Begin typing your search above and press return to search.

చంద్రబాబు నియోజకవర్గంలో గజగజ

By:  Tupaki Desk   |   25 July 2016 10:27 AM GMT
చంద్రబాబు నియోజకవర్గంలో గజగజ
X
ఏపీ సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోని ఆయన నియోజకవర్గం కుప్పం ప్రజలు అల్లాడుతున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని టెన్షన్ పడుతున్నారు. వారిని అంతగా భయపెడుతున్నది రాజకీయ కక్ష్యలు కావు.. రౌడీల ఆగడాలు కావు. అడవులను దాటి ఊళ్లలోకి వస్తున్న గజరాజులు వారిని నిద్రపోనివ్వడం లేదు. గజరాజులు ధాటికి కుప్పం ఏరియా గడగడలాడిపోతోంది. ఎప్పుడు ఎవరు మీద దాడి చేస్తాయో తెలియదు. పచ్చని పంట ఏ క్షణం ధ్వసమవుతుందో చెప్పలేని పరిస్థితి. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమని కాలం గడుపుతున్నారు.

కాగా కుప్పం నియోజకవర్గంలో ఏనుగుల కారణంగా ఆస్తి - ప్రాణ నష్టాలు జరుగుతున్నా ఏనుగులు నియంత్రించడంలో అటవి అధికారులు విఫలమవుతున్నారు. ముఖ్యమంత్రి సొంత నియోజక వర్గంలో ఏళ్ల తరబడి ఈ సమస్య ఉన్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో కుప్పం నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజలు ఊళ్లు వదిలి వెళ్లిపోతున్నారు.

మరోవైపు పంటలను కూడా ఇవి నాశనం చేస్తుండడంతో జనం తీవ్రంగా నష్టపోతున్నారు. చివరకు వారు పంటలు పోయినా పర్లేదు మనుషులను మిగిలిస్తే చాలు.. మమ్మల్ని కాపాడండి అంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నామని కుప్పం నియోజరవర్గ ప్రజలు చెబుతున్నారు. ఈ నియోజకవర్గం పరిధిలోని గుడిపల్లి - కుప్పం - శాంతిపురం - రామకుప్పం మండలాల్లోనే కాకుండా పలమనేరు నియోజకర్గంలోని బి.కోట - బైరెడ్డి పల్లెల్లో ఏనుగులు నిత్యం ఊళ్లలోకి వచ్చి పంటలను నాశనం చేయడంతో పాటు ఇళ్లను కూడా ధ్వంసం చేస్తున్నాయి. ఎవరైనా ఎదురుపడితే వారినీ విసిరికొడుతున్నాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలు భయంతో వణుకుతున్నారు.