Begin typing your search above and press return to search.

అక్కడైతే చంద్రబాబుకో రూలు.. జగన్ కో రూలా?

By:  Tupaki Desk   |   11 Aug 2017 4:19 AM GMT
అక్కడైతే చంద్రబాబుకో రూలు.. జగన్ కో రూలా?
X
ఎన్నికల సంఘం ఎలాంటి చట్టాలను పాటిస్తుందో.. నియమ నిబంధనలను ఎలా అనుసరిస్తుందో సాధారణ ప్రజల్లో ఎవ్వరికీ అంతగా అవగాహన ఉండదు. దానికి తగినట్లుగా ప్రస్తుత రాజకీయ వ్యవహారాల్లో ఈసీ అనుసరిస్తున్న తీరు కూడా వారికి మరింతగా అర్థంకాకుండాపోతోంది. ఈసీ వద్ద చంద్రబాబుకో రూలు - జగన్ కో రూలు వర్తిస్తుందా అని జనం అనుకుంటున్నారు.

ఎలాగంటే.. నంద్యాల ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ‘రోడ్డు మీద చంద్రబాబును కాల్చినా తప్పులేదని’ జగన్ ఓ వ్యాఖ్య చేశారు. అవి ఆవేశపూరిత ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలే తప్ప... అచ్చంగా ఆయనను చంపాల్సిందిగా కేడర్ ను పురమాయించిన వార్తలు కావు. అయితే ఈ వ్యాఖ్యలను ఈసీ సుమోటోగా స్వీకరించింది. ఈసీ ఉత్తర్వుల మేరకు కలెక్టర్ వివరణ కోరుతూ జగన్ కు నోటీసులు ఇచ్చారు. జగన్ కూడా దానికి తగినట్లుగానే.. తాను ఆవేదనతో చేసిన మాటలుగా భావించాలని కోరుతూ వివరణ ఇచ్చుకున్నారు.

అయితే ఇక్కడ ఓ విషయాన్ని కీలకంగా గమనించాల్సి ఉంది. జగన్ వివరణ గురించి ఈసీ భన్వర్ లాల్ మీడియాకు కూడా వెల్లడించారు. ఈ వివరణను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపుతామని, నిర్ణయం వారు తీసుకుంటారని ఆయన చెప్పారు. అయితే.. ఇలాంటి ఫిర్యాదులో తెలుగుదేశం వారి మీద కూడా వైసీపీ వారినుంచి అనేకం వచ్చాయని.. అయితే ఎన్నికల తేదీ సమీపించిన తర్వాత వచ్చిన ఫిర్యాదులు కావడంతో వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదని ఈసీ చెప్పుకొచ్చారు.

తెలుగుదేశం వారి మీద వైసీపీ వారు చేసిన ఫిర్యాదుల్ని మాత్రం సీరియస్ గా ఎందుకు పట్టించుకోరో... అదే సమయంలో జగన్ ఆవేశంలోనో, లేదా ఆవేదనలోనో చేసిన వ్యాఖ్యల్ని కూడా అంత సీరియస్ గా ఎందుకు పట్టించుకుంటారో సాధారణ జనానికి మాత్రం అర్థం కావడం లేదు. అయితే ఇక్కడ మరో ట్విస్టు ఏంటంటే.. జగన్ తాజాగా కూడా నంద్యాల ఎన్నికల ప్రచార సభలో మరోసారి చంద్రబాబు అంతం గురించి ప్రస్తావించారు. ఆయనను ఉరితీసినా తప్పులేదంటూ ఈసారి వ్యాఖ్యానించారు. దీనిని కూడా ఎన్నికల తేదీ దగ్గరకు వచ్చిన తర్వాత చేసిన వ్యాఖ్యలు గనుక.. ఈసీ తేలిగ్గా తీసుకుని వదిలేస్తుందో.. లేదా వివరణ కోరుతుందో చూడాలి.