ఎల్లుండే ఏపీలో ఎన్నికల షెడ్యూల్..

Tue Feb 12 2019 10:42:09 GMT+0530 (IST)

ఏపీలో ఎన్నికల సందడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ - సార్వత్రిక ఎన్నికలకు ఈ నెలలో నోటిఫికేషన్ జారీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది.  దీంతో ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. ఎల్లుండి ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో కొత్త కార్యక్రమాలకు బ్రేక్ పడనుంది. అందుకే ఏపీ కేబినెట్ ప్రజలపై వరాల వాన కురిపించి ఓట్లు దండుకునే స్కెచ్ గీసింది. అంతేకాదు పెండింగ్ నిర్ణయాలకు ఆమోదం తెలిపేందుకు సిద్ధమైంది.ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే చంద్రబాబు కొత్త పథకాలకు బ్రేక్ పడనుంది. ఈనెల 14న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ - దాంతోపాటే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాలు ప్రకటించడానికి - అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి వీల్లేదు. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్ల ఉత్తరాంధ్ర - ఉభయగోదావరి - కృష్ణా - గుంటూరు జిల్లాల్లో ఏ పనులు చేపట్టాడినికి లేదు. మిగతా ఆరు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు లేనందుకు అక్కడ అమలు చేయొచ్చు. అంటే సగం రాష్ట్రంలో మూడు రోజుల్లో కోడ్ అమల్లోకి రానుందన్నమాట.. ఈ కోడ్ ముగియగానే సార్వత్రిక ఎన్నికల కోడ్ రానుంది. అందుకే ఈ రెండు రోజులు ఏపీ కేబినెట్ తీసుకునే నిర్ణయాలే కీలకంగా మారాయి.

ఏపీలో అసెంబ్లీ - సార్వత్రిక ఎన్నికలకు ఫిబ్రవరి 28న లేదా మార్చి 4న నోటిఫికేషన్ వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. అప్పటి నుంచి కోడ్ ఉంటుంది. దీంతోపాటు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ 14నుంచే ఉంటుంది. ప్రధాని నరేంద్రమోడీ విశాఖలో కొన్ని పనులకు మార్చి1న శంకుస్థాపన చేయనున్నారు. దీంతో మార్చి 4కే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావచ్చంటున్నారు. ఈ నేపథ్యంలో నాలుగైదు రోజులే ఏపీ కేబినెట్ నిర్ణయాలు తీసుకొని అమలు చేసేందుకు ఉంటుంది.

చాలా తక్కువ రోజులు సమయం ఉండడంతో ఏపీ కేబినెట్ 13న సాయంత్రం కీలక సమావేశం నిర్వహిస్తోంది. ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే అధికారులకు బదిలీలు చేపట్టనుంది. ఇప్పటికే 103 మంది డిప్యూటీ కలెక్టర్లు - ఆర్డీవోల బదిలీలు చేసేసింది. కొత్త సంక్షేమ పథకాలకు బ్రేక్ పడనున్న నేపథ్యంలో పాతవి కొనసాగించే వీలుంటుంది కాబట్టి కోడ్ కు ముందే పలు నిర్ణయాలు తీసుకొని ప్రజలకు లబ్ధి చేకూర్చి ఎన్నికలకు వెళ్లాలని బాబు ప్లాన్ చేశారు.