Begin typing your search above and press return to search.

ప్రపంచాన్నికుదిపేస్తున్న టర్కీ సంక్షోభం!

By:  Tupaki Desk   |   14 Aug 2018 2:53 PM GMT
ప్రపంచాన్నికుదిపేస్తున్న టర్కీ సంక్షోభం!
X
అమెరికా వాసిని టర్కీ దేశం అరెస్ట్ చేయడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే షేక్ చేస్తోంది. ఒక్క పాస్టర్ కోసం అమెరికా పట్టిన పట్టు విడువక పోవడంతో టర్కీ దేశం అతలాకుతలం అవుతోంది. అమెరికా ఆంక్షలతో టర్కీ ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతోంది.

అమెరికా పాస్టర్ ఆండ్రూ బ్రన్సన్ ను టర్కీ ఇటీవల నిర్బంధించింది. దీనిపై అమెరికా ట్రంప్ సర్కార్ కన్నెర్ర చేసింది. తమ పాస్టర్ ను విడిచిపెట్టాలంటూ అమెరికా విధించిన డెడ్ లైన్ పై టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ పెడచెవిన పెట్టాడు. దీనిపై సీరియస్ అయిన అమెరికా టర్కీ దేశంపై ఆంక్షలు విధించింది. ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై 25శాతం సుంకాలను విధిస్తూ కొరఢా ఝలిపించింది. ఈ పరిణామాలు టర్కీ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఈ భయాలతో టర్కీలో పెట్టుబడులు పెట్టిన యూరప్ - అమెరికా బ్యాంకులు - ఇతర దేశాల పారిశ్రామికవేత్తలు పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. దీంతో టర్కీ కరెన్సీ ‘లీరా’ దారుణంగా పడిపోతోంది.

ఇక అమెరికా ప్రకటించిన ఆర్థికయుద్ధానికి భయపడేది లేదని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ తిరుగుబావుటా ఎగురవేశారు. దీన్నో రాజకీయ కుట్రగా ప్రకటించి అమెరికాతో కయ్యానికి కాలు దువ్వాడు. ప్రజలు తమ దగ్గరున్న అమెరికా డాలర్లు - బంగారాన్ని టర్కీ కరెన్సీ ‘లీరా’లోకి మార్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ పరిణామంతో మార్కెట్ వ్యవస్థ కుప్పకూలుతోంది. విదేశీ పెట్టుబడుదారుల ఉపసంహారణ.. ప్రజల డాలర్ల అమ్మకాలతో టర్కీ దేశ కరెన్సీ విలువ దారుణంగా పడిపోయింది. డాలరుతో లీరా మారకం విలువ 111శాతం పడిపోయింది. లీరా పతనంతో టర్కీ బ్యాంకులు - కంపెనీల విదేశీ రుణభారం 350 బిలియన్ డాలర్లకు పైగా పెరిగిపోయింది. దీంతో టర్కీ స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి.

టర్కీ సంక్షోభం భారత్ ను వెంటాడింది. పెరుగుతున్న కరెంట్ ఖాతా లోటు, భారమవుతున్న ముడిచమురు దిగుమతి ధరలు కూడా రూపాయి విలువ పతనంతో పెరిగిపోయాయి. ముఖ్యంగా డాలరు తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఈరోజు 70 రూపాయిలకు చేరుకుంది. ఇది 80 రూపాయలకు కూడా చేరుకోవచ్చన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో భారత్ కూడా టర్కీ వల్ల ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది.