Begin typing your search above and press return to search.

మార్చి మొదటివారం తరువాత ఎలక్షన్ షెడ్యూల్

By:  Tupaki Desk   |   23 Feb 2019 2:40 PM GMT
మార్చి మొదటివారం తరువాత ఎలక్షన్ షెడ్యూల్
X
జనరల్ ఎలక్షన్లకు సమయం సమీపిస్తోంది. ఎలక్షన్ కమిషన్ ఇందుకోసం షెడ్యూల్ విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లూ చేస్తున్నట్లు సమాచారం. షెడ్యూల్ విడుదల చేసేలోగానే ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకుంటున్న కమిషన్ ఇప్పటికే పలు రాష్ట్రాలకు ఈవీఎంలను పంపించింది. మరో రెండు వారాల్లో షెడ్యూల్ కూడా రానున్నట్లు తెలుస్తోంది.

మార్చి 7 నుంచి 10 మధ్య షెడ్యూల్‌ ను విడుదల చేసేలా ఎలక్షన్ కమిషన్ రెడీ అవుతోందట. లోక్ సభ ఎన్నికలతో పాటు అయిదు రాష్ట్రాలకు కూడా ఎన్నికలు నిర్వహించేలా కమిషన్ ఏర్పాట్లు చేసుకుంటోంది. దీంతో... లోక్ సభ గడువు కంటే ముందే సిక్కి రాష్ట్ర అసెంబ్లీ గడువు ముగియనుండడంతో దాన్ని దృష్టిలో ఉంచుకుని కమిషన్ తేదీలు - ఫేజెస్ ఖరారు చేసే పనిలో ఉన్నట్లు దిల్లీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

ప్రస్తుత 16వ లోక్ సభ గడువు జూన్3తో ముగియనుండగా.. ఎన్నికలు నిర్వహించనున్న అయిదు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ - ఒడిశా - అరుణాచల్ ప్రదేశ్ - సిక్కిం - జమ్ముకశ్మీర్ అసెంబ్లీలలో రెండు అసెంబ్లీలు సిక్కిం - అరుణాచల్ ప్రదేశ్‌ ల గడువు ముందే ముగుస్తోంది. సిక్కిం అసెంబ్లీ గడువు మే 27తో అరుణాచల్ ప్రదేశ్ జూన్ 1తో ముగుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జూన్ 18న - ఒడిస్సా రాష్ట్రానికి జూన్ 11న పదవీకాలం ముగియనుంది. వీటితో పాటు ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్మూకశ్మీర్‌ కు కూడా ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

ఎన్నికలకు సంబంధించి 22.3 లక్షల బ్యాలెట్ యూనిట్లు - 16.3 లక్షల కంట్రోల్ యూనిట్లు - 17.3 లక్షల వీవీప్యాట్ యంత్రాలు అవసరమవుతాయని ఎలక్షన్ కమిషన్ తేల్చింది. మరోవైపు ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రాల్లో పర్యటించి పరిస్థితులు సమీక్షించారు. మార్చి 6న కేంద్ర కేబినెట్ చివరిసారిగా సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత నాలుగైదు రోజుల్లో ఎన్నికల ప్రకటన రావొచ్చని భావిస్తున్నారు.