ్ లను అరెస్టు చేసి వారి నుంచి రూ. 15 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి మోసాలకు టెకీలకు పాల్పడటం చిత్రంగా ఉందన్న పోలీసులు...ఇలాంటి బ్లాక్ మెయిల్ పర్వం ఎదుర్కుంటున్న వారు ఇంకెవరైనా ఉంటే తమను సంప్రదించవచ్చన్నారు.